Telugu Global
Andhra Pradesh

బాబు బండారాన్నే బయటపెట్టిన కనకమేడల ప్రశ్న

టీడీపీ ఎంపీ ప్రశ్నకు.. జవాబుగా లక్షా 62వేల కోట్లకు టీడీపీ ప్రభుత్వ హయాంలోనే లెక్కలు గల్లంతు అయ్యాయని కేంద్రం చెప్పడంతో టీడీపీ ఎంపీ షాక్‌ అయ్యారు.

బాబు బండారాన్నే బయటపెట్టిన కనకమేడల ప్రశ్న
X

రాజ్యసభ వేదికగా కేంద్ర ఆర్థిక శాఖ వెల్లడించిన వివరాలు ఆసక్తిగా ఉన్నాయి. జగన్‌ ప్రభుత్వం లెక్కలు చెప్పడం లేదంటూ వాదన చేస్తున్న టీడీపీకి ఈ పరిణామం ఇబ్బందిగా మారింది.

చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న ఐదేళ్ల కాలం ఏకంగా లక్షా 62వేల కోట్ల రూపాయలు లెక్కలు లేవని కేంద్ర ఆర్థిక శాఖ పార్లమెంట్‌లో వెల్లడించింది. కాగ్‌ ఈ అంశాన్ని స్వయంగా తన రిపోర్టులో వెల్లడించిందని.. ఖర్చు వివరాలు ఇవ్వాల్సిందిగా పదేపదే కోరినా నాటి ప్రభుత్వం పూర్తి వివరాలను ఇవ్వలేదని కేంద్రం వెల్లడించింది.

కాగ్ పదేపదే అడిగినా కేవలం 51వేల కోట్లకు మాత్రమే లెక్కలు చూపారని.. మరో లక్షా 11 వేల కోట్లకు ఇప్పటికీ ఖర్చు వివరాలు లేవని స్పష్టం చేసింది. ఈ లక్షా 62వేల కోట్లకు సరైన లెక్కలు చూపకపోవడం 2014-19 మధ్యనే జరిగిందని కేంద్ర ఆర్థిక శాఖ చెప్పడంతో టీడీపీ కంగుతింది. రాష్ట్ర ప్రభుత్వ ఖర్చు వివరాలను తెలపాలంటూ టీడీపీ ఎంపీ కనకమేడల రవీంద్రబాబే ప్రశ్న వేశారు. టీడీపీ ఎంపీ ప్రశ్నకు.. జవాబుగా లక్షా 62వేల కోట్లకు టీడీపీ ప్రభుత్వ హయాంలోనే లెక్కలు గల్లంతు అయ్యాయని కేంద్రం చెప్పడంతో టీడీపీ ఎంపీ షాక్‌ అయ్యారు.

2014 నుంచి 2019 వరకు బడ్జెట్ కేటాయింపులు లేకుండా లక్షా 62వేల కోట్లు ఖర్చు చేసినట్టు నాడు రాష్ట్ర ప్రభుత్వం చెప్పిందని.. కానీ ఆ ఖర్చులకు సంబంధించి తగిన వివరాలు మాత్రం లేవని 2020లో కాగ్ చెప్పిందని.. ఆ తర్వాత రాష్ట్ర ప్రభుత్వం లక్షా 62వేల కోట్ల ఖర్చులో 51వేల కోట్లకు మాత్రమే వివరాలను ఇవ్వగలిగిందని కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరి రాజ్యసభలో సమాధానం ఇచ్చారు.

బాబు చెప్పుతో బాబునే కొట్టారు- విజయసాయిరెడ్డి

వైసీపీ ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టేందుకు ఎంపీ కనకమేడల ప్రశ్న సంధించగా.. కేంద్ర ప్రభుత్వం టీడీపీ హయాంలో మాయమైన నిధుల సంగతి వెల్లడించడంపై వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి స్పందించారు. వైసీపీ ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టేందుకు టీడీపీ ఎంపీ ప్రశ్న వేశారని.. కానీ కేంద్ర ఆర్థిక శాఖ సమాధానంతో చంద్రబాబు తన చెప్పుతో తానే కొట్టుకున్నట్టుగా అయిందని విజయసాయిరెడ్డి ఎద్దేవా చేశారు.

First Published:  20 July 2022 3:23 AM GMT
Next Story