Telugu Global
Andhra Pradesh

బ్యానర్ కి రూ.100 జరిమానా..? నిషేధం అమలయ్యేదెట్టా..?

ప్లాస్టిక్ ఫ్లెక్సీ కడితే ఒక్కోదానికి 100 రూపాయలు జరిమానా విధిస్తామని జీవోలో స్పష్టం చేసింది ఏపీ ప్రభుత్వం. అంటే ఇంతకు ముందు ఫ్లెక్సీకి వెయ్యి రూపాయలు ఖర్చయితే, ఇకపై జరిమానాతోపాటు 1100 ఖర్చవుతుందని జనం మెంటల్ గా ప్రిపేర్ అయిపోయే అవకాశముంది.

బ్యానర్ కి రూ.100 జరిమానా..? నిషేధం అమలయ్యేదెట్టా..?
X

ఏపీలో ప్లాస్టిక్ బ్యానర్లను నిషేధిస్తున్నట్టు ఘనంగా ప్రకటించి ప్రభుత్వం. నవంబర్-1 నుంచి ఈ నిషేధం అమలులోకి వస్తుందంటూ జీవో కూడా విడుదల చేశారు. అయితే జీవోలో ఇచ్చిన చిన్న వెసులుబాటు, ఈ నిషేధాన్ని ఉల్లంఘించేవారికి వరంగా మారే అవకాశముంది.

100 జరిమానా..

ప్లాస్టిక్ ఫ్లెక్సీ కడితే ఒక్కోదానికి 100 రూపాయలు జరిమానా విధిస్తామని జీవోలో స్పష్టం చేసింది రాష్ట్ర ప్రభుత్వం. అంటే, ఫ్లెక్సీ కడితే ఫైన్ తో సరిపెడతారన్న సంకేతాలు వచ్చేశాయి. పెద్దదైనా, చిన్నదైనా ఫ్లెక్సీకి 100 ఫైన్ వేస్తారు. అంటే ఇంతకు ముందు ఫ్లెక్సీకి వెయ్యి రూపాయలు ఖర్చయితే, ఇకపై జరిమానాతోపాటు 1100 ఖర్చవుతుందని జనం మెంటల్ గా ప్రిపేర్ అయిపోయే అవకాశముంది.

ఫ్లెక్సీ కడితే వెంటనే కట్టినవారిని, అది ప్రింట్ చేసిన వారిని అరెస్ట్ చెయ్యాలని చెప్పడంలేదు కానీ, ఇలా ఫ్లెక్సీకి వంద జరిమానా అంటే ఎవరు మాత్రం భయపడతారు, ఎందుకు వెనకాడతారు..? గుడ్డతో తయారు చేసే ఫ్లెక్సీ రేట్లు భారీగా ఉంటాయి. దీంతో ఇలా జరిమానాతో కలిపి ఫ్లెక్సీ కట్టుకోవడమే మంచిది అనే అభిప్రాయానికి వస్తున్నారు చాలామంది.

ప్లాస్టిక్ బ్యానర్ అంటే ఏంటి..?

ఇక్కడ ఇంకో విషయంలో కూడా అనుమానాలున్నాయి. ప్రస్తుతం తయారు చేస్తున్న బ్యానర్లు ప్లాస్టిక్ వి కావని, ఆ మెటీరియల్ వేరేనని, అది భూమిలో కలసిపోతుందని అంటున్నారు ఫ్లెక్సీ షాపుల యజమానులు. పునర్వినియోగానికి పనికిరాని ప్లాస్టిక్ పై నిషేధం విధించాలి కానీ, ఇలా బ్యానర్లపై నిషేధం విధించడమంటే తమ పొట్టకొట్టడమేనని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఏదైనా వస్తువు తయారీపై నిషేధం విధించకుండా, కేవలం వాడకంపై నిషేధం విధిస్తామంటే కుదరదు, అది సాధ్యం కాదు కూడా. ఏపీలో ప్లాస్టిక్ బ్యానర్ల నిషేధం కూడా ఇలా మారే ప్రమాదం ఉంది. ప్లాస్టిక్ క్యారీబ్యాగ్ లపై ఇప్పటికి కొన్ని వందల సార్లు నిషేధం విధించి ఉంటారు. కానీ ఎప్పటికప్పుడు జనం మరచిపోతున్నారు, నిబంధనలు పెట్టినవాళ్లు కూడా మరచిపోతున్నారు. మరి బ్యానర్ల నిషేధం ఎలా ఉంటుందో చూడాలి.

First Published:  22 Sep 2022 4:32 PM GMT
Next Story