Telugu Global
Andhra Pradesh

డబ్బులు ఇస్తాం.. మ‌మ్మ‌ల్ని అరెస్టు చేయండి ప్లీజ్‌

యువ‌నేత‌ లోకేశ్ ఓ స‌మావేశంలో ప్ర‌భుత్వంపై రాజీలేని పోరాటం చేసేవారిని గుర్తిస్తామ‌ని, ప్ర‌జ‌ల త‌ర‌ఫున ఉద్య‌మించి, ఎన్ని ఎక్కువ‌సార్లు అరెస్ట‌యితే అంత ప్ర‌యారిటీ ఇస్తామ‌ని చెప్పార‌ట‌.

డబ్బులు ఇస్తాం.. మ‌మ్మ‌ల్ని అరెస్టు చేయండి ప్లీజ్‌
X

డబ్బులు ఇస్తాం.. మ‌మ్మ‌ల్ని అరెస్టు చేయండి ప్లీజ్‌

తెలుగుదేశం పార్టీకి కొత్త స‌మ‌స్య వ‌చ్చి ప‌డింది. పార్టీకి నేత‌ల ఓవ‌ర్ యాక్ష‌న్ త‌ల‌నొప్పిగా ప‌రిణ‌మించింది. వైసీపీ ప్ర‌భుత్వ నిర్ణ‌యాలు, తీరుపై టిడిపి అధిష్టానం ఏ కార్య‌క్ర‌మం నిర్వ‌హించాల‌ని పిలుపునిచ్చినా పోలీసులు భ‌గ్నం చేసేవారు.


టిడిపి నేత‌ల్ని అరెస్టు చేసి లేదంటే గృహ‌నిర్బంధం చేసి అస‌లు కార్య‌క్ర‌మ‌మే జ‌ర‌గ‌నీయ‌లేద‌ని ప్ర‌భుత్వానికి నివేదించి మార్కులు ఖాకీలు కొట్టేసేవారు. ఇదే టిడిపి నేత‌ల‌కు ఓ వ‌రంగా మారింది. అధినేత ఎంత ప‌క‌డ్బందీగా కార్య‌క్ర‌మం నిర్వ‌హించాల‌ని సూచ‌న‌లు చేసినా, కొంద‌రు నేత‌లు త‌మ‌కున్న వ్యాపారాలు చ‌క్క‌బెట్టుకోవ‌డానికి పోలీసుల్ని బ‌తిమాలుకుని.. డ‌బ్బులిచ్చి హౌస్ అరెస్టు అవ‌డం అల‌వాటు చేసుకున్నారు.

ఉద‌యాన్ని ఓ పోలీసుని పిలిపించుకుని త‌మ‌కు ఎదురుగా కూర్చోబెట్టుకుని త‌న‌ను గృహ‌నిర్బంధం చేశార‌ని టిడిపి కేంద్ర కార్యాల‌యానికి ఫొటోలు పంపించి, త‌మ మాట వినే మీడియాలో స్క్రోలింగ్ వేయించ‌డంతో నాట‌కానికి ఫుల్ స్టాప్ పెట్టేసి, పార్టీ కార్య‌క్ర‌మాన్ని నిర్వ‌హించ‌కుండా, త‌మ సొంత ప‌నులు చ‌క్క‌బెట్టుకునేవారు. ఈ డ్రామాలు 175 నియోజ‌క‌వ‌ర్గాల్లోనూ కిందిస్థాయి వ‌ర‌కూ అల‌వాటైపోయాయి. దీంతో టిడిపి జాతీయ అధ్య‌క్షుడు చంద్ర‌బాబు ఇన్చార్జిల స‌మావేశంలోనే హౌస్ అరెస్టుల‌న్నీ నాట‌కాలేన‌ని, ఇక‌పై ఎవ‌రైనా గృహ‌నిర్బంధం చేశార‌ని సాకుతో ప్రోగ్రాంలు డుమ్మా కొడితే క‌ఠిన‌చ‌ర్య‌లు త‌ప్ప‌వ‌ని హెచ్చ‌రించారు.

ఉన్న అవ‌కాశం పోవ‌డంతో టిడిపి నేత‌లు కొత్త దారి వెతుక్కున్నారు. మొద‌ట్లో కార్య‌క్ర‌మాన్ని అడ్డుకునేందుకు పోలీసులు కొంద‌రిని అరెస్టు పేరుతో అక్క‌డ్నించి త‌ర‌లించి మ‌ళ్లీ సాయంత్రం వ‌దిలేసేవారు. ఇదేదో బాగుందని, కార్య‌క్ర‌మానికి పిలుపునివ్వ‌డం, ముందుగానే పోలీసులతో ప్యాకేజీ మాట్లాడుకుని అరెస్టు చేసి త‌మ‌ను స్టేష‌న్లు మార్చి తిప్పుతున్నార‌ని, త‌మ‌కు ప్రాణ‌హాని ఉంద‌ని మ‌ళ్లీ త‌మ అనుకూల మీడియాలో స్క్రోలింగ్లు, సోష‌ల్మీడియాలో ప్ర‌చారం చేసుకోవ‌డం అనే కొత్త ప్లాన్ అమ‌లు మొద‌లుపెట్టారు.

త‌మ నేత అరెస్టు, క‌నిపించ‌డంలేద‌ని పోలీసుల‌పై ఆరోప‌ణ‌లు చేస్తూ టిడిపి అధిష్టానం ప్ర‌క‌ట‌న‌లు విడుద‌ల చేస్తోంది. లీగ‌ల్ టీములు ప‌రుగులు పెడుతున్నాయి. ఇటు అధికారంలో ఉన్న వైసీపీ పెద్ద‌ల ఒత్తిడి, అటు ప్ర‌తిప‌క్ష టిడిపి ఆరోప‌ణ‌ల‌పై న‌లిగిపోతున్న పోలీసులు టిడిపి కేంద్ర కార్యాల‌యం పెద్ద‌ల‌కు అస‌లు గుట్టు చేర‌వేశారు. త‌మ‌ను అరెస్టుచేసి లోప‌ల వేయాల‌ని మీ యువ‌నేత‌లు డ‌బ్బులు ఇస్తున్నార‌ని, కాల్ రికార్డింగులు కూడా వినిపించార‌ట‌.


ఇలా అరెస్టు డ్రామాలలో యువ‌నేత‌లు ఎక్కువ మంది కీల‌క పాత్ర పోషిస్తున్నార‌ని కూడా లిస్టు ఇచ్చేశారు. గుంటూరు జిల్లాకి చెందిన యువ‌నేత సీఐడీ కేసు న‌మోదు చేయ‌కుండానే త‌న‌కి నోటీసులు ఇవ్వాల‌ని నానా యాగీ చేశాడు. తీరా ఆ కేసు ఎఫ్ఐఆర్లో ఆ కుర్రాడి పేరు లేదు. టిడిపి అనుబంధ సంఘాల‌కి అధ్య‌క్షులుగా ప‌నిచేస్తున్న రాయ‌ల‌సీమ‌కి చెందిన యువ‌కులైతే పోలీసులు విడిచి పెట్టేస్తామంటే, అన్నా ప్లీజ్.. కొద్ది సేపు ఉంచ‌వా, మా పెద్దాయ‌న నా కోసం ట్వీటు వేస్తారంటూ బ‌తిమాలుకుంటున్న ఆడియో రికార్డులు పోలీసులు టిడిపి కేంద్ర కార్యాల‌యానికి పంపించారు.

మ‌రో అనుబంధ సంఘ అధ్య‌క్షుడైతే, త‌న‌ను స్టేష‌న్లు మార్చి రాష్ట్ర‌మంతా తిప్పుతున్నార‌ని, త‌న‌ని ఎన్ కౌంట‌ర్ చేసేస్తార‌ని.. త‌న ఫోన్ నుంచే మీడియాకి, పార్టీ పెద్ద‌ల‌కు మెసేజులు పెట్టిన విచిత్రం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ఎన్నిసార్లు అరెస్ట‌యితే అంత సానుభూతి వ‌స్తుంద‌ని, ఎమ్మెల్యే టికెట్ కూడా ఈ అరెస్టులే ఇప్పిస్తాయ‌ని బ‌లంగా న‌మ్ముతున్న అనుబంధ సంఘాల అధ్య‌క్షులు, యువ‌నేత‌లు త‌మ అరెస్టుల కోసం పోలీసుల‌కు భారీగా ముట్ట‌జెబుతున్నార‌ని బ‌య‌ట‌ప‌డింది. ఒక‌రిని అక్ర‌మ అరెస్టు చేశార‌ని, విడిపించుకువ‌చ్చేందుకు వెళ్లిన లీగ‌ల్ సెల్ వారికి పోలీసులు ఈ డ్రామా మొత్తం చెప్పేశారు. ఎందుకీ అరెస్టు డ్రామాలంటూ వారు ఈ యువ‌నేత‌ల్ని నిల‌దీశారు.

యువ‌నేత‌ లోకేశ్ ఓ స‌మావేశంలో ప్ర‌భుత్వంపై రాజీలేని పోరాటం చేసేవారిని గుర్తిస్తామ‌ని, ప్ర‌జ‌ల త‌ర‌ఫున ఉద్య‌మించి, ఎన్ని ఎక్కువ‌సార్లు అరెస్ట‌యితే అంత ప్ర‌యారిటీ ఇస్తామ‌ని చెప్పార‌ట‌. టిడిపి యువ‌నేత‌ల‌కు ఎక్కువ‌సార్లు అరెస్ట‌యితే ప్ర‌యారిటీ అనే దానికి క‌నెక్ట్ అయి ఇలా పోలీసుల్ని బ‌తిమాలుకుని, డ‌బ్బులిచ్చి మ‌రీ అరెస్టు అవుతున్నార‌ట‌. హౌస్ అరెస్టుల డ్రామాల‌కు స్ట్రాంగ్ వార్నింగ్తో చెక్ పెట్టిన అధినేత చంద్ర‌బాబు...ఉత్తుత్తి అరెస్టు నాట‌కాల‌కు అడ్డుక‌ట్ట వేయాల‌ని పార్టీ నేత‌లు కోరుతున్నారు.

Next Story