Telugu Global
Andhra Pradesh

యువగళంలో మళ్లీ రచ్చ.. ప్రొద్దుటూరు టికెట్ పంచాయితీ

చివరి రోజు కూడా ఆయన్ని ప్రశాంతంగా యాత్ర చేసుకోనివ్వలేదు నాయకులు. జమ్మల మడుగులో పాదయాత్ర చేస్తున్న లోకేష్ కి టికెట్ల పంచాయితీ ఎదురైంది.

యువగళంలో మళ్లీ రచ్చ.. ప్రొద్దుటూరు టికెట్ పంచాయితీ
X

మహానాడు కారణంగా గురువారంతో యువగళానికి తాత్కాలిక బ్రేక్ ఇచ్చారు నారా లోకేష్. అయితే చివరి రోజు కూడా ఆయన్ని ప్రశాంతంగా యాత్ర చేసుకోనివ్వలేదు నాయకులు. జమ్మల మడుగులో పాదయాత్ర చేస్తున్న లోకేష్ కి టికెట్ల పంచాయితీ ఎదురైంది. ప్రొద్దుటూరు అసెంబ్లీ టికెట్ విషయంలో నియోజకవర్గ ఇన్ చార్జి ప్రవీణ్ కుమార్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే, టీడీపీ జిల్లా అధ్యక్షుడు లింగారెడ్డి గొడవ పడ్డారు. లోకేష్ ముందే వారు తిట్టుకోవడంతో వారిద్దర్నీ సముదాయించారాయన. చివరకు ఇద్దర్నీ కారవాన్ లోకి తీసుకెళ్లి మరీ వివాదాన్ని ముగించినట్టు తెలుస్తోంది.

లోకేష్ పాదయాత్ర జమ్మలమడుగు చేరుకోగానే ఈ వివాదం చోటు చేసుకుంది. ప్రొద్దుటూరు టికెట్ రేసులో ఉన్న ప్రవీణ్ కుమార్ రెడ్డి, లింగయ్య ఇద్దరూ.. వాగ్వాదానికి దిగినట్లు తెలుస్తోంది. అసెంబ్లీ టికెట్ అంశం ప్రస్తావిస్తూ నారా లోకేష్ ముందే గొడవపడ్డారట. కొంతకాలంగా అంతర్యుద్ధం సాగుతున్నా.. లోకేష్ ముందు బలప్రదర్శన కోసం ఇద్దరూ మరోసారి గొడవపడటంతో వ్యవహారం పెద్దదైంది. దీంతో లోకేష్ స్వయంగా కలుగజేసుకుని సర్దిచెప్పారట.

గొడవలేదు, ఏం లేదు..

లోకేష్ ముందు గొడవపడిన ప్రొద్దుటూరు వైరి వర్గాలు ఆ తర్వాత అసలు గొడవెక్కడ జరిగిందంటూ లాజిక్ తీస్తున్నాయి. సహజంగానే లోకేష్ యాత్రను కవర్ చేసే టీడీపీ మీడియా వీటిని హైలెట్ చేయదు. స్థానిక నేతలు, కార్యకర్తలు తీసిన వీడియోలు మాత్రమే బయటకొచ్చాయి. అయితే లోకేష్ యాత్రలో గొడవేమీ లేదని సర్దిచెబుతున్నారు మాజీ ఎమ్మెల్యే లింగయ్య. అదంతా సోషల్ మీడియాలో జరిగిన తప్పుడు ప్రచారమంటున్నారు. ఇటీవల భూమా అఖిల ప్రయి, ఏవీ సుబ్బారెడ్డి వర్గాల మధ్య జరిగిన గొడవతో టీడీపీలో వర్గపోరు బయటపడింది. ఇప్పుడు ప్రొద్దుటూరు పంచాయితీ కూడా అధిష్టానానికి తలనొప్పిగా మారింది.

First Published:  26 May 2023 2:06 AM GMT
Next Story