Telugu Global
Andhra Pradesh

బ‌రువు త‌గ్గ‌లేదు త‌ల్లీ.. బ‌రువు పెరిగాడు

చంద్రబాబు నాయుడు జైలుకు వచ్చిన సమయంలో 66 కేజీలు బరువు ఉన్నారని, ప్రస్తుతం ఆయన 67 కేజీల బరువు ఉన్నారని డీఐజీ చెప్పారు.

బ‌రువు త‌గ్గ‌లేదు త‌ల్లీ.. బ‌రువు పెరిగాడు
X

స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కుంభకోణంలో అరెస్టయి 34 రోజులుగా రాజమండ్రి సెంట్రల్‌ జైలులో రిమాండ్‌లో ఉన్న టీడీపీ అధినేత చంద్రబాబు ఆరోగ్యంపై జైళ్ల శాఖ డీఐజీ క్లారిటీ ఇచ్చారు. జైలుకు వచ్చిన తర్వాత బాబు బరువు తగ్గారంటూ చేసిన ఆరోపణలు తప్పని చెప్పారు. టీడీపీ వారు ఆరోపణలు చేసినట్టుగా బాబు బరువు తగ్గకపోగా ఒక కేజీ బరువు పెరిగారని వివరించారు. చంద్రబాబు నాయుడు జైలుకు వచ్చిన సమయంలో 66 కేజీలు బరువు ఉన్నారని, ప్రస్తుతం ఆయన 67 కేజీల బరువు ఉన్నారని డీఐజీ చెప్పారు.

చంద్రబాబు జైలుకు వచ్చిన తర్వాత 5 కేజీలు బరువు తగ్గారని, ఇది ఆయన ఆరోగ్య పరిస్థితిపై తీవ్ర ప్రభావం చూపుతుందని భార్య భువ‌నేశ్వ‌రి ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. అంతేకాదు.. జైలు అధికారులు బాబు ఆరోగ్యం గురించి పట్టించుకోవడం లేదని, ఆయనకు సరైన వైద్యం అందించకుండా నిర్లక్ష్యం వహిస్తున్నార‌ని అన్నారు. అయితే.. తాజాగా జైళ్ల శాఖ డీఐజీ దీనిపై క్లారిటీ ఇవ్వడంతో అవ‌న్నీ అబద్ధపు ప్రచారాలేనని తేటతెల్లమైంది.

దీనిపై వైసీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి స్పందిస్తూ.. చంద్రబాబు ఆరోగ్యంపై టీడీపీ అబద్ధపు ప్రచారం చేస్తోందని విమర్శించారు. గురువారం నుంచి ఇదే తరహా ప్రచారం చేస్తోందని, చంద్రబాబుకు స్కిన్‌ ఎలర్జీతో ప్రాణానికే ముప్పని ప్రచారం చేస్తోందని మండిపడ్డారు. అలాంటి తప్పుడు ప్రచారం చేయడానికి సిగ్గుండాలని ఆయన దుయ్యబట్టారు. చంద్రబాబు ఆరోగ్యాన్ని వైద్య బృందం ప్రతిరోజూ పరీక్షిస్తోందని సజ్జల చెప్పారు. అర్జంటుగా చంద్రబాబును బయటికి తీసుకొచ్చేయాలనేది టీడీపీ వారి తాపత్రయమని ఆయన విమర్శించారు.


First Published:  13 Oct 2023 10:23 AM GMT
Next Story