Telugu Global
Andhra Pradesh

బాలకృష్ణను టీడీపీ దూరం పెడుతోందా..?

పార్టీపై భువనేశ్వరి, బ్రాహ్మణి పెత్తనం తీసుకుంటే, వెనక ఉండి నడిపించే వ్యూహకర్తల మాట చెల్లుబాటవుతుంది. అదే బాలయ్య సీన్ లోకి వస్తే ఇలాంటి వారందరికీ దబిడ దిబిడే. అందుకే వారంతా బాలకృష్ణను దూరం పెడుతున్నారు.

బాలకృష్ణను టీడీపీ దూరం పెడుతోందా..?
X

బాలకృష్ణను టీడీపీ దూరం పెడుతోందా..?

చంద్రబాబు అరెస్ట్ తర్వాత టీడీపీ వ్యూహకర్తలు బాలకృష్ణను దూరం పెడుతున్నారు. బాలకృష్ణకు సంబంధించిన వార్తలేవీ చంద్రబాబుకి సన్నిహితంగా ఉండే మీడియాలో హైలైట్ కాకుండా చూస్తున్నారు. మంగళగిరి పార్టీ ఆఫీస్ కి బాలయ్య వెళ్లినా, చంద్రబాబు కుర్చీలో కూర్చుని సమీక్షలు పెడుతున్నా, బాబు అరెస్ట్ బాధతో చనిపోయినవారి కుటుంబాలను పరామర్శిస్తానని చెప్పినా.. ఆ వార్తలకు ప్రాధాన్యం లేనట్టే ఎల్లో మీడియా ప్రవర్తిస్తోంది. టీడీపీ అనుకూల మీడియాలో మాత్రమే బాలకృష్ణ వార్తలు ప్రముఖంగా రావట్లేదంటే ఆ పార్టీ వ్యూహకర్తలు ఏ స్థాయిలో మేనేజ్ చేస్తున్నారో అర్థమవుతోంది.

జైలుముందు బాలయ్య మాట్లాడలేదేం..?

రాజమండ్రి సెంట్రల్ జైలులో చంద్రబాబుని పవన్ కల్యాణ్, బాలకృష్ణ, లోకేష్ ముగ్గురూ పరామర్శించి బయటకొచ్చారు. ప్రెస్ మీట్ పెట్టారు. అక్కడ కేవలం పవన్ కల్యాణ్ మాత్రమే మాట్లాడారు. ఆయన పొత్తు వ్యాఖ్యలే హైలైట్ అయ్యాయి. పవన్ మాట్లాడిన తర్వాత కనీసం బాలయ్యకు ఛాన్స్ కూడా ఇవ్వలేదు. పవన్ పొత్తు నిర్ణయాన్ని టీడీపీ తరపున స్వాగతిస్తున్నామనే మాటను కూడా బాలయ్యతో చెప్పించాలనుకోలేదు. పవన్ మాత్రమే మాట్లాడారు, పవన్ ని మాత్రమే హీరో చేయాలనుకున్నారు. జైలు పరామర్శ ఎపిసోడ్ లో బాలయ్యని జీరో చేసేశారు.

ఎందుకిదంతా..?

చంద్రబాబు అరెస్ట్ తర్వాత అత్యంత దూకుడుగా స్పందించింది బాలకృష్ణ మాత్రమే. సీఎం జగన్ పై తీవ్ర స్థాయిలో మండిపడిన బాలయ్య, నేనొస్తున్నా కార్యకర్తలు ధైర్యంగా ఉండండి అని సందేశమిచ్చారు. బాబు అరెస్ట్ బాధలో చనిపోయినవారి కుటుంబాలను తానే పరామర్శిస్తానన్నారు. మంగళగిరి పార్టీ ఆఫీస్ లో కీలక నాయకులను సమావేశపరచి భవిష్యత్ వ్యూహాలపై చర్చించారు. ఈ ఎపిసోడ్ లు జనంలోకి వెళ్లలేదు కానీ, రాజమండ్రిలో లోకేష్ ప్రెస్ మీట్లకు మాత్రం ప్రాముఖ్యత ఇచ్చారు. అంటే చంద్రబాబు తర్వాత టీడీపీలో ఫోకస్ కావాల్సింది లోకేష్ కానీ బాలకృష్ణ కాదు అనేది ఆ పార్టీ పెద్దల వ్యూహం.

నారా తర్వాత మళ్లీ నారానే..

టీడీపీలో నందమూరి తర్వాత నారా హవా మొదలైంది. ఇప్పుడు నారా తర్వాత మళ్లీ పగ్గాలు నందమూరి చేతుల్లోకి వెళ్లేందుకు కొంతమంది అస్సలు ఇష్టపడటం లేదు. చంద్రబాబు అరెస్ట్ తర్వాత రేపోమాపో నారా లోకేష్ కూడా అరెస్ట్ అయితే అప్పుడు పరిస్థితి ఏంటి..? దీనికి కూడా వారి దగ్గర ఆన్సర్ రెడీగా ఉంది. భువనేశ్వరి లేదా, బ్రాహ్మణి.. వీరిలో ఒకరు లేదా వీరిద్దరూ ప్రజల్లోకి వస్తారని, పాదయాత్రలు చేస్తారని లీకులిస్తున్నారు. అంటే భువనేశ్వరి, బ్రాహ్మణి వరకు ఓకే, బాలయ్య మాత్రం వద్దు అనేది టీడీపీ వ్యూహకర్తల ఆలోచన. భువనేశ్వరి, బ్రాహ్మణి పెత్తనం తీసుకుంటే, వెనక ఉండి నడిపించే వ్యూహకర్తల మాట చెల్లుబాటవుతుంది. అదే బాలయ్య సీన్ లోకి వస్తే ఇలాంటి వారందరికీ దబిడ దిబిడే. ఈ సంధి సమయంలో బాలకృష్ణ పార్టీపై పెత్తనం తీసుకుంటే, మళ్లీ నందమూరి హవా పెరగడం ఖాయం. అది ఇష్టంలేని నారా భజన బృందం వ్యూహాత్మకంగా బాలయ్యను దూరం పెడుతోంది. ఆ విషయంలో ఇప్పటికే సక్సెస్ అయింది.

First Published:  15 Sep 2023 6:30 AM GMT
Next Story