Telugu Global
Andhra Pradesh

వ్యక్తి గుప్పెట్లో బోర్డు- ఇంటర్‌ బోర్డు సెక్రటరీ సంచలన వ్యాఖ్యలు

ఏసీబీ, అట్రాసిటీ, లైంగిక వేధింపులు వంటి ఆరోపణలతో సస్పెండ్‌ అయిన ఒక వ్యక్తి ఇంటర్‌ బోర్డుపై ఆరోపణలు చేస్తున్నారని నవీన్‌ మిట్టల్ ఫైర్ అయ్యారు.

వ్యక్తి గుప్పెట్లో బోర్డు- ఇంటర్‌ బోర్డు సెక్రటరీ సంచలన వ్యాఖ్యలు
X

తెలంగాణ ఇంటర్‌ బోర్డు సెక్రటరీ నవీన్ మిట్టల్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇంటర్‌ బోర్డును ఒక వ్యక్తి తన గుప్పెట్లో పెట్టుకున్నారని ఆరోపించారు. తెలంగాణలో ఇంటర్‌ పేపర్ల వాల్యుయేషన్‌పై బోర్డు తీసుకున్న నిర్ణయాన్ని కొందరు తప్పుపడుతున్నారు. లెక్చరర్లకు సరైన శిక్షణ ఇవ్వకుండా ఆన్‌లైన్‌లో పేపర్ వాల్యుయేషన్ ఏంటని ప్రభుత్వ జూనియర్ లెక్చరర్ల సంఘం అధ్యక్షుడు మధుసూదన్‌ రెడ్డి ఇటీవ‌ల ప్రశ్నించారు. మరికొందరు కూడా ఆయనకు వంతపాడారు.

ఈ నేపథ్యంలో ఇంటర్‌ బోర్డు సెక్రటరీ నవీన్ మిట్టల్ మీడియా సమావేశం ఏర్పాటు చేసి కీలక వ్యాఖ్యలు చేశారు. ఇంటర్‌ బోర్డుకు సమాంతరంగా మరో కమిషనర్ వ్యవస్థ నడుస్తోందని ఆరోపించారు. ఒక వ్యక్తి వ్యవస్థను మొత్తం తన గుప్పిట్లో పెట్టుకున్నారని చెప్పారు. కార్యాలయంలోని సీసీ ఫుటేజ్‌ను కూడా ట్యాంపర్‌ చేసే స్థాయికి వెళ్లిపోయారని వెల్లడించారు. బోర్డు కార్యాలయంలోని సీసీ ఫుటేజ్‌ వ్యవస్థ పాస్‌వర్డ్‌ కూడా ప్రస్తుతం ఉద్యోగంలో లేని వ్యక్తి నియంత్రణలోనే ఉందన్నారు. తాను ఒక అధికారితో మాట్లాడిన విషయాలు వెంటనే మూడో వ్యక్తికి చేరిపోయాయని చెప్పారు.

ఆన్‌లైన్‌లో పేపర్ వాల్యుయేషన్‌ వల్ల పారదర్శకత పెరుగుతుందని, ఖర్చు, పనిభారం కూడా తగ్గుతుందన్నారు. నూతన విధానం వల్ల కౌంటింగ్, రీ వాల్యుయేషన్ పక్రియ కూడా ఈజీ అవుతుందన్నారు. విద్యార్థులకు ఎంతో సౌలభ్యంగా ఉంటుందన్నారు. ఇలాంటి ఒక మంచి విధానాన్ని తాము ప్రవేశపెడుతుంటే ఒక వ్యక్తికి విపరీతమైన నొప్పి ఎందుకు వస్తోందని ప్రశ్నించారు. మాన్యువల్‌గా పేపర్ వాల్యుయేషన్‌ జరిగితే డబ్బులు సంపాదించవచ్చు అనుకునే వారే ఆన్‌లైన్ విధానాన్ని అడ్డుకునేందుకు ప్రయత్నిస్తున్నారన్నారు. ఇంటర్‌ బోర్డులో డేటా చోరీ జరిగిందని చెప్పారు.

ఏసీబీ, అట్రాసిటీ, లైంగిక వేధింపులు వంటి ఆరోపణలతో సస్పెండ్‌ అయిన ఒక వ్యక్తి ఇంటర్‌ బోర్డుపై ఆరోపణలు చేస్తున్నారని నవీన్‌ మిట్టల్ ఫైర్ అయ్యారు. ఇంతకాలం ఎగ్జామినేషన్ విధానాన్ని కంట్రోల్ చేస్తున్న కొందరు వ్యక్తులకు నూతన విధానం కారణంగా తన చేతుల్లో ఏమీ లేకుండాపోతుందే అన్న బాధతోనే బోర్డుపై ఆరోపణలు చేస్తున్నారని చెప్పారు. ఓయూ, అంబేద్కర్ వర్శిటీల్లో పేపర్ వాల్యుయేషన్ ఇప్పటికే ఆన్‌లైన్ విధానంలో నడుస్తోందన్నారు. ఇంతకాలం ఇంటర్ బోర్డును ఒక ఆదాయ వనరుగా మార్చుకున్న వారే కొత్త విధానాలకు వ్యతిరేకంగా తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. ఇదంతా ఒక వ్యక్తి కనుసన్నల్లోనే నడుస్తోందని సెక్రటరీ ఆరోపించారు.

ఆన్‌లైన్‌లోనే పేపర్ వాల్యుయేషన్ చేయిస్తామని.. దీని వల్ల పారదర్శకత పెరుగుతుందని తల్లిదండ్రులు, విద్యార్థులు ఆందోళన చెందవద్దని సెక్రటరీ హామీ ఇచ్చారు. అటు ట్రెస్‌పాస్‌ ఆరోపణలపై బేగంబజార్‌ పోలీస్ స్టేషన్‌లో జూనియర్ లెక్చరర్ల సంఘం అధ్యక్షుడు మధుసూదన్‌ రెడ్డిపై కేసు నమోదు అయింది.

First Published:  30 Jan 2023 1:11 PM GMT
Next Story