Telugu Global
Andhra Pradesh

అప్పులపై బాగా నిరాశ చెందిన టీడీపీ

దుష్ట చతుష్టయం ఇంతకాలం చెబుతున్నవి దొంగ లెక్కలేనని తేలిపోయిందని వైసీపీ పత్రిక అభిప్రాయపడింది.

అప్పులపై బాగా నిరాశ చెందిన టీడీపీ
X

ఏపీలో టీడీపీతో పాటు బీజేపీలోని బాబు అనుకూల వ్యక్తులు ఏపీ అప్పుల గురించి చేస్తున్న ప్రచారంపై కేంద్ర ప్రభుత్వం నీళ్లు చల్లింది. ఏపీ మరో శ్రీలంక అవుతోందని రోజూ రోధిస్తున్న ప్రతిపక్షాలకు షాక్‌ ఇచ్చింది. రాష్ట్రాల అప్పుల వివరాలను కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్‌ వెల్లడించారు. అప్పుల్లో ఏపీ 8 స్థానంలో ఉంది. ఏపీ కంటే ముందు ఏడు రాష్ట్రాలున్నాయి. తమిళనాడు ఏకంగా 6.59 లక్షల కోట్ల అప్పుతో తొలిస్థానాన్ని ఆక్రమించింది.

ఆ తర్వాత ఉత్తరప్రదేశ్‌ 6.53 లక్షల కోట్లతో రెండో స్థానంలో, 6.08 లక్షల కోట్లతో మహారాష్ట్ర మూడో స్థానంలో ఉంది. బెంగాల్ అప్పు 5.62 లక్షల కోట్లు. నాలుగు లక్షల కోట్ల అప్పు దాటిన రాష్ట్రాలుగా రాజస్థాన్‌ (4.77 లక్షల కోట్లు), కర్నాటక (4.62 లక్షల కోట్లు), గుజరాత్‌ (4.02 లక్షల కోట్లు) వరుసగా 5,6,7 స్థానాల్లో ఉన్నాయి. ఎనిమిదవ స్థానంలో ఏపీ ఉంది. ఏపీ అప్పు 3.98 లక్షల కోట్లుగా కేంద్రం వెల్లడించింది.

తెలంగాణ 3.12 లక్షల కోట్లతో అప్పుతో 11 స్థానంలో ఉంది. కేరళ అప్పు 3.35 లక్షల కోట్లు. మధ్యప్రదేశ్ అప్పు 3.17 లక్షల కోట్లు. అయితే ఈ అప్పులన్నీ రాష్ట్రాలు బహిరంగ మార్కెట్‌లో తీసుకున్నవే. కార్పొరేషన్‌ ద్వారా తీసుకున్న అప్పులను కూడా రాష్ట్ర ప్రభుత్వ అప్పులుగానే పరిగణిస్తున్నామని కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్ చెప్పారు. అయితే కార్పొరేషన్ల ద్వారా తీసుకున్న రుణాలు ఎన్ని అనే దానిపై కేంద్రం వివరాలను వెల్లడించలేదు.

నిర్మలా సీతారామన్ సమాధానంపై వైసీపీ మీడియా హర్షం వ్యక్తం చేసింది. దుష్ట చతుష్టయం ఇంతకాలం చెబుతున్నవి దొంగ లెక్కలేనని తేలిపోయిందని వైసీపీ పత్రిక అభిప్రాయపడింది. అయితే ప్రతిపక్ష పత్రికలు మాత్రం కేంద్రం తీరును విమర్శిస్తూ కథనాలు రాశాయి. అప్పులతో మరో శ్రీలంక పరిస్థితి వస్తుందని హెచ్చరిస్తున్న కేంద్రం తీరు మాటలకే పరిమితమైందని.. చేతల్లో మాత్రం ఏమీ చేయడం లేదని ఒక పత్రిక విమర్శించింది.

అప్పులపై రాష్ట్రాలకు కేంద్రం చేస్తున్న హెచ్చరికలను డ్రామాగా అభివర్ణించింది. కార్పొరేషన్ల ద్వారా చేసిన అప్పుల వివరాలను తెలుసుకునే అవకాశం కేంద్రానికి ఉన్నా సరే.. ఆ వివరాలను చెప్పకుండా కేవలం బహిరంగ మార్కెట్‌లో రాష్ట్రాలు చేసిన అప్పుల గురించి మాత్రమే కేంద్రమంత్రి వివరించడం ఏమిటని ప్రతిపక్ష పత్రికలు ప్రశ్నిస్తున్నాయి. మొత్తం మీద అప్పులపై కేంద్ర చేసిన ప్రకటన ఏపీలో ప్రతిక్షాలను బాగానే నిరాశపరిచినట్టుగా ఉంది.

First Published:  26 July 2022 4:21 AM GMT
Next Story