Telugu Global
Andhra Pradesh

ప్రత్యేక హోదాకు సున్నా చుట్టింది చంద్రబాబే..

ప్రత్యేక హోదా కావాలంటూ ప్రజలు ఆందోళనలకు దిగితే అరెస్టులు చేయించారు. విచిత్రమైన వ్యాఖ్యలు చేశారు. ప్రత్యేక హోదా ఏమైనా సంజీవినా అంటూ ప్రశ్నించారు.

ప్రత్యేక హోదాకు సున్నా చుట్టింది చంద్రబాబే..
X

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రానికి ప్రత్యేక హోదా వద్దంటూ తేల్చేసింది టీడీపీ అధ్య‌క్షుడు నారా చంద్రబాబు నాయుడే. తన ప్రభుత్వ హయాంలో రాష్ట్రానికి ప్రత్యేక హోదా బదులు ప్రత్యేక ప్యాకేజీ ఇస్తామంటే అంగీకరించింది ఆయనే. అప్పటి కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్‌ జైట్లీతో 2016లో జరిగిన సమావేశంలో ప్రత్యేక ప్యాకేజీని చంద్రబాబు స్వాగతించారు. ఆ విషయాన్ని ఆయన సమావేశానంతరం స్వయంగా ప్రకటించారు. ప్రత్యేక ప్యాకేజీ ప్రకటించినందుకు ప్రధాని నరేంద్ర మోడీ ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలుపుతూ శాసనసభలో తీర్మానం కూడా చేశారు.

ప్రత్యేక హోదా కావాలంటూ ప్రజలు ఆందోళనలకు దిగితే అరెస్టులు చేయించారు. విచిత్రమైన వ్యాఖ్యలు చేశారు. ప్రత్యేక హోదా ఏమైనా సంజీవినా అంటూ ప్రశ్నించారు. ప్రత్యేక హోదా ఉన్నా కూడా ఈశాన్య రాష్ట్రాలు ఏం అభివృద్ధి సాధించాయని ద‌బాయించారు. హోదా వల్ల అన్నీ రావని, కోడలు మగపిల్లాడిని కంటానంటే అత్త వద్దంటుందా అని కూడా అన్నారు. హోదా కన్నా మెరుగైన ప్యాకేజీని కేంద్రం ప్రకటించిందని నమ్మించే ప్రయత్నం చేశారు. 2014 ఎన్నికల ప్రచారంలో రాష్ట్రానికి పదిహేనేళ్లు ప్రత్యేక హోదా ఇవ్వాలని నరేంద్ర మోడీని కోరుతానని చెప్పారు. అటువంటిది ఆయన ప్రత్యేక ప్యాకేజీని స్వాగతించి రాష్ట్రానికి అన్యాయం చేశారు.

వైఎస్సార్‌ కాంగ్రెస్‌ మాత్రం మొదటి నుంచీ ఒకే వైఖరిపై ఉంది. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ప్రత్యేక హోదాను డిమాండ్‌ చేసింది. ఆందోళనలు కూడా చేపట్టింది. ఆ సమయంలో చంద్రబాబు నాయుడు ఆ ఆందోళనలను తీవ్రంగా వ్యతిరేకించారు. ప్రత్యేక హోదా వల్ల ఒరిగేదేమీ లేదంటూ ఆందోళనకారులను అరెస్టు చేయించారు. ఆ తర్వాత ఎన్డీఏ నుంచి విడిపోయి ప్రత్యేక మోదా కావాలంటూ డిమాండ్‌ చేశారు. తన ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ముఖ్యమంత్రి హోదాలో వైఎస్‌ జగన్‌ ప్రధాని నరేంద్ర మోడీని, కేంద్ర‌ ప్రభుత్వ పెద్దలను కలిసినప్పుడు ప్రత్యేక హోదా ఇవ్వాలని కోరుతూ వస్తున్నారు. ఆయన ప్రత్యేక హోదాను ఏనాడూ విడనాడలేదు,

చంద్రబాబు నాయుడు ప్రస్తుతం బీజేపీతో పొత్తు పెట్టుకున్నారు. పొత్తుకు ఆయన పెట్టిన షరతులు ఏమైనా ఉన్నాయా అంటే ఏమీ లేవనే చెప్పాలి. రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇస్తామనే హామీని ఆయన బీజేపీ నుంచి పొందారా అంటే పొందలేదు. రాష్ట్రానికి ఏ విధమైన సహాయం చేస్తారనే విషయంపై ఏ విధమైన హామీని కూడా పొందకుండానే ఆయన పొత్తుకు సిద్ధపడ్డారు. ఇప్పుడు చంద్రబాబు ప్రత్యేక హోదా కావాలని డిమాండ్‌ చేయగలరా? ఆయన ఆ పరిస్థితిలో లేరు. అధికారంలోకి వస్తే ప్రత్యేక హోదాను సాధిస్తామనే హామీని ప్రజలకు ఇవ్వగలరా? అదీ చేయలేరు.

First Published:  20 March 2024 11:08 AM GMT
Next Story