Telugu Global
Andhra Pradesh

ష్యూరిటీ, గ్యారెంటీ.. బహిరంగ లేఖతో బాబు మరింత కామెడీ

ఇప్పటికే స్త్రీ శక్తి పేరుతో మినీ మేనిఫెస్టో ప్రకటించిన చంద్రబాబు, దసరాకు పూర్తి స్థాయి మేనిఫెస్టో ప్రకటిస్తామన్నారు. టీడీపీ పూర్తి మేనిఫెస్టో వస్తే అధికార వైసీపీకి వణుకు పుడుతుందన్నారు.

ష్యూరిటీ, గ్యారెంటీ.. బహిరంగ లేఖతో బాబు మరింత కామెడీ
X

చంద్రబాబు నోటి వెంట ష్యూరిటీ, గ్యారెంటీ అనే పదాలు వినాలంటేనే కాస్త కామెడీగా ఉంటుందని అంటుంటాయి వైరి వర్గాలు. అలాంటి చంద్రబాబు ఆ ష్యూరిటీ, గ్యారెంటీపై ఏకంగా ప్రచారమే మొదలు పెట్టారు. తాను సంతకాలు చేసిన ష్యూరిటీ బాండ్ పేపర్ ని రాష్ట్ర ప్రజలందరికీ పంచి పెట్టే కాకర్యక్రమం చేపట్టారు బాబు. ష్యూరిటీ బాండ్ అంటే దానికేదో విలువ ఉంటుందనుకుంటే పొరపాటే, చంద్రబాబు సంతకం ఉన్న ఓ కరపత్రం అది. సెప్టెంబర్-1నుంచి ‘బాబు ష్యూరిటీ - భవిష్యత్‌కు గ్యారెంటీ’ కార్యక్రమం మొదలవుతుంది. ఈ మేరకు ఆయన రాష్ట్ర ప్రజలకు ఓ బహిరంగ లేఖ రాయడం విశేషం.

ప్రజలు భాగస్వాములు కావాలి..

45రోజులపాటు ష్యూరిటీ - గ్యారెంటీ పథకం డిజైన్ చేశారు. ఈ కార్యక్రమంలో భాగంగా టీడీపీ నాయకులు ప్రజల వద్దకు వెళ్లి తాము అధికారంలోకి వస్తే చేపట్టబోయే కార్యక్రమాలను వివరిస్తారు. ఒక్కో కుటుంబానికి ఏడాదికి ఎంత లబ్ధి చేకూరుతుందనే విషయాన్ని స్పష్టంగా చెబుతారు. ఇలా తమ ప్రతినిధులు ప్రజల వద్దకు వచ్చినప్పుడు వారి సహకారం, భాగస్వామ్యం కూడా కావాలంటూ చంద్రబాబు లేఖ రాశారు. టీడీపీ కార్యకర్తలు నేతలు రాష్ట్రంలో దాదాపు 3వేలమందిని నేరుగా కలుస్తారని అంటున్నారు చంద్రబాబు.

టీడీపీ గుర్తు ‘సైకిల్’ రెండు చక్రాల్లో ఒకటి సంక్షేమానికి, మరొకటి అభివృద్ధికి ప్రతీక అని అన్నారు చంద్రబాబు. 2014 - 19 మధ్య రెండంకెల వృద్ధితో దేశంలో అగ్రగామిగా ఉన్న నవ్యాంధ్రను.. నేటి పాలకులు నాలుగున్నరేళ్లలో సర్వ నాశనం చేశారని మండిపడ్డారు. భస్మాసుర పాలనలో అన్ని వర్గాల ప్రజలు అల్లాడిపోతున్నారని ఆరోపించారు. రైతులకు గిట్టుబాటు ధరలు లేవని, మహిళా సాధికారత, భద్రత అటకెక్కిందని అన్నారు. రాష్ట్ర ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలకు పరిష్కారం చూపేందుకే ‘భవిష్యత్‌ కు గ్యారెంటీ’ పేరుతో పథకాలను ప్రకటించామని అంటున్నారు చంద్రబాబు.

దసరాకు మేనిఫెస్టో..

ఇప్పటికే స్త్రీ శక్తి పేరుతో మినీ మేనిఫెస్టో ప్రకటించిన చంద్రబాబు, దసరాకు పూర్తి స్థాయి మేనిఫెస్టో ప్రకటిస్తామన్నారు. టీడీపీ పూర్తి మేనిఫెస్టో వస్తే అధికార వైసీపీకి వణుకు పుడుతుందన్నారు.

First Published:  31 Aug 2023 4:15 PM GMT
Next Story