Telugu Global
Andhra Pradesh

శ్రీవారి ఆస్తుల విలువ రూ.2.25 లక్షల కోట్లు

పారదర్శకత కోసం ఈ వివరాలను వెల్లడిస్తున్నట్టు టీటీడీ వివరించింది. ప్రపంచవ్యాప్తంగా శ్రీవారి ఆస్తులు, ఆభరణాలు, సొమ్ము విలువ దాదాపుగా రూ.2.25 లక్షల కోట్ల వరకు ఉంటుందని అంచనా వేశారు.

శ్రీవారి ఆస్తుల విలువ రూ.2.25 లక్షల కోట్లు
X

తిరుమల శ్రీవారి ఆస్తుల వివరాలను టీటీడీ అధికారికంగా ప్రకటించింది. పారదర్శకత కోసం ఈ వివరాలను వెల్లడిస్తున్నట్టు టీటీడీ వివరించింది. ప్రపంచవ్యాప్తంగా శ్రీవారి ఆస్తులు, ఆభరణాలు, సొమ్ము విలువ దాదాపుగా రూ.2.25 లక్షల కోట్ల వరకు ఉంటుందని అంచనా వేశారు. దేశంలోని వివిధ ప్రాంతాల్లో స్వామివారి ఆస్తులు 960 ఉన్నాయి. రిజస్ట్రేషన్ వ్యాల్యూ ప్రకారం ఈ ఆస్తుల విలువ రూ.75 వేల కోట్ల వరకు ఉంటుందని చెబుతున్నారు. బహిరంగ మార్కెట్‌లోకి వీటి విలువ రూ.లక్షా 87 వేల కోట్ల నుంచి 2.1 లక్షల కోట్ల వరకు ఉంటుందని అంచనా వేశారు.

స్వామివారి బంగారం 10 టన్నులకు పైగా ఉంది. 10,258.37 కిలోల బంగారాన్ని రెండు జాతీయ బ్యాంకుల్లో డిపాజిట్ చేసినట్టు టీటీడీ వివరించింది. వివిధ జాతీయ బ్యాంకుల్లో ఈ ఏడాది సెప్టెంబర్ నాటికి టీటీడీకి చెందిన రూ.15,938.68 కోట్ల నగదు ఉంది. అధిక వడ్డీ చెల్లించే బ్యాంకుల్లోనే నగదు, బంగారం డిపాజిట్ చేస్తున్నట్టు టీటీడీ ప్రకటనలో వెల్లడించింది. హుండీ ద్వారా వచ్చే బంగారు కానుకలను మాత్రం కరిగించి 12 ఏళ్ల పాటు గోల్డ్ మానిటైజేషన్ స్కీంలో పెట్టుబడుల రూపంలో పెట్టేందుకు భారత ప్రభుత్వ మింట్‌కు పంపిస్తున్నట్టు వివరించింది.

తిరుమల ఆలయంలో పాటు టీటీడీకి చెందిన వివిధ ఆలయాల్లో స్వామివారికి 250 కిలోల ఆభరణాలున్నాయి. వీటిలో రాజుల కాలం నాటి అతిపూరతమైన ఆభరణాలు, వజ్రాలు ఉన్నాయి. మొత్తం బంగారంలో 9819.38 కిలోల బంగారాన్ని ఎస్‌బీఐలో డిపాజిట్ చేశారు. మరో 438.99 కిలోల బంగారాన్ని ఇండియన్ ఓవర్‌సీస్ బ్యాంకులో ఉంచారు.

తప్పుడు ప్రచారం నమ్మొద్దు - ఈవో

శ్రీవారి బంగారం, ఆస్తుల విషయంలో జరిగే తప్పుడు ప్రచారాన్ని నమ్మవద్దని ఈవో ధర్మారెడ్డి కోరారు. 2019 తర్వాత శ్రీవారి ఆస్తులు, ఆభరణాలు భద్రపరిచే విషయంలో కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నట్టు చెప్పారు. టీటీడీ చరిత్రలో ఇప్పటి వరకు ఏ ప్రభుత్వానికి కూడా స్వామివారి నిధులను మళ్లించలేదన్నారు. భవిష్యత్తులో కూడా ఇచ్చే ప్రసక్తే ఉండదన్నారు. రాష్ట్ర ప్రభుత్వ సెక్యూరిటీ బాండ్లలోనూ టీటీడీ పెట్టుబడులు పెట్టలేదన్నారు. 15,900 కోట్ల రూపాయలను జాతీయ బ్యాంకుల్లోనే ఉంచామని, ఇకపై కూడా అదే చేస్తామన్నారు. బంగారం మొత్తం రెండు జాతీయ బ్యాంకుల్లోనూ ఉంచామన్నారు.

First Published:  6 Nov 2022 3:21 AM GMT
Next Story