Telugu Global
Andhra Pradesh

మళ్లీ నిండిన కొండ .. దర్శనానికి 22 గంటలు

పెరటాసి పురస్కరించుకొని శనివారం ఉదయం నుంచి కొండకు వచ్చే భక్తుల సంఖ్య అమాంతంగా పెరిగింది. తిరుమలకు వచ్చిన భక్తులతో శ్రీవారి ఆలయ పరిసర ప్రాంతాలు కిటకిటలాడుతున్నాయి.

మళ్లీ నిండిన కొండ .. దర్శనానికి 22 గంటలు
X

కొద్ది రోజుల కిందటి వరకు భక్తులతో కిటకిటలాడింది తిరుమల కొండ. ప్రస్తుతం పెరటాసి నెల శనివారం నుంచి మొదలు కావడంతో మళ్లీ భక్తులు తండోపతండాలుగా తిరుమల కొండకు చేరుకుంటున్నారు. కొండపై ఎక్కడ చూసినా భక్తుల రద్దీ నెలకొంది. పెరటాసి పురస్కరించుకొని శనివారం ఉదయం నుంచి కొండకు వచ్చే భక్తుల సంఖ్య అమాంతంగా పెరిగింది. తిరుమలకు వచ్చిన భక్తులతో శ్రీవారి ఆలయ పరిసర ప్రాంతాలు కిటకిటలాడుతున్నాయి.

మాడవీధులు, లడ్డూ కౌంటర్లు, అన్నప్రసాద భవనం, అఖిలాండం, వైకుంఠం క్యూ కాంప్లెక్స్, బస్టాండ్ వంటి ప్రాంతాల్లో భక్తుల రద్దీ నెలకొంది. స్వామివారి దర్శనానికి వచ్చిన భక్తులు గదుల కోసం కేటాయింపు కేంద్రాల వద్ద క్యూలు కట్టారు. కళ్యాణ కట్టలు కూడా భక్తులతో నిండిపోయాయి.

ఇక సర్వదర్శనానికి భారీ సంఖ్యలో తరలివచ్చిన భక్తులతో వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లు పూర్తిగా నిండిపోయాయి. కంపార్ట్మెంట్లు నిండిపోవడంతో కొంత మంది భక్తులను నారాయణగిరి ఉద్యానవనంలోని షెడ్లలో ఉంచారు. వైకుంఠం కాంప్లెక్స్ లోకి ప్రవేశించేందుకు భక్తులు రాంభగీచా బస్టాండ్ వరకు క్యూ లైన్లలో వేచిఉన్నారు. భక్తుల రద్దీ కారణంగా స్వామివారి దర్శనానికి వచ్చిన వృద్ధులు, చిన్న పిల్లలు కొంతమేర ఇబ్బంది పడ్డారు. శ్రీవారి దర్శనానికి 22 గంటల సమయం పడుతున్నట్లు టీటీడీ అధికారులు ప్రకటించారు. ఇవాళ ఆదివారం సెలవు దినం కావడంతో తిరుమలలో రద్దీ మరింత పెరిగే అవకాశం ఉంది.

First Published:  18 Sep 2022 5:01 AM GMT
Next Story