Telugu Global
Andhra Pradesh

బీజేపీ కరుణా కటాక్షాల కోసం యూ టర్న్ తీసుకున్న చ‍ంద్ర‌బాబు

ఏపీలో బీజేపీ తో పొత్తు కోసం తహతహలాడుతున్న చంద్రబాబు తన ఈవీఎం వ్యతిరేక నినాదాన్ని వదిలేశారు. అంతే కాదు దేశంలోని ప్రతిపక్షాలన్నీ వ్యతిరేకిస్తున్న రిమోట్ ఓటింగ్ విధానానికి మద్దతు పలికారు.

బీజేపీ కరుణా కటాక్షాల కోసం యూ టర్న్ తీసుకున్న చ‍ంద్ర‌బాబు
X

ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి చ‍ంద్ర‌బాబు నాయుడు ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాలకు వ్యతిరేకంగా చాలా కాలం...మొన్నటి దాకా మాట్లాడారు. వాటిని తీసేసి మళ్లీ బ్యాలెట్ విధానాన్ని అవలంబించాలని డిమాండ్ చేశారు. ఇప్పుడు అదే చంద్రబాబు నాయుడు పూర్తిగా యూటర్న్ తీసుకున్నారు.

ఏపీలో బీజేపీ తో పొత్తు కోసం తహతహలాడుతున్న చంద్రబాబు తన ఈవీఎం వ్యతిరేక నినాదాన్ని వదిలేశారు. అంతే కాదు దేశంలోని ప్రతిపక్షాలన్నీ వ్యతిరేకిస్తున్న రిమోట్ ఓటింగ్ విధానానికి మద్దతు పలికారు.

ఎన్నికల్లో రిమోట్ ఓటింగ్ విధానాన్ని ప్రవేశపెట్టాలని ఆలోచిస్తున్న భారత ఎన్నికల సంఘం వివిధ పార్టీల అభిప్రాయాలు తీసుకునేందుకు నిన్న ఢిల్లీలోని కాన్ స్టిట్యూషనల్ క్లబ్ లో అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేసింది. ఇందులో పాల్గొన్న మెజార్టీ పార్టీలు ఈ విధానాన్ని వ్యతిరేకించాయి. వాటిలో కాంగ్రెస్, జనతాదళ్ (యునైటెడ్), శివసేన, కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా, కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా (మార్క్సిస్ట్), నేషనల్ కాన్ఫరెన్స్, పీపుల్స్ డెమోక్రటిక్ పార్టీ, జార్ఖండ్ ముక్తి మోర్చా, ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్, బీఆరెస్, రివల్యూషనరీ సోషలిస్ట్ పార్టీలున్నాయి.

ఇక తాను ఓడిపోయినప్పటి నుంచి ఈ వీఎం లను వ్యతిరేకిస్తున్న తెలుగు దేశం పార్టీ మాత్రం రిమోట్ ఓటింగ్ విధానాన్ని సమర్దించింది. ఈసీ సమావేశానికి హాజరైన టీడీపీ శాసనసభ్యుడు పయ్యావుల కేశవ్, ఎన్‌ఆర్‌ఐ వింగ్ సభ్యుడు వేమూరి రవికుమార్ మాట్లాడుతూ తమ పార్టీ రిమోట్ ఈవీఎంలకు మద్దతిస్తుందని చెప్పారు. ఓటు హక్కు ఉన్న ప్రాంతంలో కాకుండా దూర ప్రాంతాల్లో ఉండే వారి ఓటు హక్కును కాపాడేందుకు ఇది దోహదపడుతుందని వారు చెప్పారు. అయితే ఈ అభిప్రాయ మార్పు బీజేపీకి దగ్గర కావడం కోసమే అనే విమర్శలు వినవస్తున్నాయి.

కాగా ఇప్పటి వరకు, ఓటరు తాను ఎక్కడున్నా ఓటు వేయడానికి తాను ఓటరుగా నమోదైన ప్లేస్ కు వెళ్ళాల్సి వచ్చేది. అయితే రిమోట్ ఓటింగ్ విధానం వల్ల ఓటర్లు తమ ఓటు హక్కును తామున్న దగ్గరి నుంచే వినియోగించుకోవచ్చు. సొంత జిల్లాకు వెళ్లాల్సిన అవసరం లేదు.

అయితే ఇలా చేయడం వల్ల ఓట్లు హ్యాకింగ్ కు గురయ్యే అవకాశం ఉందని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. బ్యాంకు అకౌంట్లనే హ్యాక్ చేస్తున్న వాళ్ళు ఓటును హ్యాక్ చేయడం పెద్ద కష్టం కాదని ప్రతిపక్షాల అభిప్రాయం.

First Published:  17 Jan 2023 5:54 AM GMT
Next Story