Telugu Global
Andhra Pradesh

ఓటుకి కోట్లు.. ఒక్కొక్కరిగా బయటికొస్తున్న ఎమ్మెల్యేలు..

ఈరోజు టీడీపీ రెబల్ మద్దాలి గిరి లైన్లోకి వచ్చారు. తనతో కూడా టీడీపీ బేరానికి దిగిందని, కానీ తనకు నిజాయితీ ఉంది కాబట్టి వారికి లొంగిపోలేదు అని చెప్పారు గిరి.

ఓటుకి కోట్లు.. ఒక్కొక్కరిగా బయటికొస్తున్న ఎమ్మెల్యేలు..
X

ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలు ఏపీ రాజకీయాన్ని ఒక్కసారిగా హీటెక్కించాయి. అప్పటికే పట్టభద్రుల కోటాలో మూడు ఎమ్మెల్సీ స్థానాలు కైవసం చేసుకున్న టీడీపీకి ఇవి అదనపు సంతోషాన్నివ్వగా, వైసీపీలో సస్పెన్షన్ల పర్వానికి తెరతీశాయి. అయితే ఈ ఎపిసోడ్ లో ఓటుకి కోట్లు చేతులుమారాయనే ఆరోపణలు మరింత సంచలనంగా మారాయి. వైసీపీ ఎమ్మెల్యేలు 10కోట్లు, 15 కోట్లు, 20 కోట్లు.. ఇలా కుదిరినకాడికి బేరం మాట్లాడుకుని టీడీపీకి ఓట్లు వేశారనే ఆరోపణలు బలంగా వినపడుతున్నాయి. మేం తీసుకోలేదు అనేది ఆ నలుగురి వాదన. ఈ విషయం పక్కనపెడితే.. ఇప్పుడు టీడీపీ నుంచి మాక్కూడా బేరం వచ్చింది అంటూ వైసీపీవైపు వచ్చిన ఇతర పార్టీల ఎమ్మెల్యేలు చెప్పడం విశేషం.

నాతో 10కోట్ల బేరం చేశారు. సిగ్గు, శరం ఉంది కాబట్టి నేను లొంగిపోలేదు అంటూ జనసేన తిరుగుబాటు ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ నిన్న సంచనల వ్యాఖ్యలు చేశారు. ఈరోజు టీడీపీ రెబల్ మద్దాలి గిరి లైన్లోకి వచ్చారు. తనతో కూడా టీడీపీ బేరానికి దిగిందని, కానీ తనకు నిజాయితీ ఉంది కాబట్టి వారికి లొంగిపోలేదు అని చెప్పారు గిరి. టీడీపీ నుంచి బయటకొచ్చి, వైసీపీకి అనుకూలంగా మారిన తర్వాత ఎప్పుడూ లైమ్ లైట్లోకి రాని గుంటూరు వెస్ట్ ఎమ్మెల్యే మద్దాలి గిరి, తొలిసారిగా ఎమ్మెల్సీ ఎన్నికలైపోయాక చంద్రబాబుపై ఆరోపణలు చేస్తూ తెరపైకి వచ్చారు.

కుట్రలు, కుతంత్రాల‌, వెన్నుపోటు రాజకీయాలకు చంద్రబాబుకి పేటెంట్ ఉందన్నారు గిరి. కనీసం పార్టీలో గౌరవం ఇవ్వకపోవడంతోనే టీడీపీని వీడామని చెప్పుకొచ్చారు. గతంలో చంద్రబాబు 23 మంది ఎమ్మెల్యేలను కొనుగోలు చేశారని అన్నారు. జగన్ పై ఉన్న అభిమానంతో తామంతా వైసీపీవైపు వచ్చామని చెప్పారు. ఎమ్మెల్సీ ఎన్నికల తర్వాత తమపై నిందలు వేస్తున్నారని, తాము నీతి, నిజాయితీతో ఉన్నామని చెప్పారు. వారం రోజులుగా తనతో టీడీపీ నేతలు సంప్రదింపులు జరిపారని, ఎమ్మెల్సీ ఎన్నికల్లో తమ అభ్యర్థికే ఓటు వేయాలని బతిమిలాడారని, డబ్బులు ఆశ చూపారని, కానీ తాను లొంగిపోలేదన్నారు.

ఇంతలేట్ ఎందుకు..?

వారం రోజులు బేరసారాలు జరిగితే అప్పుడే మీడియాకెక్కితే టీడీపీ పరువుపోయేది కదా, మరి ఇన్ని రోజులు మద్దాలి గిరి ఎందుకు ఆగినట్టు. రాపాక వరప్రసాద్ ధైర్యం చేసిన తర్వాత గిరి కూడా తనతో జరిగిన బేరం గురించి బయటపడ్డారు. మొత్తమ్మీద ఆ నలుగురిపై సస్పెన్షన్ వేటు తర్వాత, వైసీపీకి అనుకూలంగా మారిన ఎమ్మెల్యేలు ఒకరి తర్వాత ఒకరు ఇలా టీడీపీపై ఆరోపణలు చేస్తూ బయటకు రావడం విశేషం.

First Published:  27 March 2023 12:31 PM GMT
Next Story