Telugu Global
Andhra Pradesh

జీవీఎల్‌, సీఎం ర‌మేష్ ఏప్రిల్‌తో అవుట్‌.. రాజ్య‌స‌భ‌లో ఏపీ బీజేపీకి ప్రాతినిధ్యం శూన్య‌మేనా..?

గ‌తంలో జీవీఎల్‌ను యూపీ నుంచి రాజ్య‌స‌భ‌కు పంపిన‌ట్లే ఈసారి కూడా ఏపీ నుంచి ఎవ‌ర్నైనా ఉత్త‌రాదిలో త‌మ‌కు ప‌ట్టున్న రాష్ట్రాల నుంచి బీజేపీ రాజ్య‌స‌భ‌కు పంపుతుందా అనేది ఇప్పుడు ఆస‌క్తిక‌ర‌మైన అంశం.

జీవీఎల్‌, సీఎం ర‌మేష్ ఏప్రిల్‌తో అవుట్‌.. రాజ్య‌స‌భ‌లో ఏపీ బీజేపీకి ప్రాతినిధ్యం శూన్య‌మేనా..?
X

రాజ్య‌స‌భలో దాదాపు 55 మంది స‌భ్యుల ప‌ద‌వీకాలం వ‌చ్చే ఏడాది ఏప్రిల్‌తో ముగియ‌బోతోంది. మార్చి నెలాఖ‌రులోగానే ఆయా స్థానాల‌కు కొత్త అభ్య‌ర్థుల‌ను కూడా ఎన్నుకుంటారు. ఏపీలో మూడు స్థానాలు ఖాళీ కాబోతున్నాయి. ఇందులో వైసీపీ నుంచి వేమిరెడ్డి ప్ర‌భాక‌ర్‌రెడ్డి, టీడీపీ నుంచి క‌న‌క‌మేడ‌ల ర‌వీంద్ర‌కుమార్‌, బీజేపీ ఎంపీ సీఎం ర‌మేష్‌ల ప‌ద‌వీ కాలం కూడా ముగిసిపోతోంది. ఉత్త‌ర‌ప్ర‌దేశ్ నుంచి క‌మ‌ల‌ద‌ళం త‌ర‌ఫున ప్రాతినిధ్యం వ‌హిస్తున్న ఏపీ బీజేపీ నేత జీవీఎల్ న‌రసింహ‌రావు ప‌ద‌వీకాలం కూడా ఏప్రిల్‌తోనే పూర్తవుతుంది.

సంఖ్యాబ‌లం ప్ర‌కారం చూస్తే ఆశ‌లు లేన‌ట్లే

2014లో ఏపీలో అధికారంలోకి వ‌చ్చిన టీడీపీ త‌ర‌ఫున సీఎం ర‌మేష్ రాజ్య‌స‌భ‌కు ఎన్నిక‌య్యారు. ఆయ‌న త‌ర్వాత బీజేపీలో చేరారు. సెఫాల‌జిస్టుగా రాజ‌కీయాల్లోకి వ‌చ్చి, బీజేపీ అధికార ప్ర‌తినిధిగా ఆ పార్టీ పెద్ద‌ల మ‌న‌సు గెలిచిన జీవీఎల్ న‌ర‌సింహ‌రావు ఏపీలో అవ‌కాశం లేక‌పోయినా ఉత్త‌ర‌ప్ర‌దేశ్ నుంచి పెద్ద‌ల స‌భలో అడుగుపెట్టారు. ఇప్పుడు వీరిద్ద‌రి ప‌ద‌వీకాలం ముగిసిపోతోంది. ఏపీలో బీజేపీకి ఒక్క ఎమ్మెల్యే కూడా లేరు. కాబ‌ట్టి సంఖ్యాబ‌లం ప‌రంగా చూస్తే నామినేష‌న్ వేయ‌డానికి కూడా ధైర్యం చేయ‌లేని ప‌రిస్థితి.

పొరుగు రాష్ట్రాల నుంచి అవ‌కాశ‌మిస్తారా?

గ‌తంలో జీవీఎల్‌ను యూపీ నుంచి రాజ్య‌స‌భ‌కు పంపిన‌ట్లే ఈసారి కూడా ఏపీ నుంచి ఎవ‌ర్నైనా ఉత్త‌రాదిలో త‌మ‌కు ప‌ట్టున్న రాష్ట్రాల నుంచి బీజేపీ రాజ్య‌స‌భ‌కు పంపుతుందా అనేది ఇప్పుడు ఆస‌క్తిక‌ర‌మైన అంశం. ఒక‌వేళ అలా పంపాల‌నుకుంటే జీవీఎల్, సీఎం ర‌మేష్ కాకుండా ఇంకెవ‌ర‌యినా కొత్త ముఖం తెర‌పైకి వ‌చ్చే అవ‌కాశాలే ఎక్కువ‌. అలా అయితే ఆ వ‌రుస‌లో పురందేశ్వ‌రి ముందుంటార‌ని ఆ పార్టీ వ‌ర్గాల అంచ‌నా. మ‌రి ఏపీ అంటే నిజంగా బీజేపీకి ఇప్పుడు అంత ప్రేమ ఉందా అనేది ఆలోచించాల్సిన విష‌యం.

First Published:  27 Dec 2023 8:16 AM GMT
Next Story