Telugu Global
Andhra Pradesh

వర్మ వర్సెస్‌ టీడీపీ

కాపులను కించపరిచేలా ట్వీట్ చేసినా.. పిచ్చి పిచ్చి వ్యాఖ్యలు చేసినా తగిన మూల్యం చెల్లించుకుంటావంటూ రామ్ గోపాల్ వర్మను ఉద్దేశించి విజయవాడలో కాపు సంఘాల నేతలు ప్రెస్ మీట్ పెట్టి మరీ హెచ్చరించారు.

వర్మ వర్సెస్‌ టీడీపీ
X

దర్శకుడు రాంగోపాల్ వర్మ మరోసారి టీడీపీ, జనసేన పార్టీలకు చికాకు కలిగిస్తున్నారు. చంద్రబాబు నాయుడిని పవన్ కల్యాణ్ కలిసిన నేపథ్యంలో వర్మ చేసిన ఒక ట్వీట్ ఆ రెండు పార్టీలతో పాటు కాపు సంఘాలకు ఆగ్రహం తెప్పించింది.

చంద్రబాబును పవన్ కల్యాణ్ కలవడంపై రాంగోపాల్ వర్మ ట్వీట్ చేస్తూ '' కేవలం డబ్బు కోసం తన సొంత కాపులను కమ్మోళ్లకు అమ్మేస్తాడని ఊహించలేదు. RIP కాపులు .. కంగ్రాట్యులేషన్స్ కమ్మోళ్లు'' అంటూ ఒక ట్వీట్ చేశారు. ఈ ట్వీట్ బాగా వైరల్ అయింది. దీంతో కాపు సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి.

కాపులను కించపరిచేలా ట్వీట్ చేసినా.. పిచ్చి పిచ్చి వ్యాఖ్యలు చేసినా తగిన మూల్యం చెల్లించుకుంటావంటూ రామ్ గోపాల్ వర్మను ఉద్దేశించి విజయవాడలో కాపు సంఘాల నేతలు ప్రెస్ మీట్ పెట్టి మరీ హెచ్చరించారు. గతంలో వంగవీటి రంగాపైనా ఇదే తరహాలో వర్మ సైకో వ్యాఖ్యలు చేశారని, ఇప్పుడు పవన్ కల్యాణ్ పైనా వ్యక్తిగతంగా విమర్శలు చేస్తున్నారని.. తీరు మార్చుకోకపోతే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని వార్నింగ్ ఇచ్చారు. రాష్ట్ర మంత్రులు కూడా రాజకీయాల్లోకి కాపు జాతిని లాగవద్దని ఇదే తరహాలో రాజకీయం చేయాలని చూస్తే వచ్చే ఎన్నికల్లో ఓట్ల రూపంలో సత్తా చూపుతామని కాపు సంఘాల నేతలు వెల్లడించారు .

అటు రామ్ గోపాల్ వర్మ ట్వీట్ పై టీడీపీ నేతలు కూడా గట్టిగానే రియాక్ట్ అవుతున్నారు. బుద్దా వెంకన్న ఒక ట్వీట్ చేశారు. '' కామంతో కాళ్లు నాకావనుకున్నాం.. కానీ పేటీఎం డబ్బుల కోసం ఏమైనా నాకుతావని ఊహించలేదు. RIP ఆర్జివీ. కంగ్రాట్స్ జగన్ రెడ్డి' బుద్దా వెంకన్న ట్వీట్ చేశారు. చంద్రబాబు నాయుడు పవన్ కల్యాణ్ భేటీ తర్వాత వైసీపీ నాయకులు పిచ్చి పట్టినట్టుగా వ్యవహరిస్తున్నారని మాజీమంత్రి నక్క ఆనంద్ బాబు విమర్శించారు. భిన్న ధ్రువాలు అయినా వామపక్షాలను, బీజేపీని గతంలో ఎన్టీఆర్ ఒకే వేదిక మీదకు తీసుకువచ్చారని చంద్రబాబు నాయుడు సారథ్యంలో అది పునరావృతమవుతుందోమో చూడాలన్నారు.

చంద్రబాబు, పవన్ కల్యాణ్ కాఫీ తాగితేనే పన్నెండు మంది మంత్రులు, ఎమ్మెల్యేలు మీడియా ముందుకు పరిగెత్తుకుంటూ వచ్చారని.. అదే వారిద్దరూ కలిసి భోజనం చేస్తే వీరంతా ఏమైపోతారో అని ఆనంద్ బాబు ఎద్దేవా చేశారు. కొంతమంది సినిమా వాళ్ళని అడ్డుపెట్టుకొని కులాల మధ్య చిచ్చు రేపాలని వైసీపీ ప్రయత్నిస్తోందని, అందులో భాగంగానే రామ్ గోపాల్ వర్మ కాపులకు సంతాపం తెలుపుతూ ట్వీట్ చేయడం అని విమర్శించారు. వైసీపీ నాయకులు ఏది రాసిస్తే అది ట్వీట్ చేసే స్థాయికి రాంగోపాల్ వర్మ దిగజారిపోయారు అని విమర్శించారు.

First Published:  10 Jan 2023 4:13 AM GMT
Next Story