Telugu Global
Andhra Pradesh

21న ఏపీ బీఆర్ఎస్ ఆఫీస్‌ను ప్రారంభించనున్న తోట చంద్రశేఖర్

ఏపీ బీఆర్ఎస్ కార్యాలయం ప్రారంభం సందర్భంగా నాయకులు, కార్యకర్తలు, అభిమానులు భారీ ఎత్తున తరలివచ్చి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని తోట చంద్రశేఖర్ కోరారు.

21న ఏపీ బీఆర్ఎస్ ఆఫీస్‌ను ప్రారంభించనున్న తోట చంద్రశేఖర్
X

భారత్ రాష్ట్ర సమితి (బీఆర్ఎస్)ని జాతీయ స్థాయిలో విస్తరించేందుకు సీఎం కేసీఆర్ ఇప్పటికే ప్రత్యేక దృష్టి సారించారు. మహారాష్ట్రలో బలోపేతం కోసం రెండు భారీ సభలు విజయవంతంగా నిర్వహించారు. అక్కడ కొత్తగా చేరిన బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తల కోసం నాందేడ్‌లో శిక్షణా తరగతులు కూడా ఏర్పాటు చేస్తున్నారు. అంతే కాకుండా మహారాష్ట్రలో శాశ్వత పార్టీ కార్యాలయం కూడా ఏర్పాటు చేస్తామని సీఎ కేసీఆర్ హామీ ఇచ్చారు. మరో వైపు ఏపీలో కూడా బీఆర్ఎస్ పార్టీ విస్తరణకు ప్రణాళిక సిద్ధం చేశారు.

ఏపీలోని ప్రధాన సమస్యలపై బీఆర్ఎస్ దృష్టి పెట్టింది. ఇప్పటికే పార్టీ ఏపీ అధ్యక్షుడు తోట చంద్రశేఖర్ రాష్ట్రమంతా విస్తృతంగా పర్యటిస్తూ పార్టీ బలోపేతానికి కృషి చేస్తున్నారు. పలు పార్టీలు, సంఘాలకు చెందిన నాయకులను బీఆర్ఎస్‌లో చేర్చుకుంటున్నారు. ఈ క్రమంలో రాష్ట్ర ప్రధాన కార్యాలయం ఏర్పాటుకు చర్యలు చేపట్టారు. గుంటూరులోని ఆటోనగర్‌లో ఏపీ ప్రధాన కార్యాలయం కోసం భవంతి సిద్ధమైంది. ఏన్ఎన్ఆర్ కన్వెన్షన్ హాల్ వెనుక కొత్త ఐదంస్తుల భవనాన్ని పార్టీ కోసం నిర్మించారు. ఈ నూతన కార్యాలయాన్ని ఈ నెల 21 (ఆదివారం) ఉదయం 11.35 నిమిషాలకు పార్టీ అధ్యక్షుడు తోట చంద్రశేఖర్ ప్రారంభించనున్నారు.

మొదటి అంతస్థులో కార్యకర్తల సమావేశ మందిరాన్ని ఏర్పాటు చేశారు. రెండు, మూడు అంతస్థుల్లో పార్టీ పరిపాలనా విభాగాలను సిద్ధం చేశారు. ఐదో అంతస్థులో రాష్ట్ర పార్టీ అధ్యక్షుడి కార్యాలయం ఏర్పాటు చేశారు. కాగా, అధ్యక్షుడి కార్యాలయాన్ని మూడు విభాగాలుగా విభజించారు. అతిథులు కూర్చునేందుకు పెద్ద హాలు, ముఖ్యనేతలతో సమావేశమయ్యేందుకు మరో హాలు.. అధ్యక్షుడి కార్యాలయం ఏర్పాటు చేశారు. వచ్చే వారం నుంచి పార్టీ రాష్ట్ర కార్యకలాపాలు అన్నీ ఇక్కడి నుంచే జరుగుతాయని పార్టీ వర్గాలు చెప్పాయి.

ఏపీ బీఆర్ఎస్ కార్యాలయం ప్రారంభం సందర్భంగా నాయకులు, కార్యకర్తలు, అభిమానులు భారీ ఎత్తున తరలివచ్చి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని తోట చంద్రశేఖర్ కోరారు. రాష్ట్రంలో పార్టీ బలోపేతం కోసమే ఈ కార్యాలయాన్ని ఏర్పాటు చేసినట్లు ఆయన పేర్కొన్నారు. ఏపీలో పార్టీకి ప్రజలు బ్రహ్మరథం పడతారని ఆయన ధీమా వ్యక్తం చేశారు.

First Published:  19 May 2023 1:55 AM GMT
Next Story