Telugu Global
Andhra Pradesh

అడ్రస్ లేని టీడీపీ..వ్యూహాత్మకమేనా..?

మరి ఇంతకాలం ఆందోళనలకు తెరవెనుక నుండి మద్దతిచ్చిన చంద్రబాబు నాయుడు, టీడీపీ సీనియర్లలో ఎవరూ ఎందుకని పార్టిసిపేట్ చేయలేదు..? ఆందోళనకారుల ప్లాన్ ప్రకారం మూడు రోజుల ఆందోళన కార్యక్రమాలు చాలా కీలకం.

అడ్రస్ లేని టీడీపీ..వ్యూహాత్మకమేనా..?
X

ఏకైక రాజధానిగా అమరావతి మాత్రమే ఉండాలనే డిమాండుతో ఆందోళనలు ఢిల్లీకి మారాయి. జంతర్ మంతర్ దగ్గర 17, 18,19 తేదీల్లో ఆందోళనలు చేయాలని అమరావతి జేఏసీ నేతలు డిసైడ్ చేశారు. దాని ప్రకారమే సుమారు 1500 మంది అమరావతి ప్రాంతం నుండి ఢిల్లీకి చేరుకున్నారు. జంతర్ మంతర్ దగ్గర శనివారం ఏర్పాటు చేసిన సమావేశంలో కాంగ్రెస్, వామపక్షాలు, జనసేనతో పాటు వైసీపీ తిరుగుబాటు ఎంపీ రఘురామకృష్ణంరాజు కూడా పాల్గొని మాట్లాడారు. అయితే తెలుగుదేశం పార్టీ నేతలు మాత్రం ఎక్కడా కనబడలేదు.

అమరావతి ఆందోళనను ఢిల్లీస్థాయికి తీసుకెళ్ళాం అనిపించుకునేందుకు ఆందోళనకారులు మూడు రోజులు జంతర్ మంతర్ దగ్గర ఆందోళనలకు ప్లాన్ చేశారు. దాని ప్రకారమే వివిధ పార్టీల నేతలతో ముందే మాట్లాడుకున్నారు. అనుకున్నట్లుగానే జంతర్ మంతర్ సమావేశానికి కాంగ్రెస్ అధ్యక్షుడు గిడుగు రుద్రరాజు, సీనియర్ నేత జేడీ శీలం, సుంకర పద్మశ్రీ, సీపీఐ తరపున డీ. రాజా, సీపీఎం తరపున కేంద్ర కమిటీ సభ్యుడు అరుణ్ కుమార్, జనసేన నుంచి హరిప్రసాద్ హాజరయ్యారు. బీజేపీ కిసాన్ సెల్ నేతలు కూడా సమావేశంలో మాట్లాడారు.

మరి ఇంతకాలం ఆందోళనలకు తెరవెనుక నుండి మద్దతిచ్చిన చంద్రబాబు నాయుడు, టీడీపీ సీనియర్లలో ఎవరూ ఎందుకని పార్టిసిపేట్ చేయలేదు..? ఆందోళనకారుల ప్లాన్ ప్రకారం మూడు రోజుల ఆందోళన కార్యక్రమాలు చాలా కీలకం. మరింతటి కీలక దశలో అసలు టీడీపీ భాగస్వామ్యే లేకుండా పోవటం చాలా ఆశ్చర్యంగానే ఉంది.

ఇక్కడే అందరిలోనూ అనుమానాలు పెరిగిపోతున్నాయి. వ్యూహాత్మకంగానే టీడీపీ గైర్హాజరైనట్లు అనిపిస్తోంది. అమరావతి డిమాండ్ వినిపించిన కారణంగా రాయలసీమ, ఉత్తరాంధ్రలో టీడీపీకి బాగా డ్యామేజ్ అయ్యిందనే ఫీడ్ బ్యాక్ వచ్చిందట చంద్రబాబుకు. అందుకనే కొంతకాలంగా అమరావతి డిమాండ్ ను వినిపించటమే మానేశారు. చంద్రబాబు ఆదేశాల ప్రకారమే తమ్ముళ్ళు కూడా మాట్లాడటంలేదు. జరిగిన డ్యామేజీని కంట్రోల్ చేసుకోవటంలో భాగంగానే జంతర్ మంతర్లో తమ్ముళ్ళు కనబడలేదని ఇన్ సైడ్ టాక్.

First Published:  18 Dec 2022 5:18 AM GMT
Next Story