Telugu Global
Andhra Pradesh

ఢిల్లీలో ఏపీ దొంగ ఓట్ల పంచాయితీ

ఏపీ దొంగఓట్ల పంచాయితీ ఢిల్లీకి చేరింది. పోటా పోటీగా కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదులు చేశారు వైసీపీ, టీడీపీ నేతలు.

ఢిల్లీలో ఏపీ దొంగ ఓట్ల పంచాయితీ
X

ఏపీ దొంగఓట్ల పంచాయితీ ఢిల్లీకి చేరింది. పోటా పోటీగా కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదులు చేశారు వైసీపీ, టీడీపీ నేతలు. దొంగ ఓట్లు చేర్పించింది మీరంటే మీరంటూ దుమ్మెత్తిపోసుకున్నారు.

కేంద్ర ఎన్నికల సంఘాన్ని కలసిన చంద్రబాబు సీఈసీతో దాదాపు గంటసేపు సమావేశమయ్యారు. టీడీపీ సహా ఇతర ప్రతిపక్ష పార్టీల సానుభూతిపరుల ఓట్లను నిబంధనలకు విరుద్ధంగా తొలగించారంటూ ఆయన ఫిర్యాదు చేశారు. కొన్ని ఉదాహరణలను కూడా వివరించారు. రాష్ట్రంలో ఎప్పుడూ లేని వింత సమస్య ఇప్పుడు వచ్చిందన్నారు చంద్రబాబు. ప్రతిపక్ష పార్టీల ఓట్లు తొలగించాలనే ఆలోచన గతంలో ఎవరికీ రాలేదని చెప్పారు. నకిలీ ఎపిక్‌ కార్డులు ప్రింట్‌ చేస్తున్నారని, దానిపై చర్యలు తీసుకోవాలని కోరారు. టీచర్లు, గ్రాడ్యుయేట్‌ ఎమ్మెల్సీ ఎన్నికల్లో నకిలీ సర్టిఫికెట్లతో ఓట్లు నమోదు చేశార్న చంద్రబాబు.. వైసీపీ అధికారంలోకి వచ్చాక రాష్ట్రంలో జరిగిన అన్ని ఎన్నికల్లో ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేశారని ఆరోపించారు.

ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవడానికే ఢిల్లీకి వచ్చానన్న చంద్రబాబు.. రాష్ట్రంలో జరుగుతున్న అక్రమాలను ఈసీకి వివరించానని చెప్పారు. తాము ఇచ్చిన వివరాలు వాస్తవమా? వైసీపీ ఇచ్చినవి వాస్తవమా? తేలాల్సిన సమయం వచ్చిందన్నారు. ఓటర్ల వ్యక్తిగత డేటా వాలంటీర్లకు చేరిందని, ఆ విషయంపై కేంద్ర ఎన్నికల సంఘం విచారణ జరపాలన్నారు చంద్రబాబు.

ఇక టీడీపీ హయాంలోనే అవకతవకలు జరిగాయని కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు వైసీపీ ఎంపీలు. టీడీపీ హయాంలో జరిగిన తప్పుల్ని సరిదిద్దే క్రమంలో తమపైనే చంద్రబాబు ఆరోపణలు చేస్తున్నారని వారు వివరించారు. ఏపీలో ఓట్ల తొలగింపుపై టీడీపీ తప్పుడు ప్రచారం చేస్తోందన్నారు. చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడు భారీస్థాయిలో ఓట్ల అవకతవకలకు పాల్పడి దొంగ ఓట్లతో అధికారాన్ని చేజిక్కించుకున్నారని చెప్పారు వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి. దొంగే దొంగ అన్నట్టుగా ఇప్పుడు తమపైనే ఆరోపణలు చేయడం విడ్డూరంగా ఉందన్నారు. 2014 నుంచి నమోదైన దొంగ ఓట్లపై విచారణ జరిపించాలని కేంద్ర ఎన్నికల సంఘాన్ని కోరినట్టు తెలిపారు విజయసాయిరెడ్డి.


ఓటరు కార్డులను ఆధార్ కార్డుతో లింక్ చేయాలని, ఒకరికి ఒక్క ఓటు మాత్రమే ఉండాలని.. రాబోయే ఎన్నికలు స్వేచ్ఛగా, పారదర్శకతతో జరిపించాలని ఈసీని కోరినట్టు తెలిపారు వైసీపీ ఎంపీలు. ఈ దఫా అత్యంత పారదర్శకతతో ఓట్ల నమోదు జరిగిందని 2019లో 3,98,34776 ఓట్లు ఉంటే, ఇప్పుడు 3,97,96,678 ఓట్లు ఉన్నాయని తెలిపారు. ఏపీలో ఎక్కడా దొంగ ఓట్ల నమోదు జరగలేదని అన్నారు వైసీపీ ఎంపీలు.

First Published:  28 Aug 2023 4:14 PM GMT
Next Story