Telugu Global
Andhra Pradesh

ఎంపీ అభ్యర్థుల కోసం టీడీపీ అన్వేషణ

ఏపీలోని 25 సీట్లలో కనీసం 10 స్థానాల్లో టీడీపీకి అభ్యర్థులు కరువైనట్లు తెలుస్తున్నది. అందుకే పాతిక సీట్లు గెలవాలనే లక్ష్యాని కంటే ముందు అభ్యర్థులను అన్వేషించాలని సీనియర్లు సూచిస్తున్నారు.

ఎంపీ అభ్యర్థుల కోసం టీడీపీ అన్వేషణ
X

రాబోయే అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల్లో ప్రతిపక్ష టీడీపీ భారీ టార్గెట్ పెట్టుకుంది. అధికార వైసీపీ 175 అసెంబ్లీ సీట్లు గెలవాలని సీఎం జగన్ బహిరంగంగానే ప్రకటించారు. అయితే టీడీపీ అధినేత చంద్రబాబు ఇటీవల జరిపిన సమీక్షలో కనీసం 160 సీట్లు గెలవాలని.. వైసీపీని చిత్తు చిత్తుగా ఓడించాలని చెప్పారు. ఇక ఎంపీ సీట్లు క్లీన్ స్వీప్ చేసి కేంద్రంలో నిర్ణయాత్మక శక్తిగా మారాలని చంద్రబాబు లక్ష్యంగా పెట్టారు. బాబు చెప్పిన టార్గెట్ విని సీనియర్ నాయకులే ఆశ్చర్యపోతున్నారు. మనం లక్ష్యం ఎలాగైనా పెట్టుకోవచ్చు. కానీ అంతకు తగిన అభ్యర్థులు ఉన్నారా? లేరా? అని చూసుకోవద్దాని వ్యాఖ్యానిస్తున్నారు. అసెంబ్లీ టికెట్ల కోసం టీడీపీలో విపరీతమైన డిమాండ్ ఉన్నది. కాబట్టి 175 సెగ్మెంట్లకు అభ్యర్థులు ఈజీగానే దొరుకుతారు. కానీ లోక్‌సభకు పోటీ చేయడానికే సరైన క్యాండిడేట్లు దొరకడం లేదు.

ఏపీలోని 25 సీట్లలో కనీసం 10 స్థానాల్లో టీడీపీకి అభ్యర్థులు కరువైనట్లు తెలుస్తున్నది. అందుకే పాతిక సీట్లు గెలవాలనే లక్ష్యాని కంటే ముందు అభ్యర్థులను అన్వేషించాలని సీనియర్లు సూచిస్తున్నారు. 2024 సార్వత్రిక ఎన్నికల్లో తప్పకుండా ప్రాంతీయ పార్టీలు నిర్ణయాత్మక శక్తులుగా మారతాయి. ఈ సారి బీజేపీ, కాంగ్రెస్‌కు కూడా తగినన్ని సీట్లు రావని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. అందుకే పాతిక సీట్లు వస్తే ఢిల్లీలో చక్రం తిప్పవచ్చు. కేసీఆర్ బీఆర్ఎస్ పార్టీ పెట్టడం వెనుక కారణం కూడా ఇదే. ప్రస్తుతం ఏపీలోని 25 సీట్లకు గాను 22 సీట్లలో వైసీపీ అభ్యర్థులే గెలిచారు. టీడీపీకి కేవలం ముగ్గురు ఎంపీలే ఉన్నారు. అలాంటి సమయంలో ఒకేసారి పాతిక సీట్లు గెలవాలనుకోవడం అత్యాశే. ఇక ప్రస్తుతం శ్రీకాకుళం ఎంపీగా ఉన్న కింజారపు రామ్మోహన్ నాయుడు వచ్చే ఎన్నికల్లో ఎమ్మెల్యేగా పోటీ చేయాలని భావిస్తున్నారు. విజయనగరం మాజీ ఎంపీ అశోక్ గజపతి రాజు కూడా ఈ సారి ఎంపీగా కాకుండా అసెంబ్లీ ఎన్నికల బరిలో ఉండటానికి ఆసక్తి చూపిస్తున్నారు.

సిట్టింగ్ ఎంపీలే ఆ స్థానాల్లో తిరిగి పోటీ చేయడానికి ఆసక్తి చూపించడం లేదు. దీంతో పాటు మరికొన్ని స్థానాల్లో గతంలో ఎంపీలుగా పోటీ చేసిన అభ్యర్థులు అసెంబ్లీ టికెట్లు కోరుతున్నారు. టీడీపీకి రాయలసీమతో పాటు ఉభయ గోదావరి జిల్లాల్లో సరైన అభ్యర్థులు లేకుండా పోయారు. కాకినాడ, తిరుపతిలో గతంలో ఉన్న బలమైన అభ్యర్థులు ఇప్పుడు టీడీపీకి లేరు. కాకినాడ నుంచి పోటీ చేసిన చలమలశెట్టి సునీల్ ఓడిపోయిన వెంటనే వైసీపీలో చేరారు. ఇక తిరుపతి నుంచి పోటీలో ఉండే సినీనటుడు శివప్రసాద్ మరణంతో అక్కడ టీడీపీకి సరైన అభ్యర్థి దొరకడం లేదు. చంద్రబాబు సొంత జిల్లాలోని చిత్తూరు ఎంపీ స్థానానికి కూడా అభ్యర్థిని వెతుక్కుంటున్నారు. నర్సారావుపేట నుంచి 2019లో పోటీ చేసిన రాయపాటి సాంబశివరావు ఈ సారి పోటీకి ఆసక్తి చూపించడం లేదు. బాపట్ల నుంచి పోటీ చేసి ఓడిపోయిన మాల్యాద్రి శ్రీరామ్ ప్రస్తుతం రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు. కడప నుంచి గతంలో మాజీ మంత్రి ఆదినారాయణరెడ్డిని నిలబెట్టారు. కానీ ఓడిపోయిన తర్వాత ఆయన బీజేపీలోకి జంప్ అయ్యారు.

కర్నూలు నుంచి కోట్ల సూర్యప్రకాశ్ రావు 2019లో టీడీపీ తరపున పోటీ చేసి ఓడిపోయారు. ఈ సారి వయోభారం దృష్ట్యా పోటీకి ఆసక్తి చూపించడం లేదని తెలుస్తున్నది. మొత్తానికి టీడీపీకి 10 కీలక నియోజకవర్గాల్లో ఎంపీ అభ్యర్థులు దొరకడం లేదు. అధినేత చంద్రబాబు ఇప్పటికే ఈ విషయంపై ఫోకస్ పెట్టారు. అవసరం అయితే పార్టీ నుంచి వెళ్లిపోయిన మాజీ ఎంపీలను పిలిచి టికెట్లు ఇవ్వాలని అనుకుంటున్నారు. కానీ వాళ్లు ఇప్పటికే అధికార బీజేపీలో ఉన్నారు. వచ్చేసారైనా టీడీపీ గెలుస్తుందో లేదో అనే అనుమానాలు వారికి ఉన్నాయి. దీంతో వాళ్లు తిరిగి టీడీపీలో చేరడానికి సంశయిస్తున్నారు. మొత్తానికి వచ్చే ఎన్నికల్లో పాతిక ఎంపీ సీట్లు గెలవాలని పెట్టుకున్న చంద్రబాబు లక్ష్యం అభ్యర్థుల వెతుకులాట దగ్గరే ఆగిపోతుందని పార్టీలోనే చర్చించుకుంటున్నారు.

First Published:  8 Oct 2022 6:08 AM GMT
Next Story