Telugu Global
Andhra Pradesh

నాలుక మడతపెట్టిన చంద్రబాబు.. విజయమ్మనూ ఆడిపోసుకుంటావా..?

విజయమ్మపై వ్యాఖ్యలు చేయడంలో చంద్రబాబు అంతటితో ఆగలేదు. కొడుకూ కూతుళ్ల మధ్య సమస్యలు ఉంటే తల్లిగా ఆ సమస్యలను ఇంట్లో పరిష్కరించాల్సి ఉంటుందని ఆయన అన్నారు.

నాలుక మడతపెట్టిన చంద్రబాబు.. విజయమ్మనూ ఆడిపోసుకుంటావా..?
X

టీడీపీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు చేసిందంతా చేసి ఇప్పుడు నాలుక మడత పెట్టారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ నాయకత్వంలోని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఓట్లను చీల్చి ఎన్నికల్లో ప్రయోజనం పొందాలని కాంగ్రెస్ పెద్దలతో కలిసి కుట్ర చేసి షర్మిలను రంగంలోకి దించారు. వైఎస్ వివేకానంద రెడ్డి హత్యపై ఆమె చేత ఆరోప‌ణ‌లు చేయిస్తూ జగన్ ను దెబ్బ తీయాలని చూశారు, చూస్తున్నారు. ఇప్పుడు మాట మార్చి కాంగ్రెస్ ను విమర్శిస్తున్నారు. ప్రతిపక్షాల ఓట్లు చీల్చడానికి కాంగ్రెస్ ద్వారా కుట్ర చేసి షర్మిలను రంగంలోకి దించారని ఆయన అంటున్నారు. ఆ ట్రాప్ లో పడవద్దని ఆయన పెదకూరపాడు ప్రజాగళం సభలో శనివారంనాడు ఏపీ ప్రజలకు పిలుపునిచ్చారు.

వైఎస్సార్ సీపీ, కాంగ్రెస్ కలిసి డ్రామాలాడుతున్నాయని ఆయన అన్నారు. కాంగ్రెస్ తో కలిసి డ్రామాకు తెర తీసింది చంద్రబాబు కాదా? షర్మిలను ఏపీ రాజకీయాల్లో తాను ప్రవేశపెట్టలేదని నమ్మించడానికో, షర్మిల ప్రవేశం వల్ల వైఎస్సార్ కాంగ్రెస్ కు ఏ విధమైన నష్టం జరగదని గ్రహించడం వల్లనో ఆయన ఇలా మాట్లాడుతున్నారని అనిపిస్తోంది.

విజయమ్మపైనా నోరు పారేసుకున్న చంద్రబాబు

వైఎస్ జగన్ తల్లి విజయమ్మపై కూడా ఆయన నోరు పారేసుకున్నారు. తన కుమారుడు ఏపీని, తన కూతురు తెలంగాణను చూసుకుంటారని ఆమె గతంలో చెప్పారని, ఇప్పుడు ఆమె కూతురు షర్మిల ఏపీ కాంగ్రెస్ కు నాయకత్వం వహిస్తున్నారని, ఒక తల్లి తన కూతురికీ తన కుమారుడికీ న్యాయం చేయలేకపోయారని, ఐదు కోట్ల ప్రజలకు ఎలా న్యాయం చేస్తారని చంద్రబాబు అన్నారు. కొడుకైనా, కూతురైనా ప్రతి తల్లీ అందరూ క్షేమంగా ఉండాలని కోరుకుంటారు. విజయమ్మ కూడా అదే కోరుకుంటున్నారు. వారి నిర్ణయాల్లో ఆమె జోక్యం లేదు. ఇరువురు తమ ఇష్టప్రకారం రాజకీయాలు చేస్తున్నారు. ఇంట్లోనే ఉంటున్న విజయమ్మకు రాజకీయాలు ఆపాదించడం చంద్రబాబుకు మాత్రమే చెల్లుతుంది.

కాంగ్రెస్ కు ప్రాతినిధ్యం వహిస్తున్న షర్మిలకు ఓటు వేయాలని వైఎస్ వివేకా కూతురు సునీతా రెడ్డి కోరుతున్నారని ఆయన తప్పు పట్టారు. జగన్ ను వ్యతిరేకించే విషయంలో వారిద్దరికీ ఎప్పటికప్పుడు సాయం అందిస్తున్న చంద్రబాబు, వెనక ఉండి వారిని నడిపిస్తున్న చంద్రబాబు ఇలాంటి మాటలు మాట్లాడడం ఎంత వరకు సమంజసం?

విజయమ్మపై వ్యాఖ్యలు చేయడంలో చంద్రబాబు అంతటితో ఆగలేదు. కొడుకూ కూతుళ్ల మధ్య సమస్యలు ఉంటే తల్లిగా ఆ సమస్యలను ఇంట్లో పరిష్కరించాల్సి ఉంటుందని ఆయన అన్నారు. కుటుంబంలో చిచ్చు పెట్టిన చంద్రబాబు ఇప్పుడు నంగనాచి కబుర్లు చెప్పుతున్నారు. నందమూరి కుటుంబాన్ని కూడా చీల్చిన ఘనత ఆయనది. తన స్వార్థం కోసం, స్వార్థ రాజకీయాల కోసం కుటుంబాలను కూడా చీల్చేందుకు కుట్రలు చేసే తత్వం చంద్రబాబుది. ఇది జగమెరిగిన సత్యం.

First Published:  7 April 2024 3:55 AM GMT
Next Story