Telugu Global
Andhra Pradesh

ఓవరాక్షన్ చేస్తే ఇలాగే ఉంటుందా? జోగయ్యకు షాక్

జోగయ్య వేసిన పిటీషన్‌లో న్యూసెన్స్ తప్ప ప్రజా ప్రయోజనం ఏముందని నిలదీశారు. జగన్ మీద వ్యక్తిగత కక్షతో కేసు వేసినట్లుందన్నారు. తన పిటీషన్‌లో రాష్ట్రపతి, సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్‌కు కూడా ఫిర్యాదు చేశామంటే తాము భయపడిపోతామా అని నిలదీశారు.

ఓవరాక్షన్ చేస్తే ఇలాగే ఉంటుందా? జోగయ్యకు షాక్
X

ఎవరికోసమో.. ఇంకెవరో.. మరెవరిమీదో ఓవర్ యాక్షన్ చేస్తే ఫలితం ఇలాగే ఉంటుందని తేలిపోయింది. ఇక్కడ ఎవరి కోసమో అంటే జనసేన అధినేత పవన్ కల్యాణ్ కోసమని అర్థం. ఇంకెవరో అంటే మాజీ ఎంపీ చేగొండి హరిరామజోగయ్యని. మరెవరి మీదో అంటే జగన్మోహన్ రెడ్డి మీదని. ఇంతకీ విషయం ఏమిటంటే తెలంగాణ హైకోర్టు మాజీ ఎంపీ జోగయ్యను ఒక ఉతుకు ఉతికేసింది. జోగయ్య చేసిందేమింటటే తనకు సంబంధంలేని జగన్ కేసుల విచారణలో తలదూర్చటమే.

జగన్ మీద విచారణలో ఉన్న ఆదాయానికి మించిన కేసులన్నింటినీ స్పీడుగా విచారించేయాలని పిటీషన్ వేశారు. 2024 ఎన్నికల్లోపే విచారణ పూర్తిచేసి తీర్పుకూడా చెప్పేయాలన్నారు. తీర్పు ఏమిటో చూసుకుని జనాలు జగన్‌కు ఓట్లేయాలా వద్దా అని డిసైడ్ చేసుకుంటారట. లేకపోతే అవినీతిపరుడికి జనాలు ఓట్లేసే ప్రమాదముందన్నారు. రాజకీయాలకు అవినీతిపరులను దూరంగా ఉంచటం చాలా అవసరమని జోగయ్య అభిప్రాయపడ్డారు. ప్రజాప్రయోజనార్థం అని చెప్పి జోగయ్య ఈ పిటీషన్ వేశారు.

పిటీషన్ వేసిన మాజీ ఎంపీ ఊరుకోకుండా హైకోర్టును బెదిరించాలని చూశారు. ఇక్కడే జోగయ్య ఓవరాక్షన్ ఏమిటో బయటపడింది. ఆయన ఏమిచేశారంటే కేసులను వెంటనే విచారణ జరిపి తీర్పుచెప్పాలని అడుగుతునే రాష్ట్రపతి, సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్‌కు కూడా ఫిర్యాదు చేశానని పిటీషన్లో ప్రస్తావించారు. దీన్నిచూడగానే హైకోర్టు చీఫ్ జస్టిస్ ఉజ్వల్ భూయాన్‌కు మండిపోయింది. కేసు విచారణ మొదలవ్వగానే భూయాన్ అందుకున్నారు.

జోగయ్య వేసిన పిటీషన్‌లో న్యూసెన్స్ తప్ప ప్రజా ప్రయోజనం ఏముందని నిలదీశారు. జగన్ మీద వ్యక్తిగత కక్షతో కేసు వేసినట్లుందన్నారు. తన పిటీషన్‌లో రాష్ట్రపతి, సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్‌కు కూడా ఫిర్యాదు చేశామంటే తాము భయపడిపోతామా అని నిలదీశారు. హైకోర్టులో పిటీషన్ వేసి రాష్ట్రపతి, సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్‌కు ఫిర్యాదు చేశామని చెప్పటంలో అర్థ‌మేంటని ప్రశ్నించారు. ఎంపీగా పనిచేసిన వ్యక్తికి ఇలాంటి చీప్‌ ట్రిక్స్ తగునా అంటూ మందలించారు. ఇలాంటి పిటీషన్‌తో హైకోర్టు విలువైన సమయం వృధా అవటం తప్ప ఇంకేమైనా ఉపయోగముందా అంటూ చివాట్లు పెట్టారు. ఇంకోసారి ఇలాంటి పిటీషన్లు వేయద్దని గట్టిగా వార్నింగ్ ఇచ్చారు.

First Published:  13 Jun 2023 4:56 AM GMT
Next Story