Telugu Global
Andhra Pradesh

గంటా శ్రీనివాసరావు విషయం తేల్చండి.. బాబుకు టీడీపీ నాయకుల రిక్వస్ట్

గంటా శ్రీనివాసరావు ఎలాగూ నార్త్ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తారో లేదో క్లారిటీ లేదు. కనీసం ఆయన పార్టీ కార్యక్రమాలకు కూడా హాజరు కావడం లేదు. అందుకే గంటా విషయాన్ని త్వరగా తేల్చేయాలని తెలుగుదేశం నాయకులు బాబును రిక్వెస్ట్ చేశారు.

గంటా శ్రీనివాసరావు విషయం తేల్చండి.. బాబుకు టీడీపీ నాయకుల రిక్వస్ట్
X

తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు వచ్చే ఎన్నికల్లో తిరిగి అధికారంలోకి రావడానికి అవసరమైన మార్గాలన్నీ అన్వేషిస్తున్నారు. ఓ వైపు కలిసి వచ్చే పార్టీలతో పొత్తు కోసం ఇప్పటి నుంచే ప్రయత్నాలు చేస్తున్న చంద్రబాబు.. మరోవైపు నియోజకవర్గాల్లో సరైన అభ్యర్థుల కోసం కసరత్తు చేస్తున్నారు. తాజాగా చంద్రబాబు చేసిన ఓ ప్రకటన రాజకీయ వర్గాల్లో ఆశ్చర్యాన్ని కలిగించడంతో పాటు చర్చనీయాంశంగా కూడా మారింది. రాబోయే ఎన్నికల్లో సిట్టింగ్ ఎమ్మెల్యేలు అందరికీ టికెట్లు కేటాయిస్తామని బాబు ప్రకటించారు. మామూలుగా అయితే నామినేషన్ల గడువు ముగిసే వరకు బీ-ఫామ్‌లు ఇవ్వకుండా ఇబ్బంది పెట్టే చంద్రబాబు ఏడాదిన్నర ముందుగానే ఈ ప్రకటన చేయడం ఆశ్చర్యాన్ని కలిగించింది. గత ఎన్నికలకు ముందు వైఎస్ జగన్ కూడా ఇలా చాలా ముందుగానే అభ్యర్థులను ప్రకటించి అభ్యర్థుల విషయంలో గందరగోళం లేకుండా చేసుకున్నారు.

చంద్రబాబు కూడా వైఎస్ జగన్ దారిలోనే ముందుగానే సిట్టింగుల విషయం తేల్చేశారు. అయితే టీడీపీ గత ఎన్నికల్లో గెలిచిందే 23 సీట్లు. అందులో నలుగురు ఎమ్మెల్యేలు ఎప్పుడో పార్టీని వీడి వెళ్లిపోయారు. ఇక మిగిలిన 19 మందిలో ఒకటి తాను, మరొకటి బాలయ్య పోనూ.. 17 మందికి చంద్రబాబు భరోసా ఇచ్చారని చెప్పుకుంటున్నారు. అయితే ఈ 17 మందిలో ఓ టీడీపీ ఎమ్మెల్యే అసలు పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు. విశాఖపట్నం నార్త్ నుంచి గెలుపొందిన గంటా శ్రీనివాసరావు టీడీపీ త‌ర‌ఫున‌ ఎమ్మెల్యేగా గెలిచినా.. గత మూడేళ్లుగా పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు. చంద్రబాబు పాల్గొనే కార్యక్రమాలకే కాకుండా నియోజకవర్గంలో జరిగిన మినీ మహానాడులో కూడా పాల్గొనలేదు. గత కొంత కాలంగా అధిష్టానానికి పూర్తిగా దూరమయ్యారు. గంటా శ్రీనివాసరావు రాజకీయాల్లో కొనసాగడానికి అయిష్టంగా ఉన్నారని, అందుకే పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి.

గంటా శ్రీనివాసరావు రాజకీయ జీవితాన్ని చూస్తే.. వరుసగా రెండో సారి ఏ నియోజకవర్గం నుంచి కూడా పోటీ చేయలేదు. 1999లో అనకాపల్లి లోక్‌సభ నియోజకవర్గం నుంచి పోటీ చేసి గెలిచారు. 2004లో చోడవరం అసెంబ్లీ సెగ్మెంట్ నుంచి టీడీపీ తరపున పోటీ చేసి గెలిచారు. 2009లో అనకాపల్లి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ప్రజారాజ్యం పార్టీ తరపున, 2014లో భీమిలి నియోజకవర్గం నుంచి టీడీపీ తరపున పోటీ చేసి గెలిచారు. ఇక 2019లో విశాఖపట్నం నార్త్ నియోజకవర్గానికి మారారు. ప్రతీ సారి నియోజకవర్గం మారి అసెంబ్లీలోకి ఆయన అడుగు పెడుతున్నారు. 2024లో కూడా ఆయన నియోజకవర్గం మారతారని.. అందుకే విశాఖపట్నం నార్త్ నియోజకవర్గంపై అంతగా ఫోకస్ చేయట్లేదని టీడీపీలో చర్చ జరుగుతుతోంది.

గంటా శ్రీనివాసరావు ఎలాగూ నార్త్ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తారో లేదో క్లారిటీ లేదు. కనీసం ఆయన పార్టీ కార్యక్రమాలకు కూడా హాజరు కావడం లేదు. అందుకే గంటా విషయాన్ని త్వరగా తేల్చేయాలని తెలుగుదేశం నాయకులు బాబును రిక్వెస్ట్ చేశారు. గంటా కారణంగా సెగ్మెంట్‌లోని కార్యకర్తలు సందిగ్ధంలో ఉన్నారు. అసెంబ్లీకి కూడా సరిగా రాని గంటా శ్రీనివాసరావుకు టికెట్ ఇచ్చినా గెలిచే పరిస్థితి లేదని సొంత పార్టీ నేతలే వ్యాఖ్యానిస్తున్నారు. అందుకే కనీసం నియోజకవర్గ ఇంచార్జిని అయినా ప్రకటించాలని చంద్రబాబును కోరుతున్నారు. ఆయన అందుబాటులో లేకపోవడం వల్ల ప్రభుత్వ వ్యతిరేకతను జనసేన, బీజేపీ క్యాష్ చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నాయని వాపోతున్నారు. పార్టీ శ్రేణులను తిరిగి సమన్వయం చేసుకోవడానికి ఇంచార్జీని నియమించాలని.. గంటానే నమ్ముకుంటే నియోజకవర్గంలో గెలవడం కష్టమని చెప్పారు. దీంతో చంద్రబాబు ఈ నియోజకవర్గంపై మరోసారి సమీక్ష చేస్తానని చెప్పారు. గతంలో గంటా శ్రీనివాసరావును పిలిపించుకొని చంద్రబాబు మాట్లాడారు. దీంతో పరిస్థితి చక్కబడుతుందని టీడీపీ శ్రేణులు భావించాయి. కానీ పరిస్థితిలో మాత్రం ఎలాంటి మార్పు లేకపోవడంతో స్థానిక క్యాడర్ ఆందోళనలో మునిగిపోయింది.

First Published:  17 Sep 2022 12:15 PM GMT
Next Story