Telugu Global
Andhra Pradesh

టిడ్కో ఇళ్లు జగన్ కి తలనొప్పిగా మారాయా..?

తాడేపల్లిలోని క్యాంప్ ఆఫీస్ లో సీఎం జగన్, గృహ నిర్మాణ శాఖపై సమీక్ష నిర్వహించారు. టిడ్కో ఇళ్ల మీద విష ప్రచారం జరుగుతోందని, దాన్ని ఎప్పటికప్పుడు తిప్పికొట్టాలని అధికారులకు సూచించారు.

టిడ్కో ఇళ్లు జగన్ కి తలనొప్పిగా మారాయా..?
X

టిడ్కో ఇళ్లు ఎవరి హయాంలో నిర్మించారు...? టీడీపీ హయాంలో అని అందరికీ తెలుసు. మరి వైసీపీ అధికారంలోకి వచ్చి నాలుగేళ్లవుతున్నా ఇంకా పూర్తి స్థాయిలో లబ్ధిదారులకు అవి ఎందుకు అందుబాటులోకి రాలేదు..? సమాధానం ప్రభుత్వం దగ్గర లేదు. మౌలిక సదుపాయాలు కల్పించి లబ్ధిదారులకు అందిస్తామని చెబుతున్నారే కానీ, చిత్తశుద్ధితో వాటిపై వైసీపీ ప్రభుత్వం దృష్టిపెట్టలేదనే విమర్శ ఉంది.


దీనికి కారణం ఒకటే. టిడ్కో ఇళ్లు పూర్తి చేసి ఇస్తే పేరు టీడీపీకి వెళ్తుంది. అదే సమయంలో జగనన్న కాలనీల పేరుతో కొత్తగా స్థలం ఇచ్చి, ఇల్లు కట్టించి ఇస్తే ఆ పేరు జగన్ కి వస్తుంది. ఇదే లాజిక్ తో ముందు జగనన్న కాలనీలపై దృష్టిపెట్టారు, టిడ్కో ఇళ్లను పక్కనపెట్టారు.

ఇటీవల చంద్రబాబు నెల్లూరు టిడ్కో ఇళ్ల దగ్గర సెల్ఫీ దిగి జగన్ కి ఛాలెంజ్ విసిరేసరికి మళ్లీ ఈ వ్యవహారం తెరపైకి వచ్చింది. టీడీపీ హయాంలో దాదాపుగా నిర్మాణం పూర్తైన ఇళ్లు, ఇప్పటి వరకూ లబ్ధిదారులకు ఎందుకు అందించలేదనే చర్చ మొదలైంది. ఆ పనేదో టీడీపీయే చేసి ఉండొచ్చు కదా అని వైసీపీనుంచి ప్రతివిమర్శలు వస్తున్నా.. జగన్ వాటితో సంతృప్తి చెందలేదు. విపక్షాల విమర్శలకు ఘాటుగా బదులివ్వాలని అంటున్నారాయన.

తాడేపల్లిలోని క్యాంప్ ఆఫీస్ లో సీఎం జగన్, గృహ నిర్మాణ శాఖపై సమీక్ష నిర్వహించారు. టిడ్కో ఇళ్ల మీద విష ప్రచారం జరుగుతోందని, దాన్ని ఎప్పటికప్పుడు తిప్పికొట్టాలని అధికారులకు సూచించారు. టిడ్కో ఇళ్ల నిర్మాణాన్ని టీడీపీ పూర్తిగా పక్కన పెట్టిందని, ఒక్క లబ్ధిదారుడికి కూడా ఇల్లు ఇవ్వలేకపోయిందని చెప్పారు జగన్. వైసీపీ హయాంలో టిడ్కో ఇళ్ళను మంచి మౌలిక సదుపాయాలతో లబ్ధిదారులకు అప్పగిస్తున్నామన్నారు. టిడ్కో ఇళ్ల రూపంలో లబ్ధిదారులకు రూ.21 వేల కోట్ల విలువైన మేలు చేకూర్చామన్నారు. ఈ వాస్తవాలను ప్రజల ముందు ఉంచాలని అధికారులకు స్పష్టం చేశారు.

టిడ్కో ఇళ్లతోపాటు జగనన్న కాలనీల్లో జరుగుతున్న అభివృద్ధిని ప్రజల ముందుకు చేర్చాలన్నారు జగన్. 2022–23 ఆర్థిక సంవత్సరంలో రోజుకు రూ.28 కోట్లు చొప్పున.. ఏపీలో గృహనిర్మాణం కోసం తమ ప్రభుత్వం రూ.10,203 కోట్లు ఖర్చు చేసినట్టు చెప్పారు జగన్. 2023–24 ఆర్థిక సంవత్సరంలో రూ.15,810 కోట్లు ఖర్చు చేయాలని లక్ష్యం పెట్టుకున్నట్టు తెలిపారు. ఈ వివరాలన్నీ జనంలోకి వెళ్లాలని, ఏ ప్రభుత్వం ఎంత ఖర్చు చేసింది, ఎంతమందికి ఇళ్లు అందజేసింది అనే వివరాలు ప్రజలకు తెలియజేయాలని సూచించారు.

First Published:  13 April 2023 4:15 PM GMT
Next Story