Telugu Global
Andhra Pradesh

లోకేష్‌కి నేత‌ల వినూత్న అండ‌`దండ‌`లు

ప్ర‌కాశం జిల్లాలో లోకేష్‌కి పొగాకు దండ‌తో వెల్క‌మ్ చెప్పారు. ప‌ల్నాడులో బ‌త్తాయిలు, డ్రాగ‌న్ ఫ్రూట్, మిర్చి, పూల దండ‌ల‌తో స్వాగ‌తం ప‌లికారు.

లోకేష్‌కి నేత‌ల వినూత్న అండ‌`దండ‌`లు
X

తెలుగుదేశం పార్టీలో ఇప్పుడు అంతా నారా లోకేష్ హ‌వాయే. ఆయ‌న‌ని ప్ర‌స‌న్నం చేసుకుంటే చాలు అనుకుంటున్నారు టిడిపి నేత‌లు. యువ‌గ‌ళం పాద‌యాత్ర పుణ్య‌మా అని లోకేష్ త‌మ వ‌ద్ద‌కే వ‌స్తుండ‌డం అదృష్టంగా భావిస్తున్నారు. త‌మ ప్ర‌త్యేక‌త ఏదో విధంగా చాటుకోవాల‌ని తాప‌త్ర‌య‌ప‌డుతున్నారు.

యువ‌గ‌ళం పాద‌యాత్ర సుదీర్ఘ షెడ్యూల్ దృష్ట్యా స‌మ‌న్వ‌య క‌మిటీలు కొన్ని అంశాల‌ని రూపొందించాయి. ఇవి క్ర‌మ‌శిక్ష‌ణ‌గా పాటించిన‌ప్పుడే కుప్పం నుంచి ఇచ్చాపురం వ‌ర‌కూ 400 రోజుల‌లో 4000 కిలోమీట‌ర్లు పాద‌యాత్ర స‌కాలంలో పూర్తి చేయ‌గ‌లం అని నిర్ణ‌యించాయి. నారా లోకేష్ కూడా యువ‌గ‌ళం స‌మ‌న్వ‌య క‌మిటీల‌కి కొన్ని సూచ‌న‌లు అంద‌జేశారు. వీటిలో ముఖ్య‌మైన‌ది..ఆర్భాట‌పు స్వాగ‌తాలు, క్రేన్ల‌తో దండ‌లు వేయ‌డాలు వంటివి వ‌ద్ద‌ని తేల్చి చెప్పారు. వీటివ‌ల్ల‌ వ్య‌య‌ప్ర‌యాస‌లు ఎక్కువ అవుతాయ‌ని వీటిని దూరంగా ఉంచాల‌ని కోరారు.

క‌మిటీలు వ‌ద్ద‌ని ముందే చెప్పినా, యువ‌నేత లోకేష్ వారించినా కుప్పంలో ఆరంభ‌మైన క్రేన్ దండ‌లు, వినూత్న మాల‌ల‌తో స్వాగ‌తాలు ఆగ‌డంలేదు. యాపిల్స్, డ్రై ఫ్రూట్స్‌, బ‌త్తాయిలు, చీనీలు దండ‌లు అయిపోయాయి. ప్ర‌కాశం జిల్లాలో లోకేష్‌కి పొగాకు దండ‌తో వెల్క‌మ్ చెప్పారు. ప‌ల్నాడులో బ‌త్తాయిలు, డ్రాగ‌న్ ఫ్రూట్, మిర్చి, పూల దండ‌ల‌తో స్వాగ‌తం ప‌లికారు. ఈ ట్రెండ్ ఇలాగే కొన‌సాగితే... అమ‌లాపురం వాళ్లు కొబ్బ‌రిబోండాలు దండ రెడీ చేసినా ఆశ్చ‌ర్య‌పోన‌క్క‌ర్లేదు.

ఈ వినూత్న‌మైన భారీ మాల‌ల వ‌ల్ల ట్రాఫిక్ స‌మ‌స్య‌లతోపాటు ప్ర‌మాదాలు కూడా పొంచి ఉన్నాయి. ఆర్థికంగా ఎంతో ఖ‌ర్చు కూడా. ఈ ఆర్భాటాలు వ‌ద్ద‌ని యువ‌నేత నారా లోకేష్ చెప్పినా, ఏ ఒక్క నియోజ‌క‌వ‌ర్గ ఇన్‌చార్జి ఒప్పుకునే ప‌రిస్థితి లేదు. త‌మ అభిమానాన్ని చాటుకునేందుకు త‌మ ప్రాంతంలో పంట‌లు, ఉత్ప‌త్తులు, ప్ర‌త్యేక‌త‌ల‌కి చిహ్నంగా వినూత్న‌మైన భారీ గ‌జ‌మాల‌లు సిద్ధం చేస్తున్నారు. త‌న‌పై ఇష్టంతో ఎంతో క‌ష్ట‌ప‌డి ఈ గ‌జ‌మాల‌లు త‌యారు చేయించి తెస్తే, తాను తిర‌స్క‌రిస్తే బాధ‌ప‌డ‌తార‌ని లోకేష్ కూడా కాద‌న‌డంలేదు. దీంతో ఈ డిఫ‌రెంట్ దండ‌లు ట్రెండ్‌గా మారింది.

First Published:  6 Aug 2023 4:25 PM GMT
Next Story