Telugu Global
Andhra Pradesh

కేశినేని నానికి బీజేపీ మంత్రి పదవి ఆఫర్ చేసిందా.?

విజయవాడ టీడీపీ ఎంపీ కేశినేని నానికి ప్రజల్లో మంచి ఫాలోయింగే ఉంది. ఆయనను పార్టీలోకి తీసుకొని వచ్చి.. మంత్రి పదవి కట్టబెడితే పార్టీకి మైలేజీ పెరుగుతుందని అధిష్టానం ఆలోచిస్తున్నట్లు సమాచారం.

కేశినేని నానికి బీజేపీ మంత్రి పదవి ఆఫర్ చేసిందా.?
X

తెలుగు రాష్ట్రాల్లో బలంగా ఎదగాలని బీజేపీ భావిస్తోంది. ఉత్తరాదిలో బీజేపీపై వ్యతిరేకత మొదలవ్వ‌డంతో.. అక్కడ కోల్పోయే సీట్లను దక్షిణాదిలో కవర్ చేయడానికి వ్యూహాలు రచిస్తోంది. కర్నాటకలో ఎలాగో బీజేపీ బలంగానే ఉంది. తమిళనాడు, కేరళలో ఇప్పటికిప్పుడు పాగా వేయడం కష్టం. అందుకే తెలంగాణ, ఏపీని తమ తదుపరి లక్ష్యంగా చేసుకుంది. తెలంగాణలో పార్టీ సొంతగా ఎదగాలని ప్రయత్నిస్తోంది. ఇక్కడ బీజేపీకి న‌లుగురు ఎంపీలు ఉన్నారు.. కానీ, ఏపీలో మాత్రం పరిస్థితి వేరుగా ఉంది. ఏదో ఒక పార్టీతో పొత్తు పెట్టుకుంటే కానీ బీజేపీ అసెంబ్లీ, లోక్‌సభ సీట్లను గెలుచుకోలేక పోతోంది. 2014లో టీడీపీతో పొత్తు కారణంగా చెప్పుకోదగిన సీట్లు గెలిచుకుంది. 2019లో పొత్తు లేకపోవడంతో పూర్తిగా చతికిలపడింది. ఒక్క అసెంబ్లీ, లోక్‌సభ సీటును కూడా గెలుచుకోలేక పార్టీ పరిస్థితి హోరంగా దిగజారింది.

2019 సార్వత్రిక ఎన్నికల తర్వాత కూడా ఏపీలో బీజేపీ పరిస్థితిలో పెద్దగా మార్పేమీ లేదు. రాష్ట్రంలో సరైన నాయకత్వం లేకపోవడం.. అధికార వైసీపీ బలంగా ఉండటంతో ఎదిగే అవకాశం లేకుండా పోయింది. వచ్చే ఎన్నికల్లో టీడీపీ, జనసేనతో పొత్తు ఉంటుందని మీడియాలో ప్రచారం జరుగుతోంది. అయితే అంతకు ముందే బీజేపీలోకి ఓ చరిష్మా కలిగిన నేతను తీసుకొని రావాలని జాతీయ నాయకత్వం భావిస్తున్నట్లు తెలుస్తుంది. విజయవాడ టీడీపీ ఎంపీ కేశినేని నానికి ప్రజల్లో మంచి ఫాలోయింగే ఉంది. ఆయనను పార్టీలోకి తీసుకొని వచ్చి.. మంత్రి పదవి కట్టబెడితే పార్టీకి మైలేజీ పెరుగుతుందని అధిష్టానం ఆలోచిస్తున్నట్లు సమాచారం.

సార్వత్రిక ఎన్నికలకు ఇంకా ఏడాదిన్నర పైగానే సమయం ఉంది. ఈలోగా కేశినేని నానిని పార్టీలో చేర్చుకొని మంత్రి పదవి ఇస్తే.. ఏపీలో బీజేపీ బలపడటానికి అవకాశం ఉందని భావిస్తోంది. గత కొంత కాలంగా నాని.. టీడీపీ అధినేత చంద్రబాబుపై కూడా విమర్శలు గుప్పిస్తున్నారు. ఈ క్రమంలో ఆయనకు వచ్చేసారి విజయవాడ టికెట్ వస్తుందో లేదో కూడా అనుమానంగానే ఉంది. మరోవైపు విజయవాడ సీటును కైవసం చేసుకోవడానికి వైసీపీ కూడా ఇప్పటి నుంచే ప్రణాళికలు రచిస్తోంది. ఈ క్రమంలో జాతీయ పార్టీలోకి వెళ్తే భవిష్యత్ ఉంటుందని నాని కూడా భావిస్తున్నట్లు రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది.

ఢిల్లీలోని ఏపీ బీజేపీ సహ ఇంచార్జ్ సునిల్ దియోధర్ ఇంటికి కేశినేని నాని వెళ్లారు. వినాయక చవితి వేడుకలకు నాని వెళ్లినట్లు బయటకు చెప్పినా.. అక్కడ అంతా రాజకీయ చర్చే జరిగిందని ప్రచారం జరుగుతోంది. వచ్చేసారి విజయవాడ టీడీపీ టికెట్ కేశినేని నాని తమ్ముడుకి ఇస్తారనే వ్యాఖ్యలు వినిపిస్తుండటంతోనే.. నాని బీజేపీతో టచ్‌లోకి వెళ్లినట్లు సమాచారం. ఏపీలో సరైన నాయకుడి కోసం ఎదురు చూస్తున్న బీజేపీకి కేశినేని నాని రూపంలో దొరికారని.. మంత్రి పదవి కూడా ఇస్తే.. అధికార వైసీపీకి కూడా చెక్ పెట్టినట్లు అవుతుందని బీజేపీ పెద్దలు అనుకుంటున్నారు. రాబోయే కేంద్ర మంత్రి వర్గ విస్తరణ లోపే నాని పార్టీ మారతారని, ఆయనకు మంత్రి పదవి ఖాయమని ఏపీ రాజకీయ వర్గాల్లో జోరుగా చర్చ జరుగుతోంది.

First Published:  8 Sep 2022 3:36 AM GMT
Next Story