Telugu Global
Andhra Pradesh

మ్యానిఫెస్టోకు వెరైటీ ప్ర‌చారం

రాజమండ్రి మహానాడు వేదిక‌గా టీడీపీ అధినేత‌ చంద్రబాబు ప్రకటించిన మొదటి విడత మ్యానిఫెస్టోకు తూర్పు గోదావరి జిల్లాలోని నేతలు విస్తృత ప్రచారం కల్పిస్తున్నారు. ఇద్దరి ముగ్గురి నేత‌ల‌ ప్రచారశైలి వెరైటీగా ఉంటోంది.

మ్యానిఫెస్టోకు వెరైటీ ప్ర‌చారం
X

రాజమండ్రి మహానాడులో చంద్రబాబు నాయుడు ప్రకటించిన మొదటి విడత మ్యానిఫెస్టోకు తూర్పు గోదావరి జిల్లాలోని నేతలు విస్తృత ప్రచారం కల్పిస్తున్నారు. ఇద్దరి ముగ్గురి ప్రచారశైలి కూడా వెరైటీగా ఉంటోంది. పెద్దాపురం నియోజకవర్గానికి చెందిన గుణ్ణం చంద్రమౌళి పార్టీలో బాగా కష్టపడుతున్నారు. మహానాడును సక్సెస్ చేయటం కోసం గుణ్ణం చాలా కష్టపడ్డారు. రాబోయే ఎన్నికల్లో పెద్దాపురంలో టికెట్ కూడా ఆశిస్తున్నారు. ఈయన మ్యానిఫెస్టో ప్రచారానికి సోషల్ మీడియాను వేదికగా చేసుకున్నారు.

ఈ నేత సోషల్ మీడియా అంటే ఫేస్ బుక్, ట్విట్టర్, యూట్యూబ్ లాంటి వేదికల్లో బాగా బిజీగా ఉంటారు. ఈయనకు చెప్పుకోదగ్గ సంఖ్యలో ఫాలోవర్లు కూడా ఉన్నారు. అందుకనే చంద్రబాబు ప్రకటించిన మొదటి విడత మ్యానిఫెస్టోలోని పాయింట్లను ఒక్కోటి వివరించి చెబుతున్నారు. గుణ్ణం కష్టానికి లైకులు, రీ పోస్టులు, రీ ట్వీట్లతో ఫాలోవర్లు స్పందిస్తున్నారు. ఇక గోపాలపురం ఇన్‌చార్జి మద్దిపాటి వెంకటరాజు రూటు కూడా సపరేటుగానే ఉంది. వెంకటరాజు ఏం చేస్తున్నారంటే మ్యానిఫెస్టోతో డైరెక్టుగా విద్యార్థులను టార్గెట్ చేస్తున్నారు.

రాజు విద్యార్ధులను ఎందుకు టార్గెట్ చేసుకున్నారంటే.. జిల్లాలోని ప్రతి విద్యార్థికి చాలావరకు వ్యవసాయ బ్యాక్ గ్రౌండే ఉంటుంది. విద్యార్థుల‌కు ఇస్తానన్న నిరుద్యోగ భృతిని వివరించటంతో పాటు రైతులకు ఏడాదికి రూ.20 వేలు ఇస్తామన్న చంద్రబాబు హామీని రాజు వివరిస్తున్నారు. పనిలోపనిగా మహిళలకు జిల్లాలో ఉచిత బస్సు ప్రయాణం, ఏడాదికి మూడు గ్యాస్ సిలిండర్ల పంపిణీని కూడా వివరిస్తున్నారు. కాలేజీలు, కోచింగ్ సెంటర్లకు నేరుగా వెళ్ళి విద్యార్థులతో డైరెక్టుగా మాట్లాడుతున్నారు. యువతను, వాళ్ళద్వారా కుటుంబ సభ్యులను పార్టీ వైపు మళ్ళించటమే రాజు ఉద్దేశం.

ఇక పిఠాపురంలో మాజీ ఎమ్మెల్యే ఎన్‌వీఎస్ఎస్ వర్మ కూడా దాదాపు ఇలాగే మ్యానిఫెస్టోకు ప్రచారం కల్పిస్తున్నారు. మ్యానిఫెస్టోను పట్టుకుని వర్మ నేరుగా రైతులను కలుస్తున్నారు. పొలాల్లోకి వెళ్ళి రైతులను కలవటం అంటే రైతు కూలీలు, మహిళా రైతులను కూడా కలిసినట్లే కదా. రైతులకు ఏడాదికి రూ. 20 వేలు ఇస్తామన్న హామీని వివరిస్తున్నారు. అలాగే మహిళలకు గ్యాస్ సిలండర్లు, జిల్లాలో ఉచిత బస్సు ప్రయాణం, ఇంట్లో ఎంతమంది ఆడవాళ్ళుంటే అంతమందికీ నెలకు తలా రూ.1500 వస్తాయన్న హామీని గట్టిగా చెబుతున్నారు. మరి వీళ్ళ శ్రమకు ప్రతిఫలం కనబడుతుందో లేదో.

First Published:  2 Jun 2023 5:36 AM GMT
Next Story