Telugu Global
Andhra Pradesh

అచ్చెన్న మాట‌లు-తెలుగుదేశంలో మంట‌లు

మంత్రిగా, టీడీఎల్పీ నేత‌గా మాట‌ల‌తో పార్టీకి చేసిన న‌ష్టం కంటే ఏపీ టీడీపీ అధ్య‌క్షుడిగా త‌న వ్యాఖ్య‌ల‌తో సొంత పార్టీని డిఫెన్స్‌లోకి నెట్టేస్తున్నార‌ని అచ్చెన్న‌పై పార్టీ అధిష్టానం గుర్రుగా ఉంది.

అచ్చెన్న మాట‌లు-తెలుగుదేశంలో మంట‌లు
X

ఏపీ టీడీపీ అధ్య‌క్షుడు కింజ‌రాపు అచ్చెన్నాయుడుని నోటి గండం ప‌దే ప‌దే ప‌ల‌క‌రిస్తోంది. ఆయ‌న మాట స్వ‌ప‌క్షంలోనే మంట‌లు రాజేస్తోంది. ప్ర‌తీసారి అచ్చెన్నాయుడు మాట తెలుగుదేశం పార్టీ మెడ‌కే చుట్టుకుంటోంది. ఒక ప్ర‌ధాన రాజ‌కీయ పార్టీకి కీల‌క నేత అయి ఉండీ క‌నీస జాగ్ర‌త్త‌లు తీసుకోకుండా ఫోన్ల‌లో ఇష్టానుసారంగా మాట్లాడ‌టం, త‌న‌ను క‌ల‌వ‌డానికి వ‌చ్చిన‌వాడు మిత్రుడా..? శ‌త్రువా..? తెలుసుకోకుండా నోటికొచ్చిన‌ట్టు వాగ‌డంతో క‌ష్టాలు కోరి కొని తెచ్చుకుంటున్నార‌ని రాజ‌కీయ విశ్లేషకులు మాట‌. టీడీపీలో కింజరాపు అభిమానులు మాత్రం త‌మ నేత భోళా శంక‌రుడిలా క‌ల్మ‌షంలేకుండా ముక్కుసూటిగా మాట్లాడే త‌త్త్వం వ‌ల్ల ఇబ్బందులు ప‌డుతున్నార‌ని చెబుతున్నారు. మంత్రిగా, టీడీఎల్పీ నేత‌గా మాట‌ల‌తో పార్టీకి చేసిన న‌ష్టం కంటే ఏపీ టీడీపీ అధ్య‌క్షుడిగా త‌న వ్యాఖ్య‌ల‌తో సొంత పార్టీని డిఫెన్స్‌లోకి నెట్టేస్తున్నార‌ని అచ్చెన్న‌పై పార్టీ అధిష్టానం గుర్రుగా ఉంది.

నారా లోకేశ్ పాద‌యాత్ర‌కు సంబంధించి జ‌న‌స‌మీక‌ర‌ణ గురించి జీడీనెల్లూరు టీడీపీ ఇన్‌చార్జ్ భీమినేని చిట్టిబాబులో అచ్చెన్నాయుడు ఫోన్‌లో సాగిన సంభాష‌ణ వెలుగులోకి వ‌చ్చింది. ఈ ఆడియోలో పాద‌యాత్ర‌కు డ‌బ్బులిచ్చి జ‌నాన్ని త‌ర‌లించి, విజ‌య‌వంతం చేయ‌డానికి అన్ని ఏర్పాట్లు చేసిన‌ట్టు అచ్చెన్న‌తో అత‌ను అన్నాడు. ప్ర‌తిరోజూ మూడు వేల మందిని స‌మీక‌రించ‌నున్నామ‌ని ఆ ఆడియోలో వుండ‌టంతో అచ్చెన్నాయుడు మ‌రోసారి పార్టీని డ్యామేజ్ చేస్తూ దొరికిపోయార‌ని టీడీపీ పెద్ద‌లు కోపంగా ఉన్నారు.

త‌న‌కు అన్యాయం జ‌రిగింద‌ని హైద‌రాబాద్‌లోని టీడీపీ అధినేత ఇంటి ముందు ధ‌ర్నా చేసిన చోటా నాయ‌కుడు ఏడాది క్రితం తిరుప‌తి ఉప ఎన్నిక సంద‌ర్భంగా అచ్చెన్నాయుడిని హోట‌ల్ గ‌దిలో క‌లిశాడు. హిడెన్ కెమెరాల‌తో వ‌చ్చిన ఆ వ్య‌క్తి దురాలోచ‌న క‌నీసం అర్థం చేసుకోలేని అచ్చెన్నాయుడు 'ఆయనే సరిగా ఉంటే పార్టీకి ఈ దుస్థితి వచ్చేది కాదు' అని వ్యాఖ్యానించారు. అందరికీ ఇప్పుడు అదే సమస్యగా మారిందని అన్నారు. ఈ వీడియో/ఆడియోతో వైసీపీ ఓ ఆట ఆడుకుంది. అచ్చెన్నాయుడు ఏవో వివ‌ర‌ణ ఇచ్చినా టీడీపీకి అతి పెద్ద‌న‌ష్టం జ‌రిగిపోయింది.

రాష్ట్ర‌వ్యాప్తంగానే కాదు, సొంతూర్లోనూ అచ్చెన్న నోటి మాట‌తోనే కేసులు ఎదుర్కొన్నాడు. స్వగ్రామం నిమ్మాడ నుంచి వైసీపీ అభ్యర్థిగా కింజ‌రాపు అప్పన్న బరిలోకి దిగ‌డంతో గొడవ మొదలైంది. ఇదే క్రమంలో అప్పన్నకు ఫోన్ చేసిన అచ్చెన్నాయుడు నామినేషన్ వేయొద్దని చెప్పారు. అయితే తనకు టీడీపీ, మన ఫ్యామిలీలో గానీ న్యాయం జరగడం లేదని అప్పన్న చెప్పగా.. ఇప్పుడు నేను అన్నీ దగ్గరుండి చూసుకుంటానని అచ్చెన్న వివరించే ప్రయత్నం చేశారు. అయ్యిందేదో అయిపోయింది, ఇదొక్కసారి నా మాట విను.. సర్పంచ్ పదవి ఏమైనా రాష్ట్రపతి పదవా అంటూ అచ్చెన్నాయుడు అప్ప‌న్న‌తో మాట్లాడిన మాట‌లు వైసీపీకి చేరాయి. బెదిరించార‌ని కేసులు పెట్టారు.

ఏపీ టీడీపీ అధ్యక్షుడు అయి ఉండి, మూడోకంటికి తెలియ‌కుండా వ్య‌వ‌హారాలు చ‌క్క‌బెట్టాల్సిన అచ్చెన్నాయుడు సంభాష‌ణ‌లు.. ఫోన్ రికార్డింగుల‌కి దొరికిపోతున్నాయి. హిడెన్ కెమెరాల‌కీ చిక్కిపోతున్నాడు. ఇదంతా ప్ర‌త్య‌ర్థుల ప‌థ‌క‌మా..? సొంత పార్టీలో వారి ద్రోహ‌మా..? అనేది ప‌క్క‌న‌బెడితే నోటిని అదుపులో పెట్టుకోలేక‌పోవ‌డం, సంయ‌మ‌నంతో మాట్లాడ‌క‌పోవ‌డం అచ్చెన్న కొంప ముంచి టీడీపీకి న‌ష్టం చేకూరుస్తున్నాయి.

First Published:  10 Feb 2023 6:43 AM GMT
Next Story