Telugu Global
Andhra Pradesh

ఉప ఎన్నికలు వస్తాయా? ఎలాగ‌?

మెయిన్ స్ట్రీమ్ మీడియా నుండి కొన్ని చానళ్ళు, కొన్ని వెబ్‌సైట్లు, సోషల్ మీడియా కూడా ఉప ఎన్నికలు తప్పవన్నట్లుగానే వార్తలు, కథనాలు ఇస్తున్నాయి. ఉప ఎన్నికలు దేనికంటే ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైసీపీ నుండి టీడీపీ అభ్యర్థి గెలుపున‌కు నలుగురు ఎమ్మెల్యేలు క్రాస్ ఓటింగ్ చేసినందుకట.

ఉప ఎన్నికలు వస్తాయా? ఎలాగ‌?
X

గడచిన రెండు రోజుల నుండి ఏపీలో ఇదే వార్త విపరీతంగా చర్చనీయాంశమవుతోంది. మెయిన్ స్ట్రీమ్ మీడియా నుండి కొన్ని చానళ్ళు, కొన్ని వెబ్‌సైట్లు, సోషల్ మీడియా కూడా ఉప ఎన్నికలు తప్పవన్నట్లుగానే వార్తలు, కథనాలు ఇస్తున్నాయి. ఉప ఎన్నికలు దేనికంటే ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైసీపీ నుండి టీడీపీ అభ్యర్థి గెలుపున‌కు నలుగురు ఎమ్మెల్యేలు క్రాస్ ఓటింగ్ చేసినందుకట. ఈ నలుగురుపైన వైసీపీ తొందరలోనే అనర్హత వేటు వేయించటం ఖాయమని మీడియా ఒకటే ఊదరగొట్టేస్తోంది.

అసలు క్రాస్ ఓటింగ్ చేసిన వాళ్ళపై వేటు పడే అవకాశమే లేదు. ఎందుకంటే ఎమ్మెల్సీ ఎన్నికల్లో విప్ జారీచేసే అవకాశం లేదు. విప్ అన్న ప్రస్తావనే లేదు కాబట్టి ఎమ్మెల్యేలు తమిష్టం వచ్చిన వాళ్ళకు ఓటు వేసే స్వేచ్ఛ ఉంటుంది. పార్టీ లైన్‌కు కట్టుబడి ఓట్లేయటం నైతికం మాత్రమే. లైనును దాటి తమిష్టం వచ్చినట్లు ఓట్లేస్తామని అంటే ఎవరూ చేసేదేమీలేదు. ఇప్పుడు వైసీపీలో జరిగిందిదే. పార్టీ లైన్‌ను దాటిన ఎమ్మెల్యేలు ఆనం రామనారాయణరెడ్డి, కోటంరెడ్డి శ్రీధరరెడ్డి, మేకపాటి చంద్రశేఖరరెడ్డి, ఉండవల్లి శ్రీదేవిపైన జగన్ ఎలాంటి యాక్షన్ తీసుకోలేరు.

ఎమ్మెల్యే పదవులకు వాళ్ళని దూరం చేయలేరు కాబట్టే పార్టీపరంగా వాళ్ళని సస్పెండ్ చేసింది. నిజానికి పార్టీ నుండి సస్పెండ్ చేసినా చేయకపోయినా ఒకటే. అనర్హత వేటు గురించి స్పీకర్‌తో జగన్ మాట్లాడుతున్నారని తొందరలోనే అనర్హత వేటు పడటం ఖాయమని వార్తలు ఎలా ఇస్తున్నారో అర్థం కావటంలేదు. వాళ్ళంతట వాళ్ళుగా ఎమ్మెల్యే పదవులకు రాజీనామాలు చేస్తే కానీ ఆ సీట్లు ఖాళీకావు.

మెయిన్ మీడియా, చాలా వెబ్‌సైట్లు, టీవీల్లో కూడా విప్‌కు వ్యతిరేకంగా ఓట్లేసినట్లు చెప్పేస్తున్నాయి. టీడీపీ విప్ జారీపేరుతో ఓవర్ యాక్షన్ చేసిందని అందరికీ తెలుసు. అసలు విప్‌ జారీచేసే అవకాశమే లేనప్పుడు ఇక విప్ జారీచేసినట్లు టీడీపీ ఎలా చెప్పుకుందో అర్థంకావటంలేదు. అంటే వార్తలు, కథనాలు ఇచ్చేముందు మీడియా కనీస విషయాన్ని తెలుసుకోవటంలేదని అర్థ‌మవుతోంది. లేదంటే గుడ్డిగా టీడీపీకి మద్దతుగా వార్తలు, కథనాలు వండి వార్చేస్తున్నట్లు అనుకోవాలి. ఇప్పుడు ఎమ్మెల్యేల‌పై అనర్హత వేటు, తొందరలోనే ఉప ఎన్నికలనే గోల కూడా ఇలాగే జరుగుతున్నట్లు అర్థ‌మవుతోంది.

First Published:  26 March 2023 7:42 AM GMT
Next Story