Telugu Global
Andhra Pradesh

ఎమ్మెల్యేల్లో పెరిగిపోతున్న ‘ఫోన్ కాల్’ టెన్షన్

సరే ఫోన్ వచ్చినాక కలవకతప్పదు కదా. అందుకనే వెంటనే బయలుదేరి ముగ్గురు ఎమ్మెల్యేలు తాడేపల్లికి చేరుకుని మిథున్‌తో భేటీ అయ్యారు.

ఎమ్మెల్యేల్లో పెరిగిపోతున్న ‘ఫోన్ కాల్’ టెన్షన్
X

వైసీపీ ఎమ్మెల్యేల్లో టెన్షన్ పెరిగిపోతోంది. అధిష్టానం నుంచి ఫోన్ వచ్చిందంటే చాలు ఎమ్మెల్యేల బీపీ పెరిగిపోతోందట. శనివారం ముగ్గురు ఎమ్మెల్యేల‌కు ఫోన్లు రావటం, వాళ్ళు బయలుదేరి అర్జంట్‌గా తమ నియోజకవర్గాల నుంచి తాడేపల్లికి చేరుకున్నారు. తమ ఇన్చార్జి, రాజంపేట ఎంపీ మిథున్ రెడ్డితో చాలాసేపు భేటీ అయ్యారు. తర్వాత తాడేపల్లిలో ఎవరితోను మాట్లాడకుండా తమ నియోజకవర్గాలకు వెళ్ళిపోయి మద్దతుదారులు, కార్యకర్తలతో భేటీ అయ్యారు. మిథున్ తో భేటీ రిజల్టు ఏమిటంటే.. ముగ్గురికి రాబోయే ఎన్నికల్లో టికెట్లిచ్చేది లేదని స్పష్టంచేయటమేనని పార్టీవర్గాల టాక్.

ఇంతకీ విషయం ఏమిటంటే.. శనివారం ఉదయం పిఠాపురం ఎమ్మెల్యే పెండెం దొరబాబు, ప్రత్తిపాడు ఎమ్మెల్యే పర్వత పూర్ణచంద్రరావు, జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల చంటిబాబుకు అధిష్టానం నుంచి ఫోన్ వచ్చింది. ఫోన్ సారంశం ఏమిటంటే.. వెంటనే బయలుదేరి తాడేపల్లికి వచ్చి ఇన్చార్జి మిథున్‌తో మాట్లాడాలని. ఇంతకుముందు ఫోన్లు అందుకున్న ఎమ్మెల్యేల‌కు ఎదురైన అనుభవాలు బాగా ప్రచారంలో ఉన్నాయి. అందుకనే అధిష్టానం నుంచి వచ్చి కలవమని ఫోన్ రావటం ఆలస్యం ఎమ్మెల్యేల్లో టెన్షన్ పెరిగిపోయింది.

సరే ఫోన్ వచ్చినాక కలవకతప్పదు కదా. అందుకనే వెంటనే బయలుదేరి ముగ్గురు ఎమ్మెల్యేలు తాడేపల్లికి చేరుకుని మిథున్‌తో భేటీ అయ్యారు. ఫైనల్‌గా తేల్చింది ఏమిటంటే.. ముగ్గురికి రాబోయే ఎన్నికల్లో టికెట్లిచ్చేదిలేదని. పిఠాపురం ఎమ్మెల్యే దొరబాబుకు మాత్రం కాకినాడ ఎంపీగా పోటీచేయమని ప్రత్యామ్నాయాన్ని పార్టీ ఆఫర్ చేసిందని సమాచారం. అయితే అందుకు దొరబాబు అంగీకరించలేదని తెలిసింది.

మిగిలిన ఇద్దరికి ప్రత్యామ్నాయం కూడా చూపలేదట. ఇదే సందర్భంలో కొత్తగా పోటీచేయబోయే అభ్యర్థుల గెలుపున‌కు ముగ్గురు ఎమ్మెల్యేలు గట్టిగా పనిచేయాలని కూడా మిథున్ విజ్ఞప్తి చేశారట. తాడేపల్లిలో ఏమీ మాట్లాడని వీళ్ళు తమ నియోజకవర్గాలకు చేరుకుని మద్దతుదారులతో సమావేశాలు పెట్టుకున్నారు. మొత్తానికి అధిష్టానం నుంచి ఫోన్ వచ్చిందంటేనే ఎమ్మెల్యేల గుండెల్లో రైళ్ళు పరిగెడుతున్నాయి. తమకు ఎప్పుడు ఫోన్ వస్తుందో తెలీక టెన్షన్ పెంచేసుకుంటున్నారు. నాలుగున్నరేళ్ళు ఎమ్మెల్యే హోదాను అనుభవించిన వాళ్ళకి రాబోయే ఎన్నికల్లో టికెట్ దక్కటంలేదంటే బాధగానే ఉంటుంది. కానీ, చేసేదేముంది అధిష్టానం నిర్ణయమే ఫైనల్ కదా.

First Published:  17 Dec 2023 5:00 AM GMT
Next Story