Telugu Global
Andhra Pradesh

తిరుపతి సీటు.. తమ్ముళ్లలో మొదలైన ఆందోళన

తిరుపతి పార్లమెంట్ సీటు విషయంలోనూ ఇదే తరహా గందరగోళం నెలకొంది. పొత్తులో భాగంగా తిరుపతి పార్లమెంట్ సీటును బీజేపీకి ఇస్తారని తెలుస్తోంది.

తిరుపతి సీటు.. తమ్ముళ్లలో మొదలైన ఆందోళన
X

తిరుపతి సీటు విషయంలో స్థానిక తెలుగుదేశం పార్టీ నేతల్లో ఆందోళన మొదలైంది. పొత్తులో భాగంగా తిరుపతి అసెంబ్లీ సీటును జనసేనకు కేటాయించారు. దీంతో వారం రోజుల క్రితం వైసీపీ నుంచి జనసేనలో చేరిన చిత్తూరు ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులుకు తిరుపతి సీటును జనసేనాని ఖరారు చేశారు. అయితే ఆరణి శ్రీనివాసులు నాన్‌లోకల్‌ కావడంతో తెలుగుదేశం, జనసేన శ్రేణుల్లో గుబులు మొదలైనట్లు తెలుస్తోంది.

ఇక తిరుపతి పార్లమెంట్ సీటు విషయంలోనూ ఇదే తరహా గందరగోళం నెలకొంది. పొత్తులో భాగంగా తిరుపతి పార్లమెంట్ సీటును బీజేపీకి ఇస్తారని తెలుస్తోంది. అయితే బీజేపీ ఇప్పటివరకూ అభ్యర్థులను ఖరారు చేయలేదు. కానీ స్థానిక తెలుగుదేశం నేతలు ఈ అంశంపై అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారని సమాచారం. ఇప్పటికే అసెంబ్లీ సీటును జనసేనకు కేటాయించారని, పార్లమెంట్ సీటు బీజేపీకి ఇస్తే తిరుపతిలో తెలుగుదేశం జెండా కనిపించదని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

ఇదే నిజమైతే దాదాపు 41 ఏళ్ల తర్వాత తిరుపతిలో తెలుగుదేశం పోటీలో లేకుండాపోయినట్లవుతుంది. 1983లో అప్పటి తెలుగుదేశం అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు తిరుపతి అసెంబ్లీ స్థానం నుంచి విజయం సాధించారు. ఇప్పుడు పార్లమెంట్‌, అసెంబ్లీ మిత్రపక్షాలకు కేటాయించడంతో తమ్ముళ్లు నిరాశలో ఉన్నట్లు తెలుస్తోంది.

First Published:  14 March 2024 5:41 AM GMT
Next Story