Telugu Global
Andhra Pradesh

వాహనాల కుంభకోణం కేసు.. జేసీ బ్రదర్స్ ఆస్తులు అటాచ్ చేసిన ఈడీ

బీఎస్-4 వాహనాల స్కాంలో రూ. 38.36 కోట్ల కుంభకోణం జరిగినట్లు ఈడీ ఆరోపిస్తున్నది. దీనిలో భాగంగానే రూ. 6.31 కోట్ల విలువైన నగదు, ఆభరణాలు, బ్యాంకు డిపాజిట్లు, రూ. 15.79 కోట్ల విలువైన 68 చరాస్తులు అటాచ్ చేశారు.

వాహనాల కుంభకోణం కేసు.. జేసీ బ్రదర్స్ ఆస్తులు అటాచ్ చేసిన ఈడీ
X

వాహనాల కుంభకోణం కేసులో తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత జేసీ ప్రభాకర్ రెడ్డికి ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) షాక్ ఇచ్చింది. ప్రభాకర్ రెడ్డి, ఆయన స్నేహితుడికి చెందిన ఆస్తులను ఈడీ అటాచ్ చేసింది. బస్సుల కుంభకోణం కేసులోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తున్నది. జటాధర ఇండస్ట్రీస్ పేరుతో బీఎస్-3 వాహనాలను తక్కువ ధరకు కొనుగోలు చేసి.. వాటిని బీఎస్-4 వాహనాలుగా మార్పులు చేసినట్లు జేసీ బ్రదర్స్‌పై ఆరోపణలు ఉన్నాయి. ఈ కేసులో ప్రస్తుతం ఈడీ విచారణ జరుపుతున్నది. దివాకర్ రోడ్ లైన్స్, జటాధర ఇండస్ట్రీస్‌కు చెందిన రూ. 22.10 కోట్ల ఆస్తులను ఈడీ అటాచ్ చేసింది.

బీఎస్-4 వాహనాల స్కాంలో రూ. 38.36 కోట్ల కుంభకోణం జరిగినట్లు ఈడీ ఆరోపిస్తున్నది. దీనిలో భాగంగానే రూ. 6.31 కోట్ల విలువైన నగదు, ఆభరణాలు, బ్యాంకు డిపాజిట్లు, రూ. 15.79 కోట్ల విలువైన 68 చరాస్తులు అటాచ్ చేశారు. సుప్రీకోర్టు నిషేధించిన బీఎస్-3 వాహనాలను టీడీపీ నాయకులు జేసీ దివాకర్ రెడ్డి, జేపీ ప్రభాకర్ రెడ్డి కొని అక్రమాలకు పాల్పడ్డారని ఈడీ కేసు నమోదు చేసింది. 154 వాహనాలను జటాధర ఇండస్ట్రీస్ పేరుతో, 104 వాహనాలను గోపాల్‌రెడ్డి అండ్ కో పేరుతో కొనుగోలు చేశారు. వీటిని నాగాలాండ్‌లో రిజిస్ట్రేషన్ చేయించి బీఎస్-4 వెహికిల్స్‌గా ఎన్‌వోసీని అక్రమ పద్దతుల్లో పొందారు.

ఇక నాగాలాండ్‌లో ఎన్‌వోసీ పొందిన వాహనాలను ఏపీ, తెలంగాణ, కర్నాటక, తమిళనాడు, చత్తీస్‌గడ్‌లలో తిరిగి రిజిస్ట్రేషన్ చేయించారు. ఏపీలో 101, తెలంగాణలో 33, కర్నాటకలో 15, తమిళనాడు, చత్తీస్‌గడ్‌లో ఒక్కోటి రీరిజిస్ట్రేషన్ చేయించి ట్రావెల్స్‌లో నడిపించారు. వీటి ఎన్‌వోసీల దగ్గర నుంచి రిజిస్ట్రేషన్లు, బీమా కోసం అన్నీ నకిలీ పత్రాలతోనే పని కానిచ్చారు. ఇక ఎన్‌వోసీ పొందిన వాహనాలను కొన్ని రోజులు నడిపిన తర్వాత వేరే రాష్ట్రాలకు చెందిన వారికి అమ్మేసేవాళ్లు. ఈ కుంభకోణంపైనే ఈడీ దర్యాప్తు చేస్తోంది.

జేసీ బ్రదర్స్ దగ్గర నుంచి వాహనాలు కొనుగోలు చేసిన ఇతర యజమానులు తాము మోసపోయినట్లు గ్రహించారు. వారిలో కొందరు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో మొత్తం కుంభకోణం బయటకు వచ్చింది. విచారణలో భాగంగా పోలీసులు నేషనల్ ఇన్స్యూరెన్స్ కార్పొరేషన్ రికార్డులు పరిశీలించగా.. నకిలీ పత్రాలు దొరికాయి. దీంతో అనంతపురం రవాణా శాఖ డిప్యుటీ కమిషనర్ వారిపై 2020 జూన్‌లో ఫిర్యాదు చేశారు.

వాహనాల కుంభకోణం కేసులో పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఇందులో జేసీ ప్రభాకర్ రెడ్డి, జేసీ అస్మిత్ రెడ్డితో పాటు 23 మందిని చేర్చారు. కేసు విచారణ సమయంలో ప్రభాకర్ రెడ్డి, అస్మిత్ రెడ్డి జైలుకు కూడా వెళ్లొచ్చారు. అయితే భారీ ఆర్థిక లావాదేవీలు ఇందులో ఇమిడి ఉండటంతో ఈడీ కూడా ఎంట్రీ ఇచ్చింది. వాళ్ల విచారణలో భాగంగానే తాజాగా ఆస్తులు అటాచ్ చేసింది.

First Published:  30 Nov 2022 11:13 AM GMT
Next Story