Telugu Global
Andhra Pradesh

`గంట`కో మాట.. ప్రస్తుతం కాపు కార్డు.. ఎటో బాట..?

టీడీపీ నుంచి గెలిచినా, వైసీపీ అధికారంలోకి రావడంతో మూడేళ్లకు పైగా మౌనంగా వున్న గంటా ముందస్తు ముచ్చట్ల నేపథ్యంలో మళ్లీ మోగుతోంది. పార్టీ రంగు లేకుండా కాపు కార్డుతో గంటా వస్తున్నారు.

`గంట`కో మాట.. ప్రస్తుతం కాపు కార్డు.. ఎటో బాట..?
X

గంటా శ్రీనివాసరావు పొలిటికల్ టూరిస్టుగా తెలుగు రాష్ట్రాల్లో బాగా ఫేమస్. పార్టీలు మారడం ఆయనకు రాజకీయాలతో పెట్టిన విద్య. ఏ పార్టీ నుంచి గెలిచినా అధికారంలో వున్న పార్టీలో చేరడం గంటా శ్రీనివాసరావు స్టైల్. డిసెంబర్ మొదటివారంలో గంటా వైసీపీలో చేరతారని ప్రచారం సాగింది. అయితే దీనిపై స్పందించిన గంటా తాను పార్టీ మారే ప్రసక్తిలేదని తేల్చేశారు. మీడియాయే తన పార్టీ మార్పు ముహూర్తాలు పెడుతోందని ప్రెస్ మీట్ పెట్టి మరీ చెప్పిన గంటా మళ్లీ మీడియాకి పజిల్ ఇచ్చారు.

టీడీపీ నుంచి గెలిచినా, వైసీపీ అధికారంలోకి రావడంతో మూడేళ్లకు పైగా మౌనంగా వున్న గంటా ముందస్తు ముచ్చట్ల నేపథ్యంలో మళ్లీ మోగుతోంది. పార్టీ రంగు లేకుండా కాపు కార్డుతో గంటా వస్తున్నారు. వంగవీటి రంగా, రాధా మిత్రమండలి ఆధ్వ‌ర్యంలో డిసెంబర్ 26న వంగవీటి రంగా జయంతోత్సవాలు నిర్వహణ అంతా తానై నడిపిస్తున్నారు. ఈ సందర్భంగా కాపునాడు బహిరంగ సభ నిర్వహించనున్నారు. కాపునాడు సభకు పార్టీలకు అతీతంగా ప్రముఖులు అందరినీ ఆహ్వానిస్తామని ప్రకటించారు గంటా. కాపునాడు లక్ష్యం ఏంటో కాలం స్పష్టత ఇస్తుందనడం వెనుక గంటా ప్లాన్ ఏదో ఉందని అర్థం అవుతోంది. టీడీపీలో వున్న రంగా తనయుడు రాధాతోనూ, బీజేపీలో ఉండీలేనట్టున్న కన్నా లక్ష్మీనారాయణతోనూ, టీడీపీ కీలక నేత బోండా ఉమామహేశ్వరరావుతోనూ గంటా భేటీలు రాజకీయ సమీకరణలు కోణంలోనే విశ్లేషిస్తున్నారు.

First Published:  16 Dec 2022 7:38 AM GMT
Next Story