Telugu Global
Andhra Pradesh

టెక్కలి వైసీపీలో పొలిటికల్ హీట్.. దువ్వాడ ఏమన్నారంటే..?

"వాణి నా భార్య, ప్రజాస్వామ్యంలో ఎవరికైనా నామినేషన్ వేసి, పోటీ చేసే అధికారం ఉంది. కాదని చెప్పే అర్హత ఎవరికీ లేదు. ఏం చేస్తాం, కలియుగ ప్రభావం." అన్నారు దువ్వాడ.

టెక్కలి వైసీపీలో పొలిటికల్ హీట్.. దువ్వాడ ఏమన్నారంటే..?
X

టెక్కలి వైసీపీ టికెట్ ఖరారు విషంలోనే కొంత గందరగోళం నడిచింది. ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ కి ఇక్కడ టికెట్ కేటాయించారు సీఎం జగన్. అయితే అదే సమయంలో ఆయన భార్య దువ్వాడ వాణి పేరు కూడా తెరపైకి వచ్చింది. అప్పటికప్పుడు ఆ సమస్య సర్దుకుంది అనుకున్నా.. మళ్లీ ఇప్పుడు వాణి స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్ వేస్తారనే ప్రచారం జరుగుతోంది. భార్య నామినేషన్ వార్తలపై దువ్వాడ శ్రీనివాస్ కాస్త ఆలస్యంగా స్పందించారు. కలియుగ ప్రభావం అంటూ నిట్టూర్చారు.

"వాణి నా భార్య, ప్రజాస్వామ్యంలో ఎవరికైనా నామినేషన్ వేసి, పోటీ చేసే అధికారం ఉంది. కాదని చెప్పే అర్హత ఎవరికీ లేదు. ఏం చేస్తాం, కలియుగ ప్రభావం. సొంత అన్నదమ్ములు, కుటుంబం కూడా తిరగబడవచ్చు. కానీ, ప్రజాస్వామ్యంలో ప్రజలే న్యాయ నిర్ణేతలు. కానీ ఆమె నామినేషన్ వేయరనే నేను అనుకుంటున్నా. నేను రాత్రికి రాత్రి రెడీమేడ్‌గా తయారైన నాయకుడిని కాదు. పాతికేళ్ల రాజకీయ జీవితం నాది." అని అన్నారు దువ్వాడ.

ప్రస్తుతం టెక్కలి జడ్పీటీసీ సభ్యురాలిగా ఉన్నారు దువ్వాడ వాణి. కుటుంబంలో విభేదాలున్నాయనే ప్రచారం జరుగుతున్నా.. ఇటీవల అంతా సర్దుకున్నట్టే అనిపించింది. కానీ సడన్ గా భర్తపై పోటీ చేసేందుకు ఆమె సిద్ధమయ్యారనే వార్తలు వైరల్ గా మారాయి. దీనిపై దువ్వాడ శ్రీనివాస్ స్పందించడం విశేషం. దంతో టెక్కలి వైసీపీలో పొలిటికల్ హీట్ పెరిగింది.

First Published:  20 April 2024 2:05 AM GMT
Next Story