Telugu Global
Andhra Pradesh

వైఎస్ జగన్ నెత్తిన పాలు పోసిన కేసీఆర్.. పోలవరం సమస్యకు ముగింపు?

రాష్ట్ర విభజన సమయంలోనే ఎలాంటి ఆటంకాలు రాకుండా ముంపు మండలాలను ఏపీలో కలిపారు. అయినా సరే తెలంగాణ ప్రభుత్వం నుంచి పలు అభ్యంతరాలు వ్యక్తం అయ్యాయి.

వైఎస్ జగన్ నెత్తిన పాలు పోసిన కేసీఆర్.. పోలవరం సమస్యకు ముగింపు?
X

ఏపీ సీఎం వైఎస్ జగన్ రాబోయే ఎన్నికల్లో మరోసారి వైసీపీని అధికారంలోకి తీసుకొని రావాలని తీవ్రంగా కష్టపడుతున్నారు. రాష్ట్రంలో అన్ని పార్టీలు ఏకమై అధికార వైసీపీపై విమర్శలు గుప్పిస్తున్నాయి. టీడీపీ అధినేత చంద్రబాబు ఇటీవల ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో పర్యటించారు. వైసీపీ అధికారంలోకి వస్తే పోలవరం పూర్తి కాదని ఆనాడే చెప్పాను. ఇప్పుడు చూడండి.. నేను చెప్పిన మాటలే నిజం అవుతున్నాయని విమర్శలు గుప్పించారు. అయితే, పోలవరం పూర్తి చేయడానికి పలు సమస్యలు అడ్డుగా ఉన్నాయి. వైసీపీ అధికారంలోకి వచ్చాక నిర్మాణం పూర్తి చేయడానికి ప్రయత్నాలు జరుగుతున్నా.. కోర్టు కేసుల కారణంగా పనులు నత్తనడకన సాగుతున్నాయి.

రాష్ట్ర విభజన సమయంలోనే ఎలాంటి ఆటంకాలు రాకుండా ముంపు మండలాలను ఏపీలో కలిపారు. అయినా సరే తెలంగాణ ప్రభుత్వం నుంచి పలు అభ్యంతరాలు వ్యక్తం అయ్యాయి. గతంలో అంచనా వేసిన దాని కంటే వరద ప్రవాహం పెరిగిందని, ముంపు ప్రాంతం కూడా పెరుగుతుందని వాదిస్తోంది. ముఖ్యంగా టెంపుల్ టౌన్ భద్రాచలం తీవ్రంగా నష్టపోయే అవకాశం ఉందని చెబుతోంది. రెండు రాష్ట్రాల మధ్య ఉన్న విభజన సమస్యలో పోలవరం కూడా ఒకటి. దీనిపై సుప్రీంకోర్టులో కూడా కేసు నడుస్తోంది.

2014 నుంచి అనేక సమస్యలు ఏపీ, తెలంగాణ మధ్య నెలకొన్నాయి. పరిష్కరించాల్సిన బీజేపీ ప్రభుత్వం మాత్రం చోద్యం చూస్తూ కూర్చున్నది. తమ రాజకీయ ప్రయోజనాలకు అనుగుణంగానే నెమ్మదిగా నిర్ణయాలు తీసుకుంటోంది. దీని వల్ల ఇరు రాష్ట్రాలు తీవ్రంగా నష్టపోతున్నాయి. ఈ క్రమంలో పోలవరంపై కేంద్రం ఎలాంటి నిర్ణయం తీసుకోకపోవడంతో ఏపీ ఇబ్బంది పడుతోంది. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో వందలాది గ్రామాలను ప్రాజెక్టు బ్యాక్ వాటర్ ముంచేస్తుందని తెలంగాణ వాదిస్తూ వస్తోంది.

అయితే ఈ విషయంలో తెలంగాణ ప్రభుత్వం కాస్త మెత్తబడినట్లు తెలుస్తున్నది. బుధవారం సుప్రీంకోర్టులో జరిగిన విచారణ సందర్భంగా తెలంగాణ వెల్లడించిన నిర్ణయం ఏపీకి కలసి వస్తోంది. ఈ విషయంలో వైఎస్ జగన్ నెత్తిన కేసీఆర్ పాలుపోసినట్లే అనే అభిప్రాయం వెలువడుతోంది. పోలవరం విషయంలో గతంలో చేసిన అభ్యంతరాలను తెలంగాణ పక్కన పెట్టింది. ప్రాజెక్టు నిర్మాణానికి ఎలాంటి అభ్యంతరం లేదని, అయితే రక్షణ గోడలు నిర్మించి ముంపు లేకుండా చూడాలని కోరింది. వరద ప్రవాహం పెరగడం వల్లే రక్షణ గోడలు నిర్మించాలని కోరుతున్నామని తెలంగాణ తరపు న్యాయవాది సుప్రీంకోర్టుకు తెలిపారు.

తెలంగాణ తమ నిర్ణయం ఏపీకి అనుకూలంగా మారనున్నది. ఇక ఇప్పుడు చత్తీస్‌గడ్, ఒడిషాలను ఒప్పిస్తే సరిపోతుందనే చర్చ జరుగుతున్నది. పోలవరం వల్ల ఎక్కువగా నష్టపోయే తెలంగాణ పట్టువిడుపు ప్రదర్శించడంతో.. మిగిలిన రెండు రాష్ట్రాలు కూడా తమ అభ్యంతరాలను వెనక్కి తీసుకునే అవకాశం ఉంది. ఏదేమైనా తొమ్మిదేళ్లుగా పెండింగ్‌లో ఉన్న సమస్యకు తెలంగాణ నుంచి సానుకూల స్పందన రావడం వైఎస్ జగన్‌కు పెద్ద ఊరటే. ఇక పోలవరం పనులు ఊపందుకుంటాయని.. రాబోయే ఎన్నికల్లో పోలవరం పూర్తి చేయడం వల్ల లాభిస్తుందని జగన్ భావిస్తున్నారు.

First Published:  8 Dec 2022 5:21 AM GMT
Next Story