Telugu Global
Andhra Pradesh

వీఆర్వో సస్పెన్షన్.. కారణం తెలిస్తే షాక్

యూనిఫామ్ లేకుండా రావడంతోపాటు.. దానికి అతను చెప్పిన కారణంతో కమిషనర్ కి కోపమొచ్చింది. అందుకే వెంటనే సస్పెన్షన్ వేటు వేశారు.

వీఆర్వో సస్పెన్షన్.. కారణం తెలిస్తే షాక్
X

ఇటీవల నెల్లూరు నుంచి తిరుపతి కమిషనర్ గా బదిలీపై వెళ్లారు హరిత. తిరుపతిలో చార్జ్ తీసుకున్న వారం రోజుల్లోనే ఆమె ఒక వీఆర్వోని సస్పెండ్ చేశారు. అయితే సస్పెన్షన్ కి కారణం తెలిస్తే అందరూ షాకవ్వాల్సిందే. యూనిఫామ్ లేకుండా సివిల్ డ్రస్ లో మీటింగ్ కి హాజరైనందుకు ఓ వీఆర్వోని తిరుపతి కమిషనర్ సస్పెండ్ చేశారు. యూనిఫామ్ లేకుండా రావడంతోపాటు.. దానికి అతను చెప్పిన కారణంతో కమిషనర్ కి కోపమొచ్చింది. అందుకే వెంటనే సస్పెన్షన్ వేటు వేశారు.

ఆమధ్య ఏపీలోని గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులకు యూనిఫామ్ ని ఉచితంగా అందించింది ప్రభుత్వం. సచివాలయ ఉద్యోగులంతా యూనిఫామ్ లో రావాలని ఆదేశాలిచ్చారు అధికారులు. కొత్తగా ఉద్యోగాల్లో చేరినవాళ్లంతా యూనిఫామ్ తో వస్తున్నారు. కానీ అప్పటి వరకూ రెవెన్యూ డిపార్ట్ మెంట్లో పనిచేసిన వీఆర్వోలు మాత్రం యూనిఫామ్ ధరించడానికి ఇష్టపడటం లేదు. ఎమ్మార్వో ఆఫీస్ ఉద్యోగులకు యూనిఫామ్ అవసరం లేదనేది వారి వాదన, కానీ సచివాలయాల పరిధిలోకి వచ్చాక వారు కూడా యూనిఫామ్ వేసుకోవాల్సిందేనని ఉన్నతాధికారులు ఆదేశించారు. ఈ తర్జన భర్జనల మధ్య ఉన్నతాధికారులు ఎన్ని ఆదేశాలిచ్చినా కొంతమంది మాత్రం సివిల్ డ్రస్ లోనే విధులకు హాజరవుతున్నారు. అయితే తిరుపతి కమిషనర్ మాత్రం యూనిఫామ్ లేకుండా మీటింగ్ లో పాల్గొన్న వీఆర్వోపై సస్పెన్షన్ వేటు వేసి కలకలం సృష్టించారు.

కారణం ఏం చెప్పారంటే..?

తిరుపతికి కొత్తగా వచ్చిన కమిషనర్ హరిత.. స్థానిక సమస్యలపై సచివాలయ ఉద్యోగులతో జూమ్ మీటింగ్ ఏర్పాటు చేశారు. సచివాలయాలకు హాజరైన ఉద్యోగులు, ఈ జూమ్ మీటింగ్ లో పాల్గొన్నారు. దాదాపు అందరూ యూనిఫామ్ లోనే వచ్చారు. వీఆర్వో ప్రసాద్ మాత్రం యూనిఫామ్ వేసుకోలేదు. కారణమేంటని ప్రశ్నించారు కమిషనర్ హరిత. తన యూనిఫామ్ ని ఎలుకలు కొట్టేశాయంటూ వింతైన సమాధానం చెప్పారు వీఆర్వో. దీంతో కమిషనర్ కి చిర్రెత్తుకొచ్చింది. యూనిఫామ్ వేసుకోకపోవడంతోపాటు, ఎలుకలు కొరికేశాయంటూ నిర్లక్ష్యంగా సమాధానం చెప్పిన వీఆర్వోపై వెంటనే సస్పెన్షన్ వేటు వేశారు కమిషనర్ హరిత. ఈ ఘటన తిరుపతిలో హాట్ టాపిక్ గా మారింది.

First Published:  11 April 2023 4:51 AM GMT
Next Story