Telugu Global
Andhra Pradesh

పోలింగ్ ముగిసింది.. తిరుమల కొండ నిండింది..

ఈనెల 13న పోలింగ్ ప్రక్రియ పూర్తవడంతో అటు రాజకీయ నాయకులు, ఇటు సామాన్య భక్తులు శ్రీవారి దర్శనానికి రావడం మొదలుపెట్టారు. దీంతో నిన్న, ఇవాళ శ్రీవారి భక్తులతో కొండ నిండింది.

పోలింగ్ ముగిసింది.. తిరుమల కొండ నిండింది..
X

తిరుమలలో భక్తుల రద్దీ అనూహ్యంగా పెరిగింది. దీంతో శ్రీవారి దర్శనానికి 24 గంటల సమయం పడుతోంది. మామూలుగా వేసవి సెలవుల్లో తిరుమలలో భక్తుల రద్దీ ఎక్కువే. అయితే ఈసారి మాత్రం అంతగా రద్దీ కనిపించలేదు. ఎన్నికల కారణంగా నాయకులు ప్రచారానికే పరిమితం అయ్యారు. ఎన్నికల ప్రచారంలో నిమగ్నం కావడంతో వీఐపీ బ్రేక్ లో కూడా వీఐపీలు తక్కువగా కనిపించారు. అటు ఎన్నికల ఎఫెక్ట్ తో పోలింగ్ ముగిసిన తర్వాతే దర్శనానికి రావాలని సాధారణ జనం కూడా భావించడంతో ఇప్పటివరకు తిరుమలలో భక్తుల రద్దీ కనిపించలేదు.

ఈనెల 13న పోలింగ్ ప్రక్రియ పూర్తవడంతో అటు రాజకీయ నాయకులు, ఇటు సామాన్య భక్తులు శ్రీవారి దర్శనానికి రావడం మొదలుపెట్టారు. దీంతో నిన్న, ఇవాళ శ్రీవారి భక్తులతో కొండ నిండింది. శ్రీవారి ఆలయం, మాడవీధులు, అన్న ప్రసాద భవనం, అఖిలాండం, లడ్డూ కౌంటర్ల వద్ద, కల్యాణ కట్టల వద్ద భక్తజనం భారీగా కనిపించారు. భక్తులు పెద్ద సంఖ్యలో తరలిరావడంతో గదులు కూడా దొరకడం లేదు.

భక్తుల రద్దీ విపరీతంగా పెరగడంతో శ్రీవారి దర్శనానికి 24 గంటల సమయం పడుతోంది. వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లో అన్ని కంపార్ట్మెంట్లు భక్తులతో నిండిపోయాయి. నారాయణగిరి ఉద్యానవనంలోని షెడ్లు కూడా భక్తులతో నిండడంతో ఔటర్ రింగ్ రోడ్డులో మూడు కిలోమీటర్ల మేర భక్తులు క్యూ లైన్ లో నిల్చున్నారు. టోకెన్లు లేని సర్వదర్శనం భక్తులకు 24 గంటల సమయం పడుతున్నట్లు టీటీడీ అధికారులు ప్రకటించారు.

First Published:  17 May 2024 5:54 PM GMT
Next Story