Telugu Global
Andhra Pradesh

జగన్ కి కొత్త తలనొప్పి తెచ్చిన ప్రవీణ్ ప్రకాష్..

పాఠ్యపుస్తకాల పంపిణీ ఆలస్యం కావడానికి కారణం ప్రభుత్వమే అనే నింద కూడా పడింది. ఆ విషయాలపై లోతుగా విచారణ జరిపితే ఉన్నత స్థాయి అధికారులపై చర్యలు తీసుకోవాలి. లేదా ప్రభుత్వం దోషిగా నిలబడాలి.

జగన్ కి కొత్త తలనొప్పి తెచ్చిన ప్రవీణ్ ప్రకాష్..
X

ఏపీ పాఠశాల విద్యాశాఖ ముఖ్యకార్యదర్శి ప్రవీణ్‌ ప్రకాష్.. ఇటీవల స్కూళ్లను సందర్శించడం ఉపాధ్యాయులకు చీవాట్లు పెట్టడం తెలిసిన విషయమే. మీకు జీతాలెందుకు నేను పాఠాలు చెప్పనా అంటూ కొన్నిసార్లు ఆయన ఘాటు వ్యాఖ్యలు కూడా చేశారు. ఇటీవల ఆయన పార్వతీపురం మన్యం జిల్లా వీరఘట్టం మండలంలోని కస్తూర్బాగాంధీ బాలికా విద్యాలయాన్ని సందర్శించారు. స్కూల్ బుక్స్ పంపిణీ విషయంలో లేట్ చేశారంటూ డీఈవో, ఎంఈఓ సహా మరో ఇద్దరు అధికారుల్ని సస్పెండ్ చేశారు. ఈ ఘటనపై ఉపాధ్యాయ సంఘాలు సీరియస్ గా రియాక్ట్ అయ్యాయి. స్కూల్ బుక్స్ పంపిణీ ఆలస్యానికి కారణం ప్రభుత్వం అయితే, తప్పు అధికారులపై నెడితే ఎలా అంటూ వారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రెండు రోజులుగా ఆందోళనలు చేపట్టారు. పార్వతీపురం మన్యం జిల్లా కలెక్టరేట్ వద్ద చేపట్టిన ర్యాలీతో ఈ వ్యవహారం మరింత హాట్ టాపిక్ గా మారింది. దీంతో కలెక్టర్ జోక్యం చేసుకుని ఉపాధ్యాయ సంఘాలను శాంతింపజేశారు. బుక్స్ పంపిణీ ఆలస్యం విషయంలో తానే విచారణ చేపడతానని హామీ ఇచ్చారు.

గతంలో కూడా ప్రవీణ్ ప్రకాష్ పాఠశాలలు సందర్శిస్తూ.. ఉపాధ్యాయులకు చీవాట్లు పెడుతూ హడావిడి చేసేవారు. అక్కడికి అది సరిపోయింది కానీ, ఇప్పుడు నేరుగా డీఈఓ, ఎంఈఓ స్థాయి అధికారులపై వేటు వేయడంతో ఉపాధ్యాయ సంఘాలు రంగంలోకి దిగాయి. సెక్రటరీ స్థాయి అధికారులకు వ్యతిరేకంగా ఉపాధ్యాయులు రోడ్డెక్కి నిరసన తెలపడం ఇదే తొలిసారి. దీంతో ప్రభుత్వానికి మరో తలనొప్పి మొదలైనట్టయింది.

పాఠ్యపుస్తకాల సరఫరాలోనే లోపం ఉన్నప్పుడు పంపిణీ విషయంలో కింది స్థాయి అధికారులపై వేటు వేస్తే ఎలా అని ప్రశ్నిస్తున్నారు ఉపాధ్యాయులు. అయితే ఈ విషయంలో మంత్రి బొత్స మాత్రం వెనక్కు తగ్గలేదు. ఆయన ప్రవీణ్ ప్రకాష్ ని సమర్థిస్తూ మాట్లాడారు. కానీ ఉపాధ్యాయులు కూడా ఆందోళన విషయంలో వెనక్కు తగ్గకపోవడం విశేషం. తన చర్యకు ఈ స్థాయిలో ఉపాధ్యాయులనుంచి ప్రతిచర్య ఉంటుందని ప్రవీణ్ ప్రకాష్ కూడా ఊహించి ఉండరు.

ఇప్పటికే సీపీఎస్ రద్దు, పీఆర్సీ పెంపు వంటి విషయాలతో ఉద్యోగులు, ఉపాధ్యాయులు ప్రభుత్వంపై రగిలిపోతున్నారు. ఇప్పుడు కొత్తగా ప్రవీణ్ ప్రకాష్ వ్యవహారం ప్రభుత్వానికి ఇబ్బందిగా మారింది. పైగా పాఠ్యపుస్తకాల పంపిణీ ఆలస్యం కావడానికి కారణం ప్రభుత్వమే అనే నింద కూడా పడింది. ఆ విషయాలపై లోతుగా విచారణ జరిపితే ఉన్నత స్థాయి అధికారులపై చర్యలు తీసుకోవాలి. లేదా ప్రభుత్వం దోషిగా నిలబడాలి.

First Published:  25 April 2023 1:40 AM GMT
Next Story