Telugu Global
Andhra Pradesh

జనసేన, కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్, సినీ నటులపై స్పందించొద్దు

కాంగ్రెస్ గురించి కూడా తప్పుగా మాట్లాడొద్దు, అసలు స్పందించనే వద్దు అంటూ టీడీపీ నియమాలు పెట్టడమే ఇక్కడ విశేషం. సినిమా నటుల విషయంలో కూడా ఇలాంటి కండిషన్ పెట్టడం మరో విశేషం.

జనసేన, కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్, సినీ నటులపై స్పందించొద్దు
X

సోషల్ మీడియాలో రాజకీయ నాయకులు, కార్యకర్తలు చేసేది, చేయాల్సింది.. ఆత్మస్తుతి, పరనింద. అయితే అప్పుడప్పుడు మరికొన్ని విషయాలపై కూడా వారు స్పందించాల్సి రావొచ్చు. ఎన్నికల వేళ అలాంటి స్పందనలు కాస్త అదుపులో పెట్టుకోవాలని పార్టీ కార్యకర్తలకు సూచిస్తోంది టీడీపీ. ఏయే విషయాలపై స్పందించాలి, ఎలాంటి వాటికి దూరంగా ఉండాలో చెబుతూ ఓ లిస్ట్ విడుదల చేసింది. ఈ మూడు నెలలు టీడీపీకి మద్దతుగా సోషల్ మీడియాలో పని చేద్దామనుకునే వారికి, సోషల్ మీడియాను తమ భుజాలపై మోస్తున్న వారికి, సోషల్ మీడియా ద్వారా పార్టీకి ఉపయోగపడాలనుకునేవారికి సూచనలు అంటూ.. టీడీపీ అధికారిక ట్విట్టర్ అకౌంట్ లో సుదీర్ఘ పోస్ట్ పెట్టించారు చంద్రబాబు.


ఆ పని మాత్రం చేయొద్దు..

గతంలో టీడీపీ ప్రభుత్వంలో జరిగిన పనుల్ని పొగడండి, లేదా ఇప్పుడు వైసీపీ హయాంలో తీసుకుంటున్న నిర్ణయాలను విమర్శించండి.. అంతవరకే పరిమితం కండి అంటూ టీడీపీ సానుభూతి పరులకు పార్టీ దిశా నిర్దేశం చేసింది. పొరపాటున కూడా జనసేన, కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్, సినీ నటులపై స్పందించవద్దని స్పష్టం చేసింది. జనసేనలో ఆల్రడీ పొత్తులో ఉన్నాం కాబట్టి.. సీట్ల సర్దుబాటు వంటి విషయాలను అధిష్టానాలకు, అధినేతలకు వదిలేసి.. సోషల్ మీడియా యాక్టివిస్ట్ లు కేవలం పార్టీ ప్రచారం కోసమే పనిచేయాలని, అలాంటి సందేశాలనే సోషల్ మీడియాలో ఉంచాలని సూచించారు.

పోనీ జనసేన అంటే టీడీపీతో పొత్తులో ఉంది, బీజేపీ జనసేనతో పొత్తులో ఉంది. ఆ రెండు పార్టీల గురించి అస్సలు మాట్లాడొద్దు అంటే దానికో అర్థముంది. మధ్యలో కాంగ్రెస్ గురించి కూడా తప్పుగా మాట్లాడొద్దు, అసలు స్పందించనే వద్దు అంటూ టీడీపీ నియమాలు పెట్టడమే ఇక్కడ విశేషం. సినిమా నటుల విషయంలో కూడా ఇలాంటి కండిషన్ పెట్టడం మరో విశేషం. ఎక్కడ ఏ నటుడి ఫ్యాన్స్ హర్ట్ అయినా అంతిమంగా పార్టీకి నష్టం జరుగుతుందని అంటున్నారు. అందుకే అలాంటి ప్రయత్నాలు కూడా వద్దని వారిస్తున్నారు. ఎన్నికల వేళ సోషల్ మీడియా పోస్టింగ్ ల విషయంలో టీడీపీ మరింత జాగ్రత్తగా ఉండబోతోందనమాట.

First Published:  26 Dec 2023 11:18 AM GMT
Next Story