Telugu Global
Andhra Pradesh

గజనీలా అయిపోయారా?

ఎన్డీయే సమావేశంలో పాల్గొనేందుకు ఢిల్లీకి వెళ్ళినప్పుడు పవన్ కల్యాణ్ మీడియాతో మాట్లాడుతూ.. తనకు ముఖ్యమంత్రి పదవి మీద ఆశలు లేవన్నారు. రాబోయే ఎన్నికల్లో టీడీపీ, బీజేపీ, జనసేన కలిసే ఎన్నిక‌ల్లో పాల్గొంటాయని చెప్పారు.

గజనీలా అయిపోయారా?
X

జనసేన అధినేత పవన్ కల్యాణ్ పరిస్థితి రోజురోజుకు అయోమయంగా తయారవుతోంది. ఏ రోజు ఏం మాట్లాడుతారో ఆయ‌న‌కే తెలియ‌డంలేదు. ఎన్డీయే సమావేశంలో పాల్గొనేందుకు ఢిల్లీకి వెళ్ళినప్పుడు మీడియాతో మాట్లాడుతూ.. తనకు ముఖ్యమంత్రి పదవి మీద ఆశలు లేవన్నారు. రాబోయే ఎన్నికల్లో టీడీపీ, బీజేపీ, జనసేన కలిసే ఎన్నిక‌ల్లో పాల్గొంటాయని చెప్పారు. ప్రభుత్వం మీద జనాల్లో వ్యతిరేకత పెరిగిపోతోందనేందుకు వారాహి యాత్రలకు హాజరవుతున్న జనాలే నిదర్శనమన్నారు. వచ్చే ఎన్నికల్లో వైసీపీ పనైపోయినట్లే అని చెప్పారు.

సీన్ కట్ చేస్తే వారాహి యాత్రలో టీడీపీతో పొత్తు గురించి ఒక్కటంటే ఒక్కమాట కూడా మాట్లాడలేదు. పొత్తుల గురించి ఇప్పుడు మాట్లాడాల్సిన అవసరమే లేదన్నారు. యాత్రలో ఎక్కడ మాట్లాడినా జనసేనకు ఓట్లేయండని, తనను ముఖ్యమంత్రిని చేయమని పదేపదే అడిగిన విషయం అందరు చూసిందే. యాత్ర మధ్యలో ఎల్లో మీడియాకు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్య్వూలో మాట్లాడుతూ.. తాను ముఖ్యమంత్రిని ఎలా అవుతారని ఎదురు ప్రశ్నించారు.

అభిమానులు తనను ముఖ్యమంత్రిగా చూడాలని సీఎం సీఎం అని అరుస్తుంటే వాళ్ళలో హుషారు పెంచటానికి తాను కూడా ముఖ్యమంత్రిని చేయమని అడిగానంతే అన్నారు. ఒక సభలో మాట్లాడుతూ.. తన సభలకు వచ్చిన జనాలంతా తనకు ఓట్లేసి గెలిపిస్తారన్న నమ్మకం లేదన్నారు. మళ్ళీ ఇంకో సమావేశంలో అసెంబ్లీలో అడుగుపెట్టకుండా తనను ఎవరు ఆపుతారో చూస్తానంటు చాలెంజ్ చేశారు. కాకినాడ ఎమ్మెల్యే ద్వారపురెడ్డి చంద్రశేఖరరెడ్డిని అమ్మనాబూతులు తిట్టారు. మొకాళ్ళ మీద నిలబెడతానన్నారు. పరిగెత్తించి పరిగెత్తించి కొడతానన్నారు. తాటతీస్తా, తిత్తి తీస్తానని వార్నింగ్‌లు లిచ్చారు. వచ్చే ఎన్నికల్లో ద్వారంపూడి ఎలా గెలుస్తారో చూస్తానని చాలెంజ్ చేశారు.

ఆ తర్వాత మీటింగ్‌లో ద్వారంపూడి అంటే తనకు ఎలాంటి వ్యక్తిగత ద్వేషంలేదన్నారు. ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం అవినీతిపరుడని నోటికొచ్చింది మాట్లాడారు. దానికి కౌంటర్‌గా ముద్రగడ రెండు లేఖలు రాస్తే సమాధానం ఇవ్వలేదు. ఇదే సమయంలో కాపు నేతలు ముద్రగడకు మద్దతుగా దిగటంతో వెంటనే మాట మార్చేశారు. తర్వాత మీటింగులో ముద్రగడను ఉద్దేశించి ‘ఆయన పెద్దవారు మనల్ని ఏమన్నా పడాలంతే కానీ ఎదురుతిరిగి మాట్లాడకూడదు’ అన్నారు. ముద్రగడను ఏమన్నా అంటే మొదటికే మోసం వస్తుందని భయపడినట్లున్నారు. అందుకనే మాట‌ మార్చేశారు. పవన్ మాటలు చూస్తుంటే సినిమాలో గజనిలాగ అయిపోయారా అనే అనుమానాలు పెరిగిపోతున్నాయి.

First Published:  19 July 2023 6:15 AM GMT
Next Story