Telugu Global
Andhra Pradesh

బిడ్డకు మూడేళ్లొచ్చాయి.. తల్లిదండ్రులెవరో తెలియడంలేదు

విజయవాడలో జరిగిన సీపీఐ 24వ జాతీయ మహాసభల్లో అమరావతికి మద్దతుగా తీర్మానం ప్రవేశపెట్టారు. 29 రాష్ట్రాల ప్రతినిధులు ఏకగ్రీవంగా ఆమోదించారు.

బిడ్డకు మూడేళ్లొచ్చాయి.. తల్లిదండ్రులెవరో తెలియడంలేదు
X

ఏపీ రాజధాని వ్యవహారంపై సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ వ్యంగ్యాస్త్రాలు విసిరారు. బిడ్డకు మూడేళ్లొచ్చాయని, కానీ తల్లిదండ్రులెవరో తెలియని పరిస్థితి ఉందని చెప్పారు. వైసీపీ ప్రభుత్వం ఏపీకి రాజధాని లేకుండా చేసిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. మీ రాజధాని ఏదంటే చెప్పలేని స్థితిలో ఏపీ ప్రజలు ఉన్నారని అన్నారు. మూడు రాజధానులు అనేది కేవలం సర్కార్ ఉద్యమం అని అన్నారు. అధికార పార్టీ నాయకులు భూదోపిడీదారులు అని నారాయణ తీవ్ర విమర్శలు చేశారు. ఏపీలో అరాచక పాలన కొనసాగుతోందని, ప్రతిపక్ష పార్టీలను చూస్తే సీఎం జగన్‌ కు ఎందుకంత భయం అని ప్రశ్నించారు. మూడు రాజధానుల పేరుతో ప్రాంతాల మధ్య చిచ్చుపెడుతున్నారని మండిపడ్డారు. వైసీపీ విశాఖ గర్జన పూర్తిగా విఫలమైందని, అందుకే ఆ పార్టీ నేతలంతా ఫ్రస్ట్రేషన్‌ తో మాట్లాడుతున్నారని సెటైర్లు వేశారు నారాయణ.

అమరావతికి మద్దతుగా తీర్మానం..

విజయవాడలో జరిగిన సీపీఐ 24వ జాతీయ మహాసభల్లో అమరావతికి మద్దతుగా తీర్మానం ప్రవేశపెట్టారు. ఏపీకి అమరావతిని రాజధానిగా కొనసాగించాలంటూ సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి ముప్పాళ్ల నాగేశ్వరరావు తీర్మానాన్ని ప్రవేశపెట్టగా, 29 రాష్ట్రాల ప్రతినిధులు ఏకగ్రీవంగా ఆమోదించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సానుకూలంగా స్పందించి సత్వరమే అమరావతి నిర్మాణం కొనసాగించాలని ఈ తీర్మానంలో పేర్కొన్నారు.

మోదీకి వ్యతిరేకంగా..

ప్రధాని మోదీ ఆర్థిక విధానాలకు వ్యతిరేకంగా 24వ జాతీయ మహాసభల్లో తీర్మానం ప్రవేశ పెట్టారు. మోదీ అసమర్థ విధానాలతోనే దేశ ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నమైందని అన్నారు సీపీఐ నేతలు. దేశం ప్రమాదకర స్థితిలోకి వెళ్లిపోతోందని, తక్షణ నివారణ చర్యలు అవసరం అని చెప్పారు. 2024లో మోదీ గద్దె దిగకపోతే మరింత ప్రమాదకర పరిస్థితుల్లోకి దేశం వెళ్లిపోతుందని చెప్పారు. అందుకే మోదీకి వ్యతిరేకంగా తీర్మానం ప్రవేశ పెట్టామని, కేంద్రంలో రాబోయేది బీజేపీయేతర ప్రభుత్వమేనని చెప్పారు.

First Published:  16 Oct 2022 1:10 PM GMT
Next Story