Telugu Global
Andhra Pradesh

అలా అడిగిన రోజే పెద్ద అవ‌మానంగా భావించాం - కేశినేని శ్వేత సంచ‌ల‌న వ్యాఖ్య‌లు

ఎంపీగా రెండుసార్లు గెలిచిన ప్రజల మనిషి అయిన తన తండ్రిని తీవ్రంగా అవమానించారని ఈ సందర్భంగా కేశినేని శ్వేత వ్యాఖ్యానించారు.

అలా అడిగిన రోజే పెద్ద అవ‌మానంగా భావించాం - కేశినేని శ్వేత సంచ‌ల‌న వ్యాఖ్య‌లు
X

విజయవాడ ఎంపీ కేశినేని నాని కుమార్తె కేశినేని శ్వేత సోమవారం సంచలన వ్యాఖ్యలు చేశారు. కేశినేని చిన్ని తమ ఫ్యామిలీ మెంబర్‌ కాదని తన చిన్నప్పుడే భావించినట్టు ఆమె కుండబద్దలు కొట్టినట్టు చెప్పారు. కొంతమంది గురించి మాట్లాడి తన స్థాయిని తగ్గించుకోలేనని అన్నారు. కొంతమందికి మోరల్స్‌ అనేవి ఉండవని తెలిపారు. అలాంటివారి గురించి మాట్లాడి తన టైమ్‌ వేస్ట్‌ చేసుకోనని స్పష్టం చేశారు. విజయవాడ 11వ వార్డు కార్పొరేటర్‌గా ఉన్న కేశినేని శ్వేత.. తన తండ్రి కేశినేని నాని ప్రకటించిన విధంగానే సోమవారం తన కార్పొరేటర్‌ పదవికి రాజీనామా చేశారు. దీని ఆమోదం అనంతరం తెలుగుదేశం పార్టీకి కూడా రాజీనామా చేయనున్నట్టు ఆమె ప్రకటించారు.

టీడీపీ పెద్దల తీరును తప్పుపడుతూ...

ఈ సందర్భంగా కేశినేని శ్వేత మీడియాతో మాట్లాడుతూ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తమతో టీడీపీ పెద్దలు వ్యవహరించిన తీరును తీవ్రంగా తప్పుపట్టారు. కేశినేని నానికి ఈ దఫా టీడీపీ లోక్‌సభ టికెట్‌ రాదనే చర్చతోనే ఈ వ్యవహారం రాజుకుంది. నాని స్థానంలో ఆయన సోదరుడు కేశినేని చిన్నిని దింపే ప్రయత్నాలు చేయడం, ఈ సందర్భంగా జరిగిన కొన్ని పరిణామాలతో హర్ట్‌ అయిన శ్వేత రాజీనామా చేశారు.

నా తండ్రిని తీవ్రంగా అవమానించారు...

ఎంపీగా రెండుసార్లు గెలిచిన ప్రజల మనిషి అయిన తన తండ్రిని తీవ్రంగా అవమానించారని ఈ సందర్భంగా కేశినేని శ్వేత వ్యాఖ్యానించారు. తిరువూరులో జరిగిన పార్టీ కార్యక్రమంలో కేశినేని నానిని ఎందుకు జోక్యం చేసుకుంటున్నారని అడిగిన రోజే అది పెద్ద అవమానంగా భావించామని ఆమె అన్నారు. తమ లోక్‌సభ నియోజకవర్గంలోని అసెంబ్లీలోకి సిట్టింగ్‌ ఎంపీని ఎందుకొచ్చారని అడిగే హక్కు ఎవరికుందని ఆమె సూటిగా ప్రశ్నించారు. పార్టీ అధ్యక్షుడు అక్కడికి వచ్చినప్పుడు సిట్టింగ్‌ ఎంపీకి ఎందుకు సమాచారం లేదని ఆమె నిలదీశారు. త్వరలో భవిష్యత్‌ కార్యాచరణపై ఆలోచిస్తామని ఆమె చెప్పారు. విజయవాడలో రాబోయే ఎన్నికల్లో కేశినేని నానినే ఎంపీగా పోటీచేస్తారని స్పష్టం చేశారు. ఈసారి కూడా గెలిచి మూడోసారి లోక్‌సభలో అడుగుపెడతారని తేల్చి చెప్పారు.

First Published:  9 Jan 2024 3:06 AM GMT
Next Story