Telugu Global
Andhra Pradesh

ఉండవల్లిపై టీడీపీ మైండ్ గేమ్ మొదలైందా?

మార్గదర్శిలో జరుగుతున్న అక్రమాలపై మే 14న‌ హైదరాబాద్‌లోని ప్రెస్‌క్లబ్‌లో ఉండవల్లి అరుణ్‌కుమార్‌, టీడీపీ అధికార ప్రతినిధి జీవీరెడ్డికి మధ్య డిబేట్ జరగబోతోంది. ఈ నేప‌థ్యంలో ఉండ‌వ‌ల్లిపై టీడీపీ మైండ్ గేమ్ స్టార్ట్ చేసింది. తన ట్విట్టర్ ఖాతాలో ఆయ‌న‌ గురించి నెగిటివ్‌ ప్రచారం మొద‌లుపెట్టింది.

ఉండవల్లిపై టీడీపీ మైండ్ గేమ్ మొదలైందా?
X

మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ అంటే తెలుగుదేశంపార్టీ భయపడిపోతోంది. ఒకవైపు మార్గదర్శిలో అక్రమాలు జరగలేదని తాము నిరూపిస్తామని ఉండవల్లితో చాలెంజ్‌లు చేస్తూనే, మ‌రో వైపు ఆయ‌న‌పై టీడీపీ మైండ్ గేమ్ మొదలుపెట్టడం విచిత్రంగా ఉంది. మార్గదర్శిలో జరుగుతున్న అక్రమాలపై మే 14న‌ హైదరాబాద్‌లోని ప్రెస్‌క్లబ్‌లో చర్చకు ముహూర్తం నిర్ణయమైంది. ఉండవల్లికి టీడీపీ అధికార ప్రతినిధి జీవీరెడ్డికి మధ్య డిబేట్ జరగబోతోంది. తాజాగా సీనియర్ జర్నలిస్టు కందుల రమేష్ కూడా ఇదే విషయమై ఉండవల్లిని చాలెంజ్ చేశారు.

సరే ఈ చాలెంజ్‌ల‌ సంగతిని పక్కనపెట్టస్తే దానికన్నా ముందే మైండ్ గేమ్ మొదలుపెట్టేసింది. అదేమిటంటే తన ట్విట్టర్ ఖాతాలో ఉండవల్లి గురించి నెగిటివ్‌గా ప్రచారం మొదలుపెట్టింది. మార్గదర్శి, రామోజీరావుపై ఉండవల్లి పోరాటాన్ని చంద్రబాబు నాయుడు అండ్ కో అస్సలు తట్టుకోలేకపోతున్నారు. రేపు సుప్రీంకోర్టు విచారణలో రామోజీ గనుక బుక్కయితే చంద్రబాబు పరిస్థితి చాలా ఘోరంగా ఉంటుంది. అందుకనే ఆ కోపాన్నంతా ఇప్పుడు ఉండవల్లిపైన చూపుతున్నారు.

ఇంతకీ ఆ ట్వీట్లో ఏముందంటే ‘జనానికి కీడు చేస్తున్న పాలన గురించి మాట్లాడడంట, కనీసం తన స్నేహితుడి హత్య గురించి కానీ, ఆ స్నేహితుడి కూతురుపై చేస్తున్న ఆరోపణల గురించి కానీ స్పందించడంట. కేవలం తనకు గిట్టుబాటు అయ్యే అంశాల గురించి మాత్రమే మాట్లాడుతు, జనాల్ని తప్పుదోవపట్టించే ఇలాంటి వాళ్ళని ఏమనాలి’ ? అంటూ ప్రశ్నించారు. ట్వీట్‌కు జతచేసిన ఫొటోలో హత్యకు గురైన వివేకా ఫొటో, సునీతతో పాటు ఉండవల్లి ఫొటోలున్నాయి. ఆ ఫొటోలో ఉండవల్లి నోటికి జిప్పు వేశారు. అయితే ఆ ఫొటోలో ఎక్కడా మార్గదర్శి, రామోజీ ఫొటోలు మాత్రం లేవు.

చంద్రబాబు వ్యతిరేకులను టీడీపీ, ఎల్లో మీడియా ఏ స్థాయిలో వెంటాడుతుందో అందరికీ తెలుసు. అలాంటిది చంద్రబాబుకు వెన్నుదన్నుగా నిలుస్తున్న రామోజీ అక్రమాలపైనే ఉండవల్లి పోరాటం చేస్తుంటే ఇక టీడీపీ ఎందుకు వదిలిపెడుతుంది. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే ఉండవల్లికి సన్నిహితుడు దివంగత ముఖ్యమంత్రి వైఎస్సారే కానీ వివేకా కాదు. వివేకాతోనే సన్నిహితం లేనప్పుడు ఇక ఆయన కూతురు సునీతతో ఏముంటుంది. అయినా సునీతకు యావత్ ఎల్లో మీడియా పూర్తి మద్దతుగా నిలిచిన తర్వాత ఇక ఉండవల్లి మద్దతిస్తే ఎంత‌ ఇవ్వకపోతే ఎంత‌?

First Published:  29 April 2023 6:30 AM GMT
Next Story