Telugu Global
Andhra Pradesh

నానీపై లేస్తున్న గొంతులు.. కౌంటర్ పడుతుందా..?

అప్పుల ఊబిలో ఉన్న నాని, ఇప్పుడు 100 కోట్ల రూపాయలు ఎలా సంపాదించారని ప్రశ్నించారు బుద్ధా వెంకన్న. జే టాక్స్ వేయకుండా నాని సొంతానికి డబ్బులు దోచుకుంటున్నారని చెప్పారు.

నానీపై లేస్తున్న గొంతులు.. కౌంటర్ పడుతుందా..?
X

"టీడీపీలో నాకు టికెట్ ఇప్పించింది హరికృష్ణ, ఎన్టీఆర్. అందుకే వారికి రుణపడి ఉంటా, చంద్రబాబుకి కాదు." అంటూ కొడాలి నాని చేసిన వ్యాఖ్యలపై టీడీపీ నుంచి వెంటనే కౌంటర్లు పడుతున్నాయి. కొడాలి నాని విశ్వాస ఘాతకుడని అంటున్నారు టీడీపీ నేతలు. చంద్రబాబు బి-ఫామ్ ఇవ్వనిదే నాని రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలిచారా అని బోండా ఉమ ప్రశ్నించారు. హరికృష్ణ దగ్గర కాఫీ కప్పులు కడిగిన చరిత్ర నానిది అని, తండ్రీ, కొడుకులైన హరికృష్ణ, జూనియర్ ఎన్టీఆర్ మధ్య చిచ్చుపెట్టి కుటుంబాన్ని విడదీశాడ‌ని మండిపడ్డారు. తిన్నింటివాసాలు లెక్కపెట్టే వ్యక్తి నాని అని, రాజకీయ ప్రయోజనాల కోసం కుటుంబాన్ని కూడా తూకానికి, కాటాకి అమ్మే రకం అని తీవ్ర స్థాయిలో విమర్శించారు. జగన్ సీఎంగా దిగిపోగానే చంద్రబాబు లాగే ఆయనపై కూడా నాని విమర్శలు చేస్తారని జోస్యం చెప్పారు ఉమ.

టీడీపీ మహిళా విభాగం అధ్యక్షురాలు వంగలపూడి అనిత కూడా కొడాలి నానిపై ఘాటు వ్యాఖ్యలు చేశారు. కొడాలి నాని గతంలో హరికృష్ణని ముంచేశారని, అందుకే హరికృష్ణ ఆయన్ను తరిమేశారని చెప్పారు. తర్వాత జూనియర్ ఎన్టీఆర్ దగ్గర బాడీ గార్డుగా పనిచేసి, ఆయన్ని కూడా మోసం చేశారన్నారు. ఆ తర్వాత ఎన్టీఆర్ కూడా నానీని దూరంగా పెట్టారని, ఇప్పుడు జగన్‌ కి కూడా నాని టోపీ పెట్టారని అందుకే ఆయన్ను కేబినెట్ నుంచి తరిమేశారని వ్యంగ్యాస్త్రాలు విసిరారు.

గుట్కా నానికి మతి భ్రమించిందని టీడీపీ నేత బుద్ధా వెంకన్న మండిపడ్డారు. నాని గురించి గుడివాడ బస్టాండులో ఎవరిని అడిగినా చెప్తారని అన్నారు. అప్పుల ఊబిలో ఉన్న నాని, ఇప్పుడు 100 కోట్ల రూపాయలు ఎలా సంపాదించారని ప్రశ్నించారు. జే టాక్స్ వేయకుండా నాని సొంతానికి డబ్బులు దోచుకుంటున్నారని చెప్పారు. వైసీపీలో నాని ఓ పెయిడ్ వర్కర్ అని విమర్శంచారు బుద్ధా వెంకన్న.

గతంలో నాని మంత్రిగా ఉండగా.. ఈ స్థాయిలో టీడీపీ నేతలనుంచి ప్రతిఘటన ఎదురు కాలేదు. తొలిసారిగా నానిపై చాలా గొంతులు లేస్తున్నాయి. మరి కొడాలి నాని రియాక్షన్ ఎలా ఉంటుందో చూడాలి.

First Published:  13 Oct 2022 3:31 PM GMT
Next Story