Telugu Global
Andhra Pradesh

ఈ పీఠాధిపతులకు కోపమొచ్చింది... రాజకీయ పార్టీ పెడతారట‌

తిరుమలకు వెళ్ళిన ఓ 30 మంది పీఠాధిపతులకు మహాద్వారం నుండి దర్శనం లభించకపోవడంతో కోపగించుకున్నవాళ్ళంతా ఒక రాజకీయ పార్టీని పెట్టాలని నిర్ణయించుకున్నారు. టీటీడీలో జరుగుతున్న అవినీతి, అక్రమాలను వెల్లడించడానికి త్వరలోనే తిరుపతిలో బహిరంగసభను పెడతామని కూడా వారు హెచ్చరించారు.

ఈ పీఠాధిపతులకు కోపమొచ్చింది... రాజకీయ పార్టీ పెడతారట‌
X

ఎవరికైనా కోపమొస్తే ఏం చేస్తారు? వ్యక్తుల మీద కోపమొస్తే తిడతారు...ఇంకా కోపం ఆగక పోతే కొడతారు. అదే ప్రభుత్వ వ్యవస్థల మీద కోపమొస్తే ? పై అధికారులకు పిర్యాదు చేస్తారు...ధర్నాలు చేస్తారు...ఊరేగింపులు తీస్తారు...ఆందోళనలు చేస్తారు..... ఇంతే కదా...కానీ ఈ పీఠాధిపతులు మాత్రం రాజకీయ పార్టీ పెడతారట.

ఓ 30 మంది పీఠాధిపతులు శ్రీవేంకటేశ్వరస్వామి దర్శనార్థం తిరుమలకు వచ్చారు. మహాద్వారం నుంచి తమను దర్శనానికి పంపమని వారు కోరగా... తమకు ఎలాంటి సమాచారం లేదని అక్కడున్న భద్రతా సిబ్బంది వారిని ఆపేశారు. దాంతో ఆ పీఠాధిపతులకు కోపం నషాళానికంటింది. తమనే అడ్డుకుంటారా అంటూ ఊగిపోయారు. తాము వస్తున్నట్టు ముందుగా లేఖ రాసినా ఇలా చేస్తారా? అంటూ వారు నిరసన వ్యక్తం చేశారు.

ఆ తర్వాత వారంతా తిన్నగా శ్రీనివాస మంగాపురం చేరుకొని మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. తిరుమలను వ్యాపార కేంద్రంగా మార్చారని విమర్శించారు. తిరుమలలో కేవలం రాజకీయ నాయకులకు, ధనవంతులకు మాత్రమే శ్రీవారిని స్వేచ్ఛగా దర్శించుకునే అవకాశం కలుగుతోందని , సామాన్యులు చాలా ఇబ్బందులు పడుతున్నారని విజయవాడకు చెందిన శ్రీయోగిపీఠం అధిపతి శ్రీయోగి అతిథేశ్వరానంద పర్వతస్వామి మండి పడ్డారు.

ఇక తాము ఇలా చూస్తూ ఊరుకోలేమని, దేశంలోని 900 మంది పీఠాధిపతుల ఆశీర్వాదంతో త్వరలోనే ఏపీలో కొత్త పార్టీని స్థాపిస్తామని ప్రకటించారు. అవసరమైతే అఖిల భారత హిందూ మహాసభ ద్వారా తమ భక్తులను రాజకీయాల్లోకి దింపుతామని. టీటీడీలో జరుగుతున్న అవినీతి, అక్రమాలను వెల్లడించడానికి త్వరలోనే తిరుపతిలో బహిరంగసభను పెడతామని పర్వతస్వామి చెప్పారు.

అయితే కొత్త పార్టీ ఏర్పాటు చేయాలా లేక హిందూ మహాసభ ఏపీ యూనిట్ ను ఏర్పాటు చేయాలా అనే విషయంపై వారిలో వారికి ఏకాభిప్రాయం వచ్చినట్టు లేదు. అందుకే రెండు మాటలు చెప్పారు.

ఇదంతా చదివి తిరుమలలో మహాద్వార దర్శనం కావాలంటే రాజకీయ పార్టీ పెట్టాలా ? అనే అమాయకపు ప్రశ్నలు వేయకండి.

First Published:  24 Nov 2022 5:51 AM GMT
Next Story