Telugu Global
Andhra Pradesh

తిరుమల నో ఫ్లయింగ్ జోన్ కాదు..

ఎలక్షన్ నోటిఫికేషన్ వెలువడిన రోజు నుంచి సిఫార్సు లేఖలు రద్దు చేయాలని నిర్ణయించింది టీటీడీ. నోటిఫికేషన్ వెలువడిన తర్వాత తిరుమల శ్రీవారి దర్శనాల్లో నేతల సిఫార్సులు పనిచేయవని తేల్చి చెప్పారు చైర్మన్.

తిరుమల నో ఫ్లయింగ్ జోన్ కాదు..
X

తిరుమల కొండపై నుంచి ఎప్పుడు ఏ విమానం వెళ్లినా సడన్ గా రాజకీయ విమర్శలు చెలరేగుతాయి. తిరుమల నో ఫ్లయింగ్ జోన్ అని, అక్కడ విమానాలు ఎగరకూడదని, కానీ ప్రభుత్వం చేష్టలుడిగి చూస్తోందని విమర్శలు వినిపిస్తుంటాయి. ప్రతిపక్షంలో ఎవరున్నా ఈ విమర్శలు కామన్. ఇలాంటి విమర్శలకు పూర్తి స్థాయిలో చెక్ పెట్టేశారు టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి. తిరుమలను నో ఫ్లయింగ్ జోన్‌గా ప్రకటించడం కుదరదని కేంద్ర విమానయాన మంత్రిత్వశాఖ తెలిపిందని ఆయన స్పష్టం చేశారు. విమానయానం అనేది కేంద్ర జాబితాలోని అంశం కాబట్టి.. కేంద్రం అధీనంలోని విమానయాన మంత్రిత్వ శాఖ చెప్పినట్టే.. తిరుమల నో ఫ్లయింగ్ జోన్ కాదు అని తేలిపోయింది. ఇక బీజేపీ వీర విధేయులెవరైనా ఉంటే కేంద్రంతో ఒప్పించి తిరుమలను నో ఫ్లయింగ్ జోన్ గా ప్రకటించే ఏర్పాటు చేయొచ్చు.

త్వరలో సిఫార్సు లేఖలు రద్దు..

టీటీడీ పాలక మండలి పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. ఎలక్షన్ నోటిఫికేషన్ వెలువడిన రోజు నుంచి సిఫార్సు లేఖలు రద్దు చేయాలని నిర్ణయించింది. నోటిఫికేషన్ వెలువడిన తర్వాత తిరుమల శ్రీవారి దర్శనాల్లో నేతల సిఫార్సులు పనిచేయవని తేల్చి చెప్పారు చైర్మన్. ప్రోటోకాల్ పరిధిలోని వ్యక్తులు స్వయంగా వస్తేనే బ్రేక్ దర్శనం కల్పిస్తామన్నారు.

ఇతర నిర్ణయాలు..

స్విమ్స్ ఆసుపత్రిలో మరింత మెరుగైన వైద్య సేవలు అందించేందుకు 479 నర్సు పోస్టుల భర్తీకి పాలకమండలి ఆమోదం తెలిపింది. టీటీడీ విద్యాసంస్థల్లో ఎలాంటి సిఫార్సు లేకుండా హాస్టల్ వసతి కల్పించేలా ఏర్పాట్లు చేయబోతోంది. నూతన హాస్టల్ భవన నిర్మాణాలకు ఆమోదం తెలిపింది. రూ. 1.88 కోట్లతో పీఏసీ అభివృద్ధి పనులకు నిధులు కేటాయింపు, యాత్రికుల వసతి సముదాయాలలో లిఫ్ట్ సౌకర్యం ఏర్పాటు చేయాలని పాలకమండలి నిర్ణయించింది. తిరుమల చుట్టూ రూ. 1.50 కోట్లతో మిగిలిన ఔటర్ ఫెన్సింగ్ ఏర్పాటకు టీటీడీ ఆమోదం తెలిపింది. రూ. 14 కోట్లతో ఉద్యోగుల వసతి సముదాయాల అభివృద్ధికి ఆమోదం తెలిపింది. శ్రీవాణి ట్రస్ట్ ద్వారా టీటీడీ ఆద్వర్యంలో ఉన్న ఆలయాల్లో అభివృద్ధి పనులు మొదలు పెట్టేందుకు కూడా నిర్ణయం తీసుకున్నారు.

First Published:  11 March 2024 10:03 AM GMT
Next Story