Telugu Global
Andhra Pradesh

లోకేశ్ పాదయాత్రపై టీడీపీలో భిన్నాభిప్రాయాలు.. జగన్‌కే బూస్ట్ ఇస్తుందంటున్న సీనియర్లు

నారా లోకేశ్ ఇంకా చంద్రబాబు కొడుకుగానే ప్రజలకు ఎక్కువగా తెలుసని, అతను ఇంకా నాయకుడిగా నిరూపించుకోవల్సిన అవసరం ఉందని పార్టీలోని సీనియర్లు అభిప్రాయపడుతున్నట్లు తెలుస్తున్నది.

లోకేశ్ పాదయాత్రపై టీడీపీలో భిన్నాభిప్రాయాలు.. జగన్‌కే బూస్ట్ ఇస్తుందంటున్న సీనియర్లు
X

టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ జనవరి 27 నుంచి 4,000 కిలోమీటర్ల పాదయాత్ర మొదలు పెట్టనున్నారు. రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ గెలుపే లక్ష్యంగా ఈ పాదయాత్ర చేయనున్నట్లు లోకేశ్ ఇప్పటికే చెప్పారు. చంద్రబాబు నాయుడు కూడా గెలిచిన తర్వాతే అసెంబ్లీలోకి అడుగు పెడతానని ప్రతిజ్ఞ చేశారు. కొడుకు చేత పాదయాత్ర చేయించడం ద్వారా టీడీపీని అధికారంలోకి తీసుకొని రావడంతో పాటు, భవిష్యత్ నాయకుడిగా ప్రొజెక్ట్ చేయాలని అనుకుంటున్నారు. అయితే పాదయాత్ర విషయంలో చంద్రబాబు తీసుకున్న నిర్ణయంపై పార్టీలో భిన్నాభిప్రాయాలు వెలువుడుతున్నాయి.

నారా లోకేశ్ ఇంకా చంద్రబాబు కొడుకుగానే ప్రజలకు ఎక్కువగా తెలుసని, అతను ఇంకా నాయకుడిగా నిరూపించుకోవల్సిన అవసరం ఉందని పార్టీలోని సీనియర్లు అభిప్రాయపడుతున్నట్లు తెలుస్తున్నది. ముందుగా తాను ప్రత్యక్ష ఎన్నికల్లో గెలిచి, ఒక దఫా ప్రభుత్వంలో భాగస్వామిగా ఉంటే అప్పుడు ప్రజలు అంగీకరించినట్లుగా ఉంటుందంటున్నారు. ముందు లోకేశ్ తన నాయకత్వ లక్షణాలతో జనాలను గెలవాలని.. ఆ తర్వాత పార్టీ బాధ్యతలను భుజాలకు ఎత్తుకోవచ్చని సీనియర్లు అంటున్నారు. మంగళగిరిలో ముందు గెలిస్తే.. అప్పుడు రాష్ట్రమంతటా లోకేశ్‌ను ప్రశ్నించే వారు ఉండరని కూడా సూచిస్తున్నారు.

ఇప్పటి వరకు నారా లోకేశ్ ఎలాంటి రాజకీయ విజయాలు సాధించలేదనే విషయాన్ని వాళ్లు గుర్తు చేస్తున్నారు. గతంలో ఏపీలో పాదయాత్రలు చేసిన వాళ్లు అప్పటికే నాయకులుగా తమను తాము నిరూపించుకున్నారు. వైఎస్ఆర్ పాదయాత్ర చేసే సమయానికి మూడు దశాబ్దాల రాజకీయ అనుభవం ఉంది. అప్పటికే ఆయన ప్రతిపక్ష నాయకుడి హోదాలో రాష్ట్ర మంతటా పరిచయం ఉంది. అంతకు ముందు మంత్రి పదవులు చేపట్టడంతో పాటు, ఎంపీగా కూడా పని చేశారు. కాంగ్రెస్‌లో వైఎస్ఆర్ తనకుంటూ ఒక ప్రత్యేక ఇమేజీని డెవలప్ చేసుకున్నారు.

ఇక చంద్రబాబు రెండు సార్లు సీఎంగా పని చేశారు. ఎన్నో రాజకీయ సంక్షోభాలను చవి చూశారు. ఏపీలో మూడో సారి టీడీపీని అధికారంలోకి తీసుకొని రావడానికి పాదయాత్ర చేసి విజయం సాధించారు. వైఎస్ జగన్ పాదయాత్ర చేసే సమయానికే తనను తాను నిరూపించుకున్నారు. తండ్రి చనిపోయిన తర్వాత సోనియా గాంధీ లాంటి వ్యక్తిని ఎదుర్కొని ఓదార్పు యాత్ర చేశారు. 2014 అసెంబ్లీ ఎన్నికల్లో భారీగా ఓట్లు సంపాదించారు. 67 మంది ఎమ్మెల్యేలను గెలిపించి బలమైన ప్రతిపక్ష నాయకుడిగా నిలిచారు. ఆనాడు చంద్రబాబు ఎన్ని ఆటంకాలు సృష్టించినా.. సుదీర్ఘ పాదయాత్ర చేశారు. దీంతో ప్రజలు 2019లో అతడికి బ్రహ్మరథం పట్టారు.

వైఎస్ఆర్, జగన్, చంద్రబాబుతో పోలిస్తే నారా లోకేశ్ రాజకీయాల్లో సాధించింది ఏమీ లేదు. పైగా అతడికి ప్రజల్లోకి వెళ్లిన అనుభవం కూడా లేదని సీనియర్లు వాదిస్తున్నారు. ఆయన రాజకీయాలు ఇంకా నేర్చుకునే వయసులోనే ఉన్నారు. కానీ ఇప్పుడు పాదయాత్ర వంటి పెద్ద పనిని భుజాన వేసుకుంటే పార్టీకి లాభం చేకూరే అవకాశాలు లేవని సీనియర్లు వాదిస్తున్నారు. పైగా లోకేశ్ పాదయాత్ర చేస్తే వైఎస్ జగన్‌కే బూస్ట్ ఇస్తుందని అంటున్నారు.

ప్రస్తుతం వైఎస్ జగన్ ప్రభుత్వంపై ఉన్న వ్యతిరేకతను చంద్రబాబు పాదయాత్ర చేస్తే చక్కగా ఉపయోగించుకోవచ్చు. అలా కాకుండా లోకేశ్ పాదయాత్ర చేస్తే జగన్ ముందు తేలిపోతారు. ప్రజలు కూడా లోకేశ్‌ను జగన్‌తో పోల్చి చూసుకుంటారు. తప్పకుండా ఈ విషయంలో జగనే మెరుగైన నేతగా కనపడతారు. ఇది టీడీపీకి పెద్ద మైనస్‌గా మారుతుంది. దీని బదులు చంద్రబాబే పాదయాత్ర లేదా బస్సు యాత్ర చేయడం వల్ల టీడీపీకి మేలు జరుగుతుందని పార్టీ నేతలు భావిస్తున్నారు. లోకేశ్‌ను ముందు పెట్టి ఎన్నికలకు వెళ్లడం అనేది వ్యూహాత్మక తప్పిదం అవుతుందని కూడా అంటున్నారు.

2024 అసెంబ్లీ ఎన్నికలు అసలే టీడీపీకి జీవన్మరణ సమస్యగా ఉన్నది. ఇలాంటి సమయంలో టీడీపీ ఓడిపోతే మళ్లీ ఎప్పుడు గెలుస్తుందో కూడా తెలియని పరిస్థితి. ఇంత క్లిష్ట పరిస్థితిలో వైసీపీకి మేలు కలిగించేలా చంద్రబాబు ఇలా లోకేశ్‌ను ముందు పెట్టి రాజకీయం చేయడం పట్ల టీడీపీ శ్రేణులు భయపడుతున్నాయి. ఈ ఒక్కసారికి లోకేశ్‌ను పక్కన పెట్టి చంద్రబాబే రంగంలోకి దిగాలని కోరుతున్నాయి. కానీ, ఇప్పటికే రూట్ మ్యాప్ సహా పాదయాత్ర కన్ఫార్మ్ అయిన నేపథ్యంలో చంద్రబాబు వెనక్కి తగ్గుతారనేది అత్యాశే అనుకోవాలి.

First Published:  30 Nov 2022 3:06 AM GMT
Next Story