Telugu Global
Andhra Pradesh

నా దెబ్బకి భయపడి వైసీపీ జిల్లా అధ్యక్షుల్ని మార్చేశారు..

చంద్రబాబు తన కర్నూలు పర్యటన గురించి చెప్పుకుంటున్న గొప్పలు మరీ వింతగా, విడ్డూరంగా ఉన్నాయి. జగన్ తనని చూసి భయపబడ్డారని, 8 జిల్లాల అధ్యక్షుల్ని మార్చేశారని చెప్పుకోవడంతో సోషల్ మీడియాలో జోకులు పేలుతున్నాయి.

నా దెబ్బకి భయపడి వైసీపీ జిల్లా అధ్యక్షుల్ని మార్చేశారు..
X

చంద్రబాబు మళ్లీ కామెడీ చేశారు. కర్నూలు జిల్లాలో తన పర్యటనకు అపూర్వ, అనూహ్య స్పందన వచ్చిందని ఆమధ్య గొప్పలు చెప్పుకున్న బాబు, ఇప్పుడు ఆ పర్యటన ఖాతాలో మరో విజయాన్ని వేసుకున్నారు. కర్నూలులో తన పర్యటన చూసి భయపడి, జగన్ వైసీపీ జిల్లా అధ్యక్షుల్ని, సమన్వయకర్తల్ని మార్చేశారన్నారు. తన వ్యూహాలు చూసి బెదిరిపోయి, జగన్ పార్టీ పదవుల విషయంలో సడన్ గా నిర్ణయం తీసుకున్నారని చెప్పారు.

కర్నూలులో అంత సీన్ జరిగిందా..?

వాస్తవానికి కర్నూలులో చంద్రబాబుకి ఊహించని రీతిలో స్పందనేమీ రాలేదు, ఆ మాటకొస్తే ఆయన కర్నూలు పర్యటన తర్వాత డోన్ మాజీ ఎమ్మెల్యే కేఈ ప్రభాకర్ పెద్ద షాకిచ్చారు. డోన్ టీడీపీ టికెట్ తనని కాదని ఎవరికైనా ఇస్తే పార్టీకి అధోగతేనని తేల్చి చెప్పారు కేఈ. కొన్నిచోట్ల చంద్రబాబు సభలకు లాయర్లు అడ్డుతగిలారు. కర్నూలుని న్యాయరాజధానిగా ఒప్పుకోవాల్సిందేనన్నారు. అభివృద్ధి వికేంద్రీకరణకు అడ్డుపడే బాబు కర్నూలులో ఎలా పర్యటిస్తారని నిలదీశారు. పోనీ ఈ విషయాలన్నీ ఆయన సొంత మీడియా కవర్ చేయ‌క‌పోయినా, ఇప్పుడు చంద్రబాబు తన పర్యటన గురించి చెప్పుకున్న గొప్పలు మరీ వింతగా, విడ్డూరంగా ఉన్నాయి. జగన్ తనని చూసి భయపబడ్డారని, 8 జిల్లాల అధ్యక్షుల్ని మార్చేశారని చెప్పుకోవడంతో సోషల్ మీడియాలో జోకులు పేలుతున్నాయి.

175మనవే..

175 నియోజకవర్గాల్లో వైసీపీ గెలుస్తుందని, ఆ దిశగా పార్టీ నేతలు, కార్యకర్తలు కృషి చేయాలంటూ ఇటీవల చాలా సందర్భాల్లో సీఎం జగన్ చెబుతున్నారు. ఇప్పుడు చంద్రబాబు కూడా 175 టీడీపీవే అంటున్నారు. పులివెందుల సహా ఏపీలోని 175 నియోజకవర్గాల్లో వైసీపీకి గుండు సున్నా తప్పదని అన్నారు చంద్రబాబు. మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన ఆక్వా రైతుల సదస్సులో విజయం తమదేనంటూ ధీమా వ్యక్తం చేశారాయన. తన 40 ఏళ్ల రాజకీయ జీవితంలో ఎన్నడూ చూడని స్పందన ఇటీవల కర్నూలు పర్యటనలో చూశానని పెద్ద ఎత్తున యువత, ప్రజలు తరలివచ్చారని, ఆ దెబ్బతో వైసీపీలో ప్రకంపనలు ప్రారంభమయ్యాయని చెప్పారు చంద్రబాబు.

First Published:  24 Nov 2022 11:00 AM GMT
Next Story