Telugu Global
Andhra Pradesh

టీడీపీ నాయకులు చంద్రబాబును పట్టించుకోవడం లేదా?

బాబు వ్యవహార శైలితో విసిగిపోయిన కొంత మంది నాయకులు ఆయనను సైడ్ చేసి సొంత నిర్ణయాలు తీసుకోవడం మొదలు పెట్టారు. వచ్చే ఎన్నికల్లో ఎలాగైనా అధికారంలోకి రావాలని టీడీపీ ప్రయత్నిస్తోంది. చంద్రబాబు ఎన్నడూ లేని విధంగా ముందుగానే సిట్టింగులకు సీట్లు ఇస్తున్నామని ప్రకటించారు.

టీడీపీ నాయకులు చంద్రబాబును పట్టించుకోవడం లేదా?
X

చంద్రబాబు నాయుడు ఒకప్పుడు పార్టీలోనూ, ప్రభుత్వంలోనూ ఏక‌ప‌క్షంగా వ్యవహరించారు. తాను చెప్పిందే వేదం.. చేసిందే శాసనం అనే రీతిలో ఆయన వ్యవహారశైలి ఉండేది. 2014 ఎన్నికల్లో గెలిచిన తర్వాత కూడా అదే డాబు, దర్పాన్ని ప్రదర్శించేవారు. కాగా, 2019 ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత కూడా ఆయనలో ఎలాంటి మార్పు రాలేదని టీడీపీ నాయకులు అంటున్నారు. టీడీపీ పూర్తిగా తన ప్రాభవాన్ని కోల్పోయిందని, క్లిష్టమైన ఈ సమయంలో పార్టీకి పునర్‌వైభవం తీసుకొని రావడానికి అధినేత ముందుండి నడిపించాలని కోరుకుంటున్నారు. కానీ, ఇప్పటికీ చంద్రబాబు ఏక‌ప‌క్షంగానే వ్యవహరిస్తుండటం కొంత మంది సీనియర్లకు నచ్చడం లేదని తెలుస్తోంది. పార్టీలో ప్రజాస్వామ్యం కొరవడిందని, బాబు తప్ప ఎవరూ స్వేచ్ఛగా నిర్ణయాలు తీసుకోలేక పోతున్నారని తెలుస్తోంది.

బాబు వ్యవహార శైలితో విసిగిపోయిన కొంత మంది నాయకులు ఆయనను సైడ్ చేసి సొంత నిర్ణయాలు తీసుకోవడం మొదలు పెట్టారు. వచ్చే ఎన్నికల్లో ఎలాగైనా అధికారంలోకి రావాలని టీడీపీ ప్రయత్నిస్తోంది. చంద్రబాబు ఎన్నడూ లేని విధంగా ముందుగానే సిట్టింగులకు సీట్లు ఇస్తున్నామని ప్రకటించారు. దీంతో ఆయా నియోజకవర్గాల ఇంచార్జులు కూడా తమకే సీట్లు వస్తాయని అనుకుంటున్నారు. ఈ క్రమంలోని కొంత మంది సీనియర్ నాయకులు తమకే టీడీపీ సీటు కేటాయిస్తుందని ప్రచారం చేసుకుంటున్నారు. బాబును సైడ్ చేసి అంతా తామై వ్యవహరిస్తున్నారు. చంద్రబాబు మాట వింటే ఆఖరి నిమిషం వరకు టెన్షన్‌లో పెడతారనే.. ఇలా చేస్తున్నట్లు పార్టీలో చర్చ జరుగుతోంది. ముఖ్యంగా ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా, ఉత్తరాంధ్రకు చెందిన సెగ్మెంట్ల ఇంచార్జీలు తమకే టికెట్లు కన్ఫార్మ్ అని అనుచరులకు చెప్పేశారు.

టీడీపీ టికెట్ కేటాయించిందని చేసుకుంటున్న ప్రచారం చంద్రబాబు వరకు వెళ్లింది. తాను చెప్పకుండా అలా ప్రకటించుకోవడం పట్ల ఆయన అసహనం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. వెంటనే ఆ జిల్లాలకు చెందిన ఎమ్మెల్యేలు చినరాజప్ప, ఆదిరెడ్డి భవానితో పాటు రాజాం టీడీపీ ఇంచార్జి కోండ్రు మురళిని మంగళగిరి పిలిపించుకున్నారు. ముగ్గురితో విడివిడిగా భేటీ అయిన చంద్రబాబు.. పలు నియోజకవర్గాల సమీక్ష కూడా చేశారు. దాదాపు 59 మంది ఇంచార్జులతో సమీక్ష చేసిన బాబు.. కొంత మంది సొంతగా టికెట్లు ప్రకటించుకోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. తాను ఎవరికీ టికెట్ ప్రకటించక ముందు ఇలా ప్రచారం చేసుకోవడం తగదని చెప్పారు. నేను అధికారికంగా ప్రకటించే వరకు ఎవరి టికెట్ ఖరారు కాదని స్పష్టం చేశారు. ఇకపై ఎవరైనా టికెట్ వచ్చిందని ప్రచారం చేసుకుంటే కఠిన చర్యలు తీసుకుంటానని హెచ్చరికలు కూడా చేశారు.

కాగా, పలు నియోజకవర్గాల్లో తమకే టికెట్ వస్తుందని చెప్పుకొని పార్టీ కోసం అహర్నిశలు కష్టపడుతుంటే చంద్రబాబు ఇలా అవమానించడాన్ని నాయకులు జీర్ణించుకోలేక పోతున్నారు. చంద్రబాబు తన తీరును మార్చుకోకుండా.. ఇంకా మోనార్క్‌లా వ్యవహరిస్తే తాము కూడా చేయాల్సింది చేస్తామని తెగేసి చెప్పారు. సిట్టింగులకే కన్ఫార్మ్ చేసి.. కష్టపడుతున్న సిట్టింగులను తక్కువ చేస్తే ఊరుకునేది లేదని పరోక్షంగా హెచ్చరికలు కూడా పంపినట్లు తెలుస్తోంది. టికెట్ల విషయంలో చంద్రబాబును కూడా పట్టించుకోమని.. అంతా తామై నడిపిస్తుంటే.. ఇలా తమపై ఆగ్రహం వ్యక్తం చేయడం బాలేదని కొందరు ఆవేదన వ్యక్తం చేస్తున్నారట. త్వరగా తమ టికెట్ల విషయం తేల్చేస్తే పని చేసుకుంటామని.. లేకపోతే వేరే దారి చూసుకుంటామని హెచ్చరిస్తున్నారు. దీంతో పార్టీలో అసలు చంద్రబాబు మాటకు విలువ లేకుండా పోయిందా అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. చంద్రబాబు అత్యుత్సాహానికి పోయి సిట్టింగులకు సీట్లు అని ప్రకటించారని ఓ వర్గం నాయకులు విమర్శిస్తున్నారు. మొత్తానికి ఒకప్పుడు మోనార్క్ అనిపించుకున్న చంద్రబాబు పరిస్థితి.. రోజు రోజుకూ దిగజారిపోతోందనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి.

Next Story