Telugu Global
Andhra Pradesh

టీడీపీని పట్టడం కష్టంగా ఉందా?

వచ్చే ఎన్నికల్లో పులివెందులలో జగన్ ఎలా గెలుస్తారో చూస్తానని పశ్చిమ రాయలసీమ ఎమ్మెల్సీ భూమిరెడ్డి రామగోపాలరెడ్డి శపథం చేశారు. వైసీపీతో పాటు జగన్ పతనం కూడా ప్రారంభమైపోయిందని నానా రచ్చ చేశారు నూత‌న ఎమ్మెల్సీలు. మొత్తానికి టీడీపీ ఎమ్మెల్సీల‌ మాటలు, సవాళ్ళు మామూలుగా లేవు.

టీడీపీని పట్టడం కష్టంగా ఉందా?
X

మామూలుగానే తెలుగుదేశంపార్టీ నేతల మాటలు తట్టుకోవటం కష్టం. అలాంటిది నాలుగు ఎమ్మెల్సీ స్థానాలు గెలిచిన తర్వాత ఇక తమ్ముళ్ళు ఆగుతారా? అందుకనే విపరీతమై ఓవర్ యాక్షన్ చేస్తున్నారు. పట్టభద్రుల కోటా, ఎమ్మెల్యే కోటాలో గెలిచిన న‌లుగురు ఎమ్మెల్సీలు శుక్రవారం ప్రమాణస్వీకారం చేశారు. తర్వాత మీడియాతో మాట్లాడుతూ.. వైసీపీ ప్రభుత్వం మీద తిరుగుబాటు ప్రారంభమైనట్లుగా చెప్పారు. సరే ఇంతవరకు బాగానే ఉంది ఎందుకంటే ఇదే విషయాన్ని జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన‌ దగ్గర నుండి చెబుతునే ఉన్నారు.

ఇక్కడ విషయం ఏమిటంటే వచ్చే ఎన్నికల్లో పులివెందులలో జగన్‌ను ఓడించి చంద్రబాబు నాయుడు, లోకేష్‌కు బహుమతిగా ఇస్తామని పశ్చిమ రాయలసీమ ఎమ్మెల్సీ భూమిరెడ్డి రామగోపాలరెడ్డి శపథం చేశారు. తనను పులివెందుల నుండి గెలవనీయకూడదని జగన్ ఎంత ప్రయత్నించినా తన గెలుపును ఆపలేకపోయినట్లు చెప్పారు. ఇక్కడే వీళ్ళ ఓవర్ యాక్షన్ ఏమిటో బయటపడుతోంది. పట్టభద్రుల నియోజకవర్గమంటే ఒక అసెంబ్లీ నియోజకవర్గం కాదు. మూడు జిల్లాల్లోని కొన్ని నియోజకవర్గాలు కలిపి ఒక నియోజకవర్గం.

ఇందులో పులివెందుల కూడా కలిసుందంతే. ఇంతోటిదానికి తనను పులివెందులలో గెలవనీయకూడదని జగన్ ప్రయత్నించారని భూమిరెడ్డి చెప్పటమేమిటో అర్థంకావటంలేదు. తన గెలుపును అడ్డుకోవాలని వైసీపీ చూసిందని అనటం ఇంకా విచిత్రం. ఎన్నికల్లో ప్రత్యర్ధులను ఓడించేందుకే కదా ఎవరైనా ప్రయత్నిస్తారు? ఇందులో తప్పేముంది? మూడు స్థానాల టీడీపీ గెలుపులో తమ్ముళ్ళ గొప్పదనం కన్నా వైసీపీ నిర్లక్ష్యమే ఎక్కువగా కనబడుతోంది.

వచ్చే ఎన్నికల్లో పులివెందులలో జగన్ ఎలా గెలుస్తారో చూస్తానని రామగోపాలరెడ్డి చాలెంజ్ చేయటం ఆశ్చర్యంగా ఉంది. వైసీపీతో పాటు జగన్ పతనం కూడా ప్రారంభమైపోయిందని నానా రచ్చ చేశారు ఎమ్మెల్సీలు. మొత్తానికి టీడీపీ ఎమ్మెల్సీల‌ మాటలు, సవాళ్ళు మామూలుగా లేవు. రాబోయే ఎన్నికల్లో తమ పార్టీయే గెలుస్తుందని చెప్పుకోవటంలో తప్పులేదు. కానీ వైసీపీని తీసిపారేస్తుండటమే ఆశ్చర్యంగా ఉంది. క్రాస్ ఓటింగ్ చేయించుకుని గెలిచిన అనూరాధ కూడా సొంత పార్టీ ఎమ్మెల్యేల్లోనే జగన్ అంటే తిరుగుబాటు మొదలైపోయిందని రెచ్చిపోయారు.

First Published:  1 April 2023 6:26 AM GMT
Next Story